Suryaa.co.in

Andhra Pradesh

వరద సహాయక చర్యల్లో బిజీ బిజీగా గన్నవరం ఎమ్మెల్యే

గన్నవరం : విజయవాడ పట్నం తో పాటు గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులు దగ్గర్నుంచి గమనించిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రంగంలో దిగి క్షణం తీరిక లేకుండా వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు.

ఆదివారం ఉదయం నుంచి ఆయన నియోజకవర్గం లోని గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వటంతోపాటు, బాధితులకు ఏలోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందించాలని ఆదేశించారు. మరో వైపు టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను సహాయక చర్యల్లో పలుపంచుకోవాలని పిలుపు నివ్వటంతో టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇదిలా ఉండగా వరద ఉదృతి పెరగటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించారు. ట్రాక్టర్, జెసిబిలపై లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు తాగునీరు ఆహారం అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం తోపాటు మైలవరం నియోజకవర్గం లోని గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర,ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమాలతో కలిసి పర్యటించి సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గ వరద బాధితులకు అందించాలని కోరారు.

అనంతరం చంద్రబాబు వెంట వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి, సియం సమీక్షలో పాల్గొని నియోజకవర్గం లోని వరద నష్టం పై సీఎంకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలకు అదనంగా పడవలను విపత్తు సహాయక దళాలను పంపించాలని కోరారు. ఎమ్మెల్యే యార్లగడ్డ విజ్ఞప్తి మేరకు విజయవాడ రూరల్ మండల గ్రామాలకు ఎన్. డి. ఆర్. ఎఫ్ దళాలను పంపించి వరద బాధితులకు సాయం అందించారు.

సోమవారం ఉదయం నుండి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, దేవినేని ఉమా తోకలసి జేసిబి పై తిరుగుతూ వరద బాధితులకు స్వయంగా ఆహారం, తాగునీరు అందచేశారు. వరద బాధితులకు ఆహారం సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు వెంటనే స్పందించి న యార్లగడ్డ వెంకట్రావ్ కానూరులోని తన యార్లగడ్డ గ్రాండియర్ కళ్యాణమండపంలో సరుకులు, కూరగాయలు తెప్పించి, అందుబాటులో వంటమేస్త్రి లు లేకపోవటంతో హుటాహుటిన వేరే గ్రామాల నుండి వంటవారిని పిలిపించి వరద బాధితులకు ఆహారం తయారు చేయించారు.

సోమవారం వేకువ జాము నుంచి తాము తయారు చేసిన ఆహారాన్ని బాధితులకు అందచేశారు. సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు యార్లగడ్డ అనుచరులు ఆహారం సరఫరా చేస్తూనే వున్నారు. ఆదివారం ఉదయం నుండి సోమవారం సాయంత్రం వరకు యార్లగడ్డ ఆయన అనుచరులు అలుపెరుగక వరద బాధితుల సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

LEAVE A RESPONSE