( సంతోషి దహగాం)
వారు చదవని శాస్త్రం లేదు. రాయని కావ్యం లేదు. దర్శించని క్షేత్రం లేదు. తపస్సు చేయని ప్రదేశం లేదు. అన్నిటికి మించి అస్పృశ్యతను తొలగించిన సదాచార సంపన్నుడు, భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచిన కర్మిష్టి, లౌకిక సుఖాలని త్యజించి, తన పరపతికోసమో మోజులకోసమో జీవించకుండా భగవత్సుఖాన్ని తాను పొంది, ఇతరులకి పంచిపెట్టిన ఒక తెలుగువాడు ఈ దేశంలో బ్రతికాడు.
ఆయన పేరు అయ్యలసోమయాజుల సూర్య గణపతి శాస్త్రి. కానీ అందరూ పిలిచే పేరు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. ఆయన పేరులోనే ఆయన గొప్పదనం ఉంది. ఆయన గణపతిశాస్త్రిగా జన్మించారు. ప్రతిభతో కావ్యకంఠుడైయారు. తపస్సు చేసి ముని అయ్యారు.
గణపతి శాస్త్రి 1878 నవంబర్ 17 వ తేదీ బహుధాన్య నామ సంవత్సరం కార్తీక బహుళ అష్టమి న విశాఖపట్టణం మండలంలో బొబ్బిలికి ఆరు మైళ్ల దూరంలో ఉన్న కలువరాయి అన్న గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు నరసింహశాస్త్రి, తల్లిపేరు నరసమాంబ. వారి పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది.
వారికి తపస్సు చేసుకోవాలనే బలమైన కోరిక ఉండేది. అందుకోసం ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు. దాంతో వారు కాశీ, ప్రయాగా. నాసిక్ త్రయంబకం వంటి ఎన్నో పవిత్రప్రదేశాలలో వారు తపస్సు చేసి దేవతల అనుగ్రహాన్ని సిద్ధించుకున్నారు.
1900 వ సంవత్సరం గణపతి శాస్త్రి గారి విజయాలలో కొత్త మలుపులు తిరిగిన సంవత్సరం. ఆ సంవత్సరం ఉగాదికి అప్పటి శ్రీకాకుళం జిల్లా మందసా సంస్థానానికి వెళ్లారు. అక్కడ అప్పుడే నవద్వీపంలో విద్వత్పరీక్షలు జరుగుతున్నాయన్న వార్త వచ్చింది. రాజుగారు ప్రోత్సహించడంతో గణపతి ఆ పరీక్షలో పాల్గొనడానికి నవద్వీపానికి వెళ్లారు.
నవద్వీపంలో జరిగిన ఆ నాటి విద్వత్పరీక్షలో ఆ సభ గణపతి యొక్క పాండిత్యానికీ, కవితాశక్తికీ, బుద్ధికుశలతకీ మెచ్చుకుని ఆయన్ను కావ్యకంఠ అనే బిరుదుతో సత్కరించింది. తరువాత అరుణాచలానికి వచ్చిన ఆయన పొట్టకూటికోసం ఎవరిమీదో ఆధారపడటం కంటే భగవంతుడ్ని ప్రార్ధించడం మేలని శివుని మీద వేయి శ్లోకాలతో హరసహస్రాన్ని వ్రాశారు.
అమ్మవారి మీద కేవలం ఇరవై రోజులలో దీక్షలో కూర్చుని, వేయి శ్లోకాల ఉమాసహస్రాన్ని వ్రాశారు. ఇది శాక్తేయ సాహిత్యంలోనే అత్యద్భుతమైన రచన. అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .
పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు ఆ తర్వాత రమణ మహర్షి ఉపదేశాలను గురించి 300 శ్లోకాలతో రచించిన రమణగీత రచించారు. కేవలం 20 రోజులలో దీక్షలో కూర్చుని 700 ల శ్లోకాలతో చేసిన ఇంద్రాణీ సప్తశతి వారు రాసిన మరో అదర్భుత స్తోత్రం.
వారు రాసిన ఏ రచనకి, ఆ రచన ఒక్కొక కలికితురాయిలాగా విలువైనది. అరుదైనది. ఈయన తన చివరి నిముషం వరకూ రెండు గొప్ప కోరికలతో బ్రతికారు. ఒకటి తపస్సు చేయాలని. రెండు భారతదేశం ఉద్ధరింపబడాలని. తపస్సులో ఈయన అందుకొన్న ఎత్తులు సామాన్యమైనవి కావు. పరమశివుడి అనుగ్రహాన్నీ, అమ్మవారి కరుణనీ పొందారు.
ఆధ్యాత్మికమైన అనుభవాలెన్నో అందుకొన్నారు. పండితసభలలో చప్పట్లూ, సన్మానాలూ, గౌరవాలూ పొంది కూడా ఎక్కువ కాలం అరుణాచలంలోని గుహలలోనూ ఆశ్రమాలలోనూ; తీర్థయాత్రలు చేస్తూ గుళ్లూ గోపురాలలోనే గడిపారు. ఎంతో మందికి ఆధ్యాత్మికమార్గంవైపుకి త్రోవని చూపారు. అత్యంత నిరాడంబరంగా అచ్చమైన యోగి లాగా, సన్యాసి లాగా జీవించారు.
పరివ్రాజకుడై భారతదేశమంతా పర్యటించారు. తాను తిరిగిన ప్రతిచోటులోనూ తన గురువైన రమణమహర్షి యొక్క ఔన్నత్యాన్ని అందరిలోనూ వ్యాపింపచేశారు. నాయన అని అత్యంత ఆప్యాయంగా రమణమహర్షులు కావ్యకంఠుల వారిని పిలిచేవారు. అధ్యాత్మిక గురువుగా దేశమంతటా పేరు సంపాదించి కూడా ఏనాడూ ఒక్క దమ్మిడీ ఆశించలేదు. మఠాలూ, చందాలూ అంటూ ఏ ఒక్కరినీ చేయి చాచి అడుగలేదు.
భగవంతుడంటే ఎంత ప్రేమో దేశమన్నా అంతే ప్రేమ
గణపతి మునికి భగవంతుడంటే ఎంత ప్రేమో దేశమన్నా అంతే ప్రేమ. ఒకరోజు రంగయ్య నాయుడనే ఒక శిష్యుడు ఎప్పుడూ పరధ్యానంగా ఉన్న గణపతిమునిని చూసి, ‘దేని గురించి ఇంత దీర్ఘంగా ధ్యానిస్తున్నారు? అని ప్రశ్నిస్తే దానికి ముని, ‘దశాం దేశస్యైతాం ప్రతిపదమయం ధ్యాయతి జనః’ అంటే ఈ దేశం యొక్క పరిస్థితిని గురించే దీర్ఘంగా ఈ జనుడు ధ్యానిస్తున్నాడు అన్నారట!
ఈ దేశ భవిష్యత్తు గురించి ముని తీవ్రంగా తపన పడ్డారు. ఇక్కడి మూఢాచారలనీ, అధర్మాన్నీ కఠినమైన ధోరణిలో తన ఉపన్యాసాల ద్వారా ఖండించారు. వేదం, సంప్రదాయం , శాస్త్రం అనే వాటిలో కాలానుగుణంగా ఏవి ఎలా మార్పు చెందాలో ఆయన వివరణాత్మకంగా చెబుతూనే ఇక్కడి మూఢాచారలనీ, అధర్మాన్నీ నిరసిస్తూ కఠినమైన ధోరణిలో ఖండించారు.
అందుకోసం అన్ని చోట్లా పర్యటనలు చేసేవారు. అదేవిధంగా బ్రిటీష్ వారు ఆకాలంలో ఏర్పరిచిన భావన వనవాసీలు వేరు, నగరవాసీలు వేరు అంటూ వ్యత్యాసం చూపిన భావనను వారు తొలగించారు. వనవాసీలు నగరవాసీలు అనే తేడా ఏమీ లేదని చెబుతూ, వారు పురాణాలను, వేదాలను పరిశీలించి గిరిపుత్రులు పూజించే దేవతలు, నగరవాసులు పూజించే దేవతలు ఒక్కరేనని, పేర్లు మాత్రమే వేరని నిరూపించారు. అందుకుగానూ వారికి హైదరాబాద్ లో ఇక్కడి ఆది హిందూ సంఘం ప్రతినిధులు వారిని ముని అని బిరుదుతో సత్కరించారు.
వేదాలలో అస్పృశ్యతా గురించి రాసి ఉంది అన్న వాదనని ఖండిస్తూ..1923 డిసెంబరు లోకాకినాడలో నిర్వహించిన కాంగ్రెస్ మహాసభలలో స్త్రీహక్కుల మీదా, అస్పృశ్యతానివారణలమీదా వేదశాస్త్రప్రమాణికంగా ప్రసంగాలు చేశారు. అదేవిధంగా 1924 సంవత్సరం డిసెంబరులో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో అస్పృశ్యతానివారణం శాస్త్రసమ్మతమే అని సంస్కృతంలో ఉపన్యాసం ఇచ్చారు.
ఈ ఉపన్యాసం పట్ల మహాత్మాగాంధీ కూడా ఎంతగానో ప్రభావితులయ్యారు. అదే సంవత్సరంలో ఇష్టం లేకపోయినా దేశం కోసం ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడైయారు. ఆ ఆ తర్వాత 1925 నవంబరు లో బందరు లో సనాతనధర్మంలోని సంస్కరణలమీద ప్రబోధించారు.
1927 డిసెంబరులో చెన్నైలోని హిందూ హైస్కూలు లో జరిగిన మహాసభలో అస్పృశ్యతానివారణ పైన సంస్కృతంలో మహోపన్యాసం చేశారు. వారు ఏం చెప్పినా ఏం చేసినా శాస్త్రసమ్మతంగానూ, వేదాలలో ఉన్న విషయాలనే సామాన్యులకు సైతం అర్థం అయ్యేలా బోధించారు.
వారు రాసిన ఇంద్రాణీ సప్తశతిలో గణపతి ముని తన లక్ష్యాలని ఈ విధంగా చెప్పుకొన్నారు –
స్వాతంత్ర్యం వనితానాం త్రాతుం మాతరధీశే
దూరీకర్తుమపారం దైన్యం పంచమజాతేః
ధర్మవ్యాజమధర్మం భూలోకే పరిహర్తుం
వేదార్థే చ గభీరే సందేహానపి హర్తుం
ఘోరం వర్ణవిభేదం కర్తుం చ స్మృతిశేష-
ముల్లాసం మతిశక్త్యోర్మహ్యం దేహి మహాంతమ్॥
(స్త్రీల స్వతంత్రతని రక్షించడానికీ, పంచమజాతి దైన్యాన్ని పోగొట్టడానికీ, అధర్మాన్ని పారద్రోలడానికీ, వేదము యొక్క లోతైన అర్ధాలని అందించి, అందులోని సందేహాలని తీర్చడానికీ, కులభేదాలని పోగొట్టడానికీ, ఓ అమ్మా! నా బుద్ధికి గొప్పదైన శక్తిని ప్రసాదించు!)
ఇటువంటి ఒక మనిషి, అందులోనూ తెలుగువాడు ఈ దేశంలో నడయాడాడు. సమాజం లో అనేక వర్గాల ఐక్యత, సమరసత అనాదిగా వస్తున్న వేద జ్ఞానము, సంప్రదాయాల వల్లనే సాధ్యమయింది అనీ ఈ దేశంలో సనాతనంగా కొనసాగుతున్న సాంస్కృతిక ఏకత్వాన్ని వారు మనకు గుర్తుచేశారు.
హైందవ ధర్మమే మన దేశ సమగ్రతకు మూలమని అనేక మంది చెప్పినప్పటికీ, గణపతి ముని ఆ ఐక్యతను మామూలుజనాలలోకి తీసుకురావటానికి సులభమైన మార్గాలు చూపించారు. అలా నిత్య ప్రాతస్మరణీయులైన వారు చివరికి 1936 జులై 25న అనాయాసంగా శరీరాన్ని వదిలి వెళ్లారు. గణపతి ముని ప్రాతఃస్మరణీయులు. మన నమస్కారాలన్నింటికీ తగినవారు. మహాత్ములు.