Suryaa.co.in

Andhra Pradesh

ఇకపై పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీ వారి దర్శన భాగ్యం

– శ్రీ వారి భక్తులకు శుభవార్త
– టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వినతి కి తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– తిరుమల శ్రీవారి దర్శన సౌకర్యాలను పునరుద్ధరించనున్న పర్యాటక శాఖ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వెలగపూడి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన సౌకర్యాల విషయమై ముఖ్యమైన చర్చ జరిగింది.

గత కాలంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన ప్యాకేజీలను అందించడం జరిగేది. అయితే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు మరియు అవకతవకల కారణంగా ఈ సదుపాయాన్ని రద్దు చేయవలసి వచ్చింది. దీని వలన పర్యాటక శాఖకు గణనీయమైన ఆదాయ నష్టం వాటిల్లింది.

ఈ పరిస్థితిని సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ , ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి వారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో సమన్వయం చేసుకొని దర్శన ప్యాకేజీలను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

ఈ నిర్ణయంతో భక్తులకు మరింత సులభంగా శ్రీవారి దర్శనం లభించడమే కాకుండా, పర్యాటక శాఖకు కూడా అదనపు ఆదాయం లభించనుంది. దీనివల్ల రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా:
– ప్రత్యేక దర్శన ప్యాకేజీల ప్రణాళిక రూపకల్పన
– భక్తుల సౌకర్యార్థం అదనపు సేవల కల్పన
– పారదర్శక నిర్వహణ విధానాల అమలు
– ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ ఏర్పాటు
– భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రవాణా సదుపాయాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
“భక్తుల సౌకర్యం మరియు పర్యాటక శాఖ అభివృద్ధి రెండింటినీ సమానంగా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే ఈ సేవలు భక్తులకు అందుబాటులోకి వస్తాయి” అని డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు.

LEAVE A RESPONSE