Suryaa.co.in

Features

కేఏ పాల్ నుంచి బ్రదర్ అనిల్, కల్వరి సతీష్ వరకూ…

– కేఏపాల్, కల్వరి సతీష్ కాపులయితే, అనిల్ బ్రాహ్మణుడు
– ఏపీలో బ్రదర్ సతీష్‌ను తొక్కేస్తున్నారా?
– అంతా మతాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్లిన వారే
– క్రైస్తవులు కళ్లు తెరచుకునేదెప్పుడు?

బ్రదర్ కేఏ పాల్ మంచి ఫామ్‌లో ఉన్న రోజుల్లో ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండేవాడు. కేఏ పాల్ ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లాలన్నా హెలీకాఫ్టర్‌లో వెళ్లేవాడు. తను ఎక్కడైనా స్వస్థత కూటములు పెట్టాలనుకుంటే.. ఆ ప్రాంతం చుట్టుపక్కల హెలీకాఫ్టర్లతో పాంప్లెట్లు చల్లేవారు. మినిమం రెండు నుంచి మూడు లక్షల మంది ఆ కూటాలకు వచ్చేవాళ్లు.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ చిన్న చిన్న కూటాల్లో ప్రసంగీకుడిగా.. హైదరాబాద్ నగరంలోని చర్చీల్లో యూత్ మీటింగ్స్ నడుపుతూ ఉండేవాడు. అక్కడ కేఏ పాల్ అమెరికా మొదలు ఆఫ్రికా ఖండంలోని ఏ దేశాన్నీ వదలకుండా తిరగేస్తూ.. పీస్ మిషన్ అంటూ విమానాలు వేసుకొని తిరిగేవాడు.

కాలం గిర్రున తిరిగింది.. చంద్రబాబు ఓడాడు.. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. మన్మోహన్ ప్రధాని, వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఇక అప్పుడు మొదలైంది కేఏ పాల్‌ని తొక్కడం. విదేశీ నిధులు ఆపారు. సందు దొరికితే కేసులు పెట్టారు. క్రమంగా హెలీకాఫ్టర్లు, విమానాలు పోయాయి.

bro-anil1అదే సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ భారీ సభలు పెట్టడం మొదలు పెట్టాడు. బీభత్సమైన పబ్లిసిటీ.. వర్షం పడినా ప్రెయర్‌తో ఆపేసే శక్తివంతమైన క్రైస్తవ మత ప్రభోదకుడిగా ఎదిగాడు. క్రిస్మస్ పండుగలంటూ రాష్ట్రమంతా హడావిడి కూటాలు. వైఎస్ హయాంలో క్రైస్తవ లోకంలో బ్రదర్ అనిల్ ఎవరెస్టంత ఎదిగిపోయాడు. మణికొండలో పెద్ద చర్చి కట్టాడు. అప్పుడే బ్రదర్ సతీష్ కూడా ఎదుగుతున్న రోజులు..

కాలం మళ్లీ గిర్రున తిరిగింది.. వైఎస్ మరణించాడు, జగన్ కేసుల్లో ఇరుక్కున్నాడు.. బ్రదర్ అనిల్ హవా తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో కల్వరి సతీష్ ఎదుగుతూ వచ్చాడు. కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్లో ప్రతీ ఆదివారం నాలుగు ఆరాధనలు చేసే స్థాయికి ఎదిగాడు. చివరకు ఆసియాలోనే అత్యంత విశాలమైన కల్వరి టెంపుల్‌ను మియాపూర్ సమీపంలో కట్టాడు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనవంతుడైన క్రైస్తవ ప్రచారకుడిగా ఎదిగాడు.

కాల చక్రం రివ్వున తిరిగింది.. వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యాడు. అంతే ఇప్పుడు బ్రదర్ సతీష్‌ను తొక్కడం స్టార్ట్ చేశారు. అతడు ఇంత అవినీతి పరుడు.. అంత అవినీతి పరుడు.. డిజిటల్ స్క్రీన్స్ పెట్టి ఆరాధన చేస్తాడు.. అహంకారం అంటూ సోషల్ మీడియాలో ఇటీవల దాడి మొదలైంది. క్రైస్తవుల్లో అత్యధికులు దళితులే.. కాని పైన ఉదహరించిన మత ప్రచారకుల్లో ఒక్కరు కూడా దళితులు కాదు. ఇక్కడ కేఏ పాల్ లేదా బ్రదర్ అనిల్ లేదా బ్రదర్ సతీష్ ఎవరూ సుద్దపూసలు కాదు పరిశుద్దులు కారు. అందరూ మత ప్రచారాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన వాళ్లే.

కేఏ పాల్, సతీష్ ఇద్దరూ కాపులు అయితే, బ్రదర్ అనిల్ బ్రాహ్మణుడు. కానీ దళిత క్రైస్తవులు మాత్రం వీరికోసం వర్గాలుగా విడిపోయారు. పార్టీల పరంగా.. కులాలపై అభిమానంతో విడిపోయి సోషల్ మీడియాలో బురదజల్లుకుంటున్నారు.

మతం అనేదే ఒక మత్తు అంటే అందులో పీక్ స్టేజిలో తెలుగు క్రైస్తవులు ఉన్నారని ఈ మధ్య అర్థమైంది. వాళ్లది పరిచర్యో.. మత ప్రచారమో కాదు.. పక్కా వ్యాపారం. ఇది క్రైస్తవులు ఎప్పుడు తెలుసుకుంటారో..!

– చెన్ను సుబ్రమణ్యం

LEAVE A RESPONSE