– మాధవ్‌ను కోరిన వీహెచ్‌పీ ప్రతినిధులు
విజయవాడ: ఆంగ్లేయుల పరిపాలన సమయంలో ఆ ప్రభుత్వం హిందూ సమాజాన్ని నియంత్రించాలంటే వారి దేవాలయాలను నియంత్రణలోకి తీసుకోవాలనే కుతంత్రం పన్నింది… ఇందులో భాగంగా దేవాలయాలను వారి ఆధీనంలోకి తీసుకొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిని దేవదాయ ధర్మదాయ శాఖ ద్వార మన ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని వీహెచ్‌పీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో మంగళవారం సమావేశం అయ్యారు. అనంతరం వినతి పత్రం అందించారు. అందులోని వివరాలివి.
హిందువుల అజమాయిషీ నుంచి ప్రభుత్వ అధికారుల నియంత్రణలోకి వెళ్లిన కారణంగా సరైన దిశలో (ఆదర్శ దిశలో) దేవాలయాల నిర్వహణ లేదు. ఈ నేపథ్యంలో ‘మందిరాల విముక్తికై 5 జనవరి 2025న విజయవాడలో ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొని మందిరాలు విముక్తి జరగాలని వారి మనోగతాన్ని ప్రకటించారు, హిందూ సమాజం కూడా మందిరాలను తీసుకోవడానికి సంసిద్ధమవుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ చట్టాన్ని మార్చి హిందూ సమాజానికి దేవాలయాల్ని అప్పగించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల నియంత్రణ నుండి మందిరాలు విముక్తి జరగాలని చాలా కాలంగా ఉద్యమిస్తూ ఉన్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయంలో కలిసి వివరించడం జరుగింది. మీ నేతృత్వంలో మందిరాలు విముక్తి చేసి అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగాను, ఆదర్శంగాను నిలపవలసిందిగా కోరుతున్నాం. ఇందుకోసం విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసింది. దీనిని మీకు అందిస్తున్నాం.
దీనిని పరిశీలించి మీ నాయకత్వంలో ‘మందిరాలు విముక్తి’ జరిగే విధంగా, దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించడానికి మీ నాయకత్వంలో ఈ పనిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో గోకరాజు గంగరాజు(కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్), కేంద్రీయ సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే జీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవి కుమార్, వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రాంత కోశాధ్యక్షుడు దుర్గప్రసాద్ రాజు, తదితరులు ఉన్నారు.