Suryaa.co.in

Telangana

సమరయోధుల త్యాగఫలితమే స్వాతంత్య్రం: తలసాని

అనేక మంది వీరుల త్యాగాల ఫలితంగానే స్వేచ్చాయుత భారతావని ఆవిర్భవించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ లో భారత జాతీయ పతాకంలో ఆవిర్భావం నుండి జరిగిన మార్పులు, చేర్పులను వివరిస్తూ HMDA, ఫ్లాగ్స్ అండ్ పోల్స్, పిల్వెక్స్ సొసైటీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల గురించి, జాతీయ పతాకం రూపొందించడానికి జరిగిన కృషి గురించి తెలియదని పేర్కొన్నారు. 11 సార్లు పలు మార్పులు, చేర్పులు జరిగిన తర్వాత రూపుదిద్దుకున్నది ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న జాతీయ పతాకం అని చెప్పారు.

స్వాతంత్ర పోరాట వీరులను స్మరించుకుంటూ దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపధ్యంలో వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జాతీయ పతాకం చరిత్రను తెలియజెప్పే లా ప్రదర్శనను ఏర్పాటు చేసిన HMDA అధికారులను మంత్రి అభినందించారు. అదేవిధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రభుత్వం గాంధీ చిత్రాన్ని అన్ని థియేటర్ లలో ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 8 నుండి 22 వ తేదీ వరకు ప్రతి రోజు పలు కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా ఈ నెల 16 వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన లో ఎక్కడి వారు అక్కడే పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ముందుగా మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ప్యారడైజ్ నుండి సంజీవయ్య పార్క్ వరకు జాతీయ పథకాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో HMDA SE పరంజ్యోతి, EE శంకర్, DE దేవేందర్, పిల్వెక్స్ సొసైటీ నిర్వాహకులు పద్మావతి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE