Suryaa.co.in

Telangana

పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని రైన్లాండ్ ఆసక్తి

– మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రైన్లాండ్ కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృదం ఆ రాష్ట్ర ఆర్థిక, రవాణా, వ్యవసాయ, వినికల్చర్ మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో గురువారం నాడు సచివాలయంలో శ్రీధర్ బాబుతో బేటీ అయింది.

ఈ సమావేశంలో చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కూష్లెర్, హైదరాబాద్ కాన్సుల్ అమితా దేశాయ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసాయనాలు, ఫార్మా ఉత్పత్తి, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్‌లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వాములు అవడం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చ జరిగింది.

సులభతర వాణిజ్య విధానాలు, తక్షణ అనుమతుల జారీలో తెలంగాణా అగ్రగామిగా ఉందని శ్రీధర్ బాబు ప్రతినిధి బృందానికి తెలిపారు. నూతన ఆవిష్కరణలు, ఆధునిక తయారీ, పరిశోధనలను ప్రోత్సహించే ప్రపంచ స్థాయి వ్యవస్థను నిర్మించడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఆయన వెల్లడించారు. రెండు ప్రాంతాల మధ్య సారూప్యతలను గుర్తించడం ద్వారా, పరస్పర ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుందని శ్రీధర్ బాబు సూచించారు.

లైఫ్ సైన్సెస్, ఫార్మా పెట్టుబడులకు తెలంగాణా ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలుస్తోందని ఆయన చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతతో పాటు అత్యున్నత మౌలిక సదుపాయాలతో పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో జరిగే బయో ఏషియా-2025 సదస్సుకు హాజరు కావాలని శ్రీధర్ బాబు కోరారు.

రైన్లాండ్, తెలంగాణా రాష్ట్రాలు ఇకపై ‘సిస్టర్ స్టేట్’ సహకార సంబంధాలు కలిగి ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. రైన్లాండ్ ను సందర్శించి అక్కడి అభివృద్ధిని పరిశీలించాలని ష్మిట్ బృందం శ్రీధర్ బాబును ఆహ్వానించింది. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ విభాగం సిఇఓ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.

శాసనసభను సందర్శించిన రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు విచ్చేసిన రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్ర్డిక్ హేరింగ్ నాయకత్వం లోని ఎనిమిది మంది సభ్యుల బృందానికి స్వాగతం పలికిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు. సభాపతి ఛాంబర్ లో సమావేశమైన తెలంగాణ- జర్మనీ సభ్యుల బృందం వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు.

స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతం సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నతమైనవి. తెలంగాణ రాష్ట్రం 2014 లో నూతనంగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం శాసనసభ, శాసనమండలి ఉన్నాయి. శాసనసభలో 119 మంది సభ్యులు, శాసనమండలి లో 40 మంది సభ్యులు ఉన్నారు. శాసనసభ సభ్యులను ఎన్నికల ద్వారా నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు. తెలంగాణ శాసనసభలో చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయి.

గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. నిజాం హయాంలో నిర్మించిన పాత అసెంబ్లీ భవనాన్ని రూ. 49 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నారని త్వరలోనే శాసనమండలిని అందులోకి మార్చుతామని గుత్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు గడ్డం వినోద్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE