Suryaa.co.in

Features

అష్ట దిక్కుల గాలుల లాభ నష్టాలు

భౌగోళిక పరిస్థితులను బట్టి, సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు.

అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్నీ ఒకే రకంగా ఉండవు. ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది. అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో ఋతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులకు కొంత ఆరోగ్యము, కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం.

దక్షిణ దిక్కు గాలులు

ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి. ఇవి మలయ పర్వతం మీదుగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడుతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి, చేదు, వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి.

నైరుతి గాలులు

జూన్, జూలై నెలలలో వచ్చే గ్రీష్మ ఋతువు లో. నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వల్ల ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు.

పడమర గాలులు

ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పోతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి.

వాయువ్య దిక్కుల గాలులు

అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం. కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది.

తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు

డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి. తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి.

ఆగ్నేయ గాలులు

ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.

 

LEAVE A RESPONSE