Suryaa.co.in

Editorial

నాలుగురాళ్లు కాదు..నాలుగు టమోటాలు సంపాదించుకోండెహె!

– వరదబాధితులకు ఆంధ్రా సర్కారు చెప్పిన జీవన పరమార్ధం
– ఏపీ సర్కారు సాయం చూసి నోరెళ్లబెట్టిన ప్రపంచం
– ఆ సాయం అద్భుతం, అనితర సాధ్యం, అనిర్వచనీయమే
( మార్తి సుబ్రహ్మణ్యం)

పెపంచకంలోనే అద్భుతమైన ‘వరదా’నం. అది అమోఘం.. అద్వితీయం.. అనిర్వచనీయం.. అనితర సాధ్యం.. అనన్యసామాన్యం. వరదలో బతుకు గోదారిపాలయిన బాధితులకు, నాలుగురాళ్లు కాదు.. నాలుగు టమోటాలు దక్కించుకోవడమే జీవన పరమార్థమని చాటిచెప్పిన ఒకేఒక్క మనసున్న మారాజు ఈ ధరిత్రిలో కనిపించరు. అంత పెద్ద విశాల హృదయం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. ఒక్క ఆంధ్రాలో తప్ప! కాదంటారా. అయితే ఇది చదవండి.

దీపం ఉండగనే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది పూర్వకాలపు సామెత. పాలకులు పంచుతుండగనే నాలుగు అదనపు టమోటాలు వెనకేసుకోండన్నది ఇప్పుడు ఆంధ్రాలో వినిపిస్తున్న లేటెస్ట్ వరద సామెత. ఇదంతా ఎవరో చేసే విమర్శనో, వ్యంగ్యాస్త్రాలో అనుకుంటే మీరు ఖచ్చితంగా టమోటాలో కాలేసినట్లే. తాజాగా సోషల్‌మీడియా కోడై కూస్తున్న సజీవ చిత్రాలు. ఆంధ్రాలో కుండపోతగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు బతుకు బస్టాండయి, కూడు లేక, గూడు చెదిరి, గుండె గోదారయి రోడ్డునపడ్డ ఆపన్నులు వేస్తున్న హాహాకారాలు, ఆకలికేకల సజీవ విషాద దృశ్యమాలికలు ఇప్పుడు సోషల్‌మీడియాలో, కాళ్లకు బలపాలు క ట్టుకుని తిరుగుతున్నాయి.

సరిగ్గా అలాంటి విషాద దృశ్యాలే తెలంగాణలోనూ దర్శనమిస్తున్నాయి. రోదనలు, వేదనలో తేడా లేదు. బాధలు, బలవంతపు తరలింపులో కన్నీటికీ తేడా లేదు. గూడు చెదిరి కొందరు, గుండెపగిలి మరికొందరు, రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న పొదరిల్లు, కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోతుంటే.. గుడిసెలు కుప్పకూలి వరదనీరు వాటిని తీసుకువెళుతుంటే.. ఏమీ చేయలేక నిస్సహాయంగా.. గుండెలవిసేలా రోదించిన పేద, మధ్య తరగతి గుండెలవి. కూలిన బతుకుఛిద్రానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. కాకపోతే రాష్ట్రాల పేర్లే వేర్వేరు! మిగిలిన విషాదమంతా షేమ్ టు షేమ్!! ఇది కూడా చదవండి..:‘విదేశీ వరద కుట్ర’ నిజమే కామోసు…

మరి పాలితులు పీకల్లోతు కష్టాల్లో ఉంటే, పాలకులు సాయం చేయాలి కదా? చేశారా? అంటే తమ భవిష్యత్తు ఓటర్లను కాపాడుకోవాలి కదా? మరి సాయం చేసిందా? యస్. చేసింది. వరదబాధితులకు ఆంధ్రా సర్కారు చేసిన సాయాన్ని చూసి ప్రపంచమే పులకించిపోయిందట. అన్నార్తులకు ఆంధ్రా సర్కారు చేసిన సాయం సోషల్‌మీడియాలో చూసి.. బతికున్న బిల్‌గేట్స్, ఎప్పుడో కాలం చేసిన డొక్కా సీతమ్మలాంటి వాళ్లు మురిసిముక్కలయ్యారట. వాళ్లే కాదు. అమెరికా, లండన్ వంటి దేశాల్లో మిలియన్ డాలర్లు సేవాకార్యక్రమాలకు ఖర్చుపెట్టే, బిలియనీర్లకూ నోటివెంట మాట రాలేదట. ఏపీ సర్కారు సాధించిన ఇంత ఘనతను ప్రపంచానికి చాటిందెవరో తెలుసా?.. సోషల్‌మీడియా!

అవును. సోషల్‌మీడియాలో రెండురోజుల నుంచి ఏపీ సర్కారు దాతృత్వం, విశాలహృదయం గురించి మోతమోగుతోంది. వరదబాధితులకు జగనన్న సర్కారు చేసిన సాయం గురించి ఒకటే కామెంట్లు. అవి పాజిటివా? నెగటివా అన్నది పక్కనపెడితే.. అసలు అంతపెద్ద సాయం చేయాలన్న పెద్ద హృదయం, వినూత్న-విభన్న-విశిష్ట ఆలోచన రావడమే గొప్ప విషయమన్నది ప్రపంచ ప్రముఖుల ఉవాచ, కితాబు.

 

ఇంతకూ ఉపోద్ఘాతమేనా?.. జగనన్న సర్కారు చేసిన సాయం గురించి చెప్పేదేమైనా ఉందా అనే కదా అందరి చిరాకు? ఇంతచెప్పి, చేసిన సాయం గురించి చెప్పకపోతే బాగుండదు కదా? చెడు చెవిలో, మంచి మందిలో చెప్పాలంటారు పెద్దలు.. ఇదీ అలాంటిదే. ఏపీలో గత కొద్దిరోజుల నుంచి కురుస్తున్న భారీandhra-floodsవర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులకు జగనన్న సర్కారు ‘తక్షణ సాయం’ అందించింది. దానితో ఆగమేఘాలపై సర్కారు అందించిన సాయం చూసి, బాధితుల నోట మాట రాలేదు.

ఆ ప్రకారంగా ఒక్కో కుటుంబానికి రెండువేల నగదు, తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని సీఎం జగనన్న ఆదేశించారు. సంతోషం. విపత్తులో ఆదుకున్నందుకు అభినందించాల్సిందే. అయితే.. సర్కారు నేరుగా చేస్తున్న సాయమేమిటంటే.. నాలుగు టమోటాలు, నాలుగు బంగాళాదుంపలు, నాలుగుfluds1 ఉల్లిపాయలతోపాటు ఓ వందగ్రాముల కందిపప్పు. దానితో బాధితులు పోటీలుపడి మరీ..మరో నాలుగు అదనపు టమోటాలు సంపాదించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట.

ఇవన్నీ జగనన్న సర్కారంటే గిట్టని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు వేస్తున్న నిందలనుకుంటే.. టమోటాలు, కందిపప్పులో కాలేసినట్లే. పోనీ యథాప్రకారం వైసీపీ నేతలు చెప్పే పెయిడ్ ఆర్టిస్టులూ కాదు. జగనన్న సర్కారు చేసిన సాయం అందుకున్న అక్కడి ఆదివాసీ మహిళలు చెప్పిన నిజాలు. ఇవన్నీ రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న వీడియోలు.

‘నాలుగు టమాటా, నాలుగు బంగాళాదుంప. నాలుగుగంటే నాలుగే. ఏవండీ, తిని అబద్ధాలాడాల్సిన పనిలేదు కదండీ.మాకిచ్చేదే మేం చెప్పుకుంటాం.50 గ్రాముల కందిపప్పు, దొండకాయలు పాపు కేజీ. అంతేనండి’ – ఇవీ.. అల్లూరి జిల్లా చింతూరు మండలం చట్టి పల్లె.. అంటే భద్రాచలం- రాజమండ్రి మధ్యలో వరదలో చిక్కుకున్న ఆదివాసీ గ్రామ మహిళలు చెప్పిన మాటలు. అవే ఇప్పుడు సోషల్‌మీడియాలో మోత మోగుతున్నాయి. ఈ సాయం చూసి.. ప్రపంచదేశాల్లోని మన తెలుగువారు చేస్తున్న కామెంట్ల వరద, సోషల్‌మీడియాను ముంచేస్తోంది.

జగనన్న సర్కారు సాయం చూసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ‘‘ నాలుగంటే నాలుగే.. ఇది జగన్ సర్కారు వరదసాయం. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు. ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం… లెక్క చూసుకో జగన్‌రెడ్డీ…నాలుగంటే నాలుగే’ అంటూ ట్విట్టర్‌లో తెగ ఎకసెక్కాలాడారు. ఏం చేస్తాం.. టైం బాబూ.. టైమ్!

LEAVE A RESPONSE