-బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుండి విషవాయువులు లీకై 200 మంది అస్వస్థకు గురవ్వడం బాధాకరం. బాధితుల్లో గర్భిణీలు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి కంపెనీల నుండి జే-ట్యాక్స్ వసూలు చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ రక్షణ చర్యలు తీసుకోవడం, రెగ్యులర్ తనిఖీలు నిర్వహించడంపై లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్, చిత్తూరు పూతలపట్టులో హాట్సన్ డైరీలో అమ్మోనియా లీకేజీ, ఏలూరు పోరస్ కంపెనీలో గ్యాస్ లీకేజీ, నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమల నిర్వహణలో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వం, తనిఖీలు సరిగా లేకపోవడమే కారణం.
ఈ రోజు అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదానికి కూడా ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్షయమే కారణం. వరుస ఘటనలు జరిగినా, వందలాది ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో కనీస చలనం లేకపోవడం దుర్మార్గం. అచ్యుతాపురం ఘటనలో అదృష్ట వశాత్తు ప్రాణాపాయం జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ పై తనిఖీలు నిర్వహించాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి. రసాయన ప్రమాదాల్లో వాయువులు బాధితులపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నందున హెల్త్ కార్డులు అందించి విష వాయువుల ప్రభావం తగ్గేవరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.