సికింద్రాబాద్ పరేడని మైదానంలో ఇటీవల జరిగిన బిజెపి విజయ సంకల్ప భారీ బమిరంగ సభలో గాయకుడు గద్దరం కనిపించాడు. కొన్ని వారాల క్రితం తుక్కుగూడలో జరిగిన బిజెపి బహిరంగ సభలో హెూంమంత్రి అమిత్ షాను గద్దర్ చాటుమాటుగా కలిశారు. సిద్ధాంత రీత్యా ఉప్పు-నిప్పులా ఉండే వీరిమధ్య సమావేశం, పలకరింపు కొంత ఆశ్చర్యం కలిగించింది.
అవకాశవాదమూ కనిపించింది. ఆ భేటీకి కొన్ని రోజుల ముందు కాంగ్రెసు జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని హైదరాబాద్ లో గద్దర్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. తనదైన శైలిలో, గారడీ మాటలతో, కొన్ని పాటల మకుటాలతో ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. ఆయన మాటల్లో గందరగోళం – అస్పష్టత తప్ప మరొకటి కనిపించలేదు. రాహుల్ కు సలహా – సూచనలు ఇచ్చానని, ఆయన శ్రద్ధగా విన్నారని విన్నవించుకున్నాడు. దేశంలో రైతు వినియోగదారుడు (కన్జూమర్)గా మారాడన్న తన పరిశీలనను కాంగ్రెసు అగ్రనాయకునితో చెప్పినట్టు వివరించాడు. ఈ ఒక్క మాటతో ఆయన పరిశీలన – విచక్షణ, విజ్ఞత ఏపాటిదో తేటతెల్లమవుతోంది.
ప్రజాస్వామ్యంలో… మార్కెట్ ఎకానమీలో రైతులతో సహా అందరూ వినియోగదారులే. రైతేరాజు అన్నమాట యథాతథంగా స్వీకరించడం అమాయకత్వం తప్ప మరొకటికాదు. వర్తమానంలో రాజులు – సామంతులు అంటూ ఎవరూ లేరు. అది ఉపమానం మాత్రమే! మార్కెట్ ఎకానమీలో ప్రతివ్యక్తి వినియోగదారుడే. ఒక్క రైతే అనిన దినుసులు పండించి, అన్ని తయారు చేయలేడు. వినియోగదారుడయితే నేరమన్నట్లు భావించడం భావదారిద్ర్యం తప్ప మరొకటి కాదు. ఇదే సూత్రం పారిశ్రామిక ఉత్పత్తులకూ వర్తిస్తుంది. దీన్ని విస్మరించి ఊహాత్మక ఆలోచనలతో, ఆచరణకు సాధ్యంకాని రెక్కల గుర్రాల మీద స్వారీ చేస్తూ మాట్లాడడం గద్దర్ పూర్వాశ్రమంలో మావోయిస్టులతో కలిసి పనిచేసినప్పుడు అలవడిన జాడ్యం. మవోలు తమ పార్టీ నుంచి బహిష్కరించినా గద్దర్ ఆ ఊహల్లో, ధోరణిలో ఇంకా కొనసాగడం విషాదం. పార్టీలోనుంచి వెలికి గురయినా ఆ పరిభాషను వదులుకోకపోవడం విచిత్రం. అందులోంచే ఈ గందరగోళం ఆవిర్భవించింది. ఆ “సంధి” కాలం సమస్యతోనే ఆయన సతమతమవుతూ ఉన్నాడనిపిస్తోంది. అందుకే ఆయన మాట – ప్రవర్తన, వేసే అడుగు చుట్టూ అంతా గందరగోళం కనిపిస్తోంది. గతంలో వైఎస్ఆర్, జానారెడ్డితో తిరిగిన గద్దర్ గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయనలో ఈ గందరగోళ పరిస్థితి ఉచ్ఛస్థాయికి చేరింది, పతాకస్థాయికి చేరింది. అదిప్పుడు పునరావృతం అవుతోందనిపిస్తోంది. ఆ రోజుల్లో ఆయన పడిన హైరానా…. హడావుడి, ఆత్రం – తాపత్రయం అంతా కళ్ళముందు కదలాడుతోంది.
అప్పుడు కాంగ్రెసును భుజాలకెత్తుకుని పాటలు – పద్యాలు పాడుతూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అహరహం ప్రచారకర్తగా పనిచేశాడు, శ్రమించాడు. వేదికలపై రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకున్నాడు…. ఎందుకయ్యా అంటే, తన పుత్రరత్నం సూర్యానికి కాంగ్రెసు టికెట్ దక్కించుకునేందుకు, వీలయితే గజ్వేల్ నియోజకవర్గం నుంచి తాను బరిలో దిగేందుకు… గద్దర్ ఏమిటి? పుత్రవాత్సల్యంతో ఇంతగా రంగులు మార్చడం ఏమిటి?….. చివరికి అప్పుడు కాంగ్రెసు భాగస్వామిగా ఉన్న చంద్రబాబునాయుడు కడుపులో తల పెట్టి, టికెట్ సాధించేందుకు పడరాని పాట్లు పడలా? ఆ సంగతి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరవరు. తన కుమారుడికి కాంగ్రెసు పార్టీ టికెట్ కోసం, తన పలుకుబడి పెంచుకోవడం కోసం రాష్ట్ర కాంగ్రెసు నాయకుల ఇళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఎక్కే గడప, దిగే గడపగా తిరుగుతూ పరిపరి దండాలు పెట్టడం, ప్రాపకం కోసం పాకులాడటం జనం జీర్ణించుకునే చర్యలేనా అవి?…. గారడి మాటలు – విదూషక ఆటలు, విచిత్ర విన్యాసాల ద్వారా ఆయన డొల్లతనం, క్రమశిక్షణా రాహిత్యం , లబ్ధి మీద లబ్ధి, ప్రయోజనాలు అందుకోవాలన్న ఆత్రుత, దురాశ స్పష్టంగా వెలుగుచూసింది.
ఒకప్పుడు తన ఆట – పాట – మాట ద్వారా పదివేలమంది యువతీ యువకులను గెరిల్లాలుగా మార్చి దండకారణ్యలోకి ఇతర అరణ్యాలలోకి పంపానని తానే స్వయంగా అనేకసార్లు బహిరంగంగా ప్రకటించాడు. అలా యువతను ఉద్రేక పరిచి,ఉద్యమాల వైపు ఆకర్షించి, అడవిబాట పట్టించి, బలిదానాలకు ఉసిగొల్పి, బలిపీఠాలను ఎక్కించి ఎంతో మంది అమరులయ్యేందుకు కారణమైన గద్దర్ ఇప్పుడు ఇలా ఊసరవెల్లిలా రంగులు మార్చి ఓట్ల రాజకీయంతో ఓ వెలుగు వెలిగిపోవాలని ఉబలాటపడటం భావ్యమా?…. తగునా?…
మావోయిస్టు ఉద్యమంలోకెళ్ళిన ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి, ఛిద్రమయ్యాయి. ఎందరో కేసుల్లో ఇరుక్కున్నారు. కోర్టుల చుట్టూ ఇంకా తిరుగుతున్నారు. చేతికందినవారిని కోల్పోయి దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నవారు కోకొల్లలు…. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకుడైన గద్దర్ ఇలా పలుకుబడి గల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పబ్బం గడుపుకుంటూఉంటే అదెలా ఆహ్వానించదగ్గ అంశమవుతుంది?…. వ్యక్తిగత లబ్దికోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను విస్తృత పరిచేందుకు మరింత పలుకుబడి పెంచుకుని మరింత ఎత్తుకు ఎదగడానికి రాజకీయ క్రీడ ఆడటం మర్యాదకరంగా ఉంటుందా?….
అజ్ఞాతంలోకి వెళ్ళి, అరణ్యాలలో అసువులు బాసిన అమరుల కుటుంబాలకు కనీసం క్షమాపణ చెప్పకుండా ఇంతలా బోర విరుచుకుని బరితెగించడం భావ్యమా?……. బుల్లెట్ రాజకీయంతో ఉర్రూతలూగించి, యువతను ఉరి కొయ్యల కెక్కించి, బంగారు భవిష్యత్ గల ఎందరో విద్యావంతులు, పేదలు పోరాటంలో నేలకొరిగిన సంగతిని జ్ఞాపకాలనుంచి తుడిపేసి బ్యాలెట్ రాజకీయం చేయడం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ధర్మపన్నాలు వల్లించడం వివేకవంతమనిపించుకుంటుందా?……
తనకిప్పుడు 75 సంవత్సరాల వయసని, తన శరీరంలోకి తూటాదిగి 25 సంవత్సరాలవుతోందని గద్దర్ మాటిమాటికీ గుర్తుచేస్తూ ఉంటాడు. సానుభూతిని ప్రోది చేసుకొని కొత్తగా మరింత లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు తప్ప తన పాట – మాట విని అరణ్యాల పాలై అసువులు బాపి, తిరిగిరాని లోకాలకు చేరుకున్నవారిని స్మరించిన పాపాన పోలేదు. వారి కుటుంబాలను పలకరించిన దాఖలాలు లేవు.
అసలు మావోయిస్టు పార్టీ తనను ఎందుకు బహిష్కరించింది…… అందులోని మర్మమేమిటి?…. ఆ “చీకటి కోణాల”ను మాత్రం ఆయన బటపెట్టడు. తన శరీరంలోకి తూటా దిగిందని పునఃపునః ప్రస్తావిస్తూ, గందరగోళ పదాలతో, పల్లవులతో ఆకర్షించి తన స్థానం చెక్కుచెదరలేదని చాటుకునేందుకు నానా యాతన పడుతూ విదూషక పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడు. చివరకు సినీనటుడు చిరంజీవి పాల్గొన్న సభలో ప్రత్యక్షమై ఛలోక్తులతో ఆకర్షించేందుకు ఆరాటపడటం, గుళ్లు – గోపురాల చుట్టూ తిరిగి స్తోత్రాలు చేయడం, ఆశువుగా పదాలు అల్లి పదిమందిని ఆకర్షించడం చూస్తే ఇదంతా ‘బహురూపి’ తత్వాన్ని బట్టబయలుచేస్తుంది తప్ప, గొప్ప తాత్వికత అని గొప్పలు పోతూ కాంగ్రెసు – బిజెపి నాయకుల చుట్టూ, పలుకుబడి గలవాళ్ళ చుట్టూ ప్రదక్షణలు చేయడం ఆయనకే చెల్లింది. ఇది ద్వైద్వీభావమని, ద్వంద్వ ప్రమాణమని, ప్రజలను వంచించడమన్న వీసమెత్తు వెరపు, సోయి లేకపోతే ఎలా?…. ప్రజలారా పారాహుషార్.!….. జ్ఞానమొక్కటే నిలిచి వెలగును అన్న ప్రజాకవి గురజాడ అప్పారావు మాటల్ని అందరం సదా గుర్తుంచుకుందాం!….
-వుప్పల నరసింహ
సీనియర్ జర్నలిస్టు,
తెలంగాణ సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత