‘విదేశీ వరద కుట్ర’ నిజమే కామోసు…

* కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్ కుట్ర’పై కుళ్లెందుకు?
* రహస్యాలను ఏజెంట్ 006 లే కనుక్కోవాలా ఏం?
* కేసీఆర్ చెప్పింది కామెడీగా తీసుకుంటే ఎలా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘సీఎం కేసీఆర్‌కు మతిభ్రమించినట్లుంది. ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ దశాబ్దాపు జోక్. గోదావరికి అప్పుడూ వర్షాలొచ్చాయి. ఇప్పుడూ వచ్చాయి. రేపూ రావచ్చు. కానీ ఇవన్నీ కేసీర్‌కు మానవసృష్టిలా కనిపిస్తున్నాయి. అసలు కుట్రలకే కుట్రదారు కేసీఆర్’’– తెలంగాణ బీజేపీ దళపతి, ఎంపీ బండి సంజయ్

‘‘ కాళేశ్వరం పంప్‌హౌస్ మునక నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ క్లౌడ్ బరెస్ట్‌పై విదేశీ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. కేసీఆర్ తన దగ్గర ఉన్న విదేశీ కుట్ర సమాచారాన్ని తక్షణం కేంద్రానికి ఇవ్వాలి. లేకపోతే కేంద్రం కేసీఆర్‌ను అదుపులోకి తీసుకుని విచారించి, కుట్రదారులను శిక్షించాలి. కేసీఆర్ జేమ్స్‌బాండ్ 006. ఆయన ఒక రహస్యాన్ని ఛేదించారు. దానిపై కేంద్రం విచారించాలి’’ – తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి

‘‘ క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటూ కేసీఆర్ కాకమ్మకథలు చెబుతున్నారు. కేసీఆర్ తీరు, బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్లుంది. విదేశీ కుట్ర సమాచారం తెలిసిన ఆయనకు వరద నష్టం ఎంతన్న సమాచారం తెలుసా? లేదా’’– వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల

తెలంగాణను ముంచెత్తి, జనజీవనాన్ని ఆగమాగం చేస్తున్న వర్షాలు, దానితోపాటు పోటెత్తుతున్న వరదకు కారణం ప్రకృతేనన్నది ఇప్పటివరకూ అందరిలో ఉన్న నమ్మకం. అంటే పామరుల దృష్టిలో అది వరుణుడి వ్యవహారం. అయితే.. కొన్ని వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని, సీఎం కేసీఆర్ మేధస్సు వేరు కదా! ఆయన అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు కదా? అందుకే ఆయన రాష్ట్ర ప్రజలక కాదు, వాతావరణ శాస్త్రజ్ఞులకు సైతం తెలియని ఒక బ్రహ్మాండమైన రహస్యాన్ని బద్దలుకొట్టారు. తెలంగాణను ఆగం చేస్తున్న భారీ వరదల వెనుక విదేశీ కుట్ర ఉందని, క్లౌడ్ బరస్ట్ ద్వారా ఈ ఉత్పాతం సృష్టించారన్న బాంబులాంటి వార్త పేల్చారు. ఇది పనికిమాలిన, చచ్చుపుచ్చు డిబేట్లతో కాలక్షేపం చేసే మీడియాకే కాదు.. గాలికబుర్లు చెప్పే విపక్షాలకు చెంపదెబ్బ. వాళ్లు చేయాల్సిన పనిని ఒక ముఖ్యమంత్రి చేశారు. మరి గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ కదా?! ఆ కుట్ర కథేంటో తెలుసుకోకుండా, కేసీఆర్ మాటలపై కామెడీలు కురిపించడం అన్యాయం.ఇది కూడా చదవండి.. క్లౌడ్ బరస్ట్..వీదేశీ కుట్ర..ఇంకా.. ఏమైనా మిగిలిపోయాయా?

నిజానికి ఏ జర్నలిస్టో- మీడియానో, వాతావరణ శాస్త్రజ్ఞులో, సీబీఐ లేదా రా, మిలటరీ ఇంటలిజన్స్ వంటి వేగులు తేల్చాల్సిన ఈ రహస్యాన్ని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత మేధస్సుతో సమాచారం సేకరించి, దానిని వెల్లడించినందుకు ఆయనను అభినందించాలి. ఇవన్నీ ‘ఒరిజినల్ వరదలే’నని ఇంతకాలం భ్రమపడిన జనాల కళ్లు తెరిపించినందుకు, ప్రజలంతా ఆయనకు రుణపడి తీరాలి.

‘ఒక రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టేందుకు ఇలా కూడా జరుగుతాయా‘ అని తెలియని పేరు గొప్ప జర్నలిస్టులు, తమ అజ్ఞానాన్ని సాయంత్రపు డిబేట్లలో వాంతులు చేసుకునే విజ్ఞానవంతులనుకుని భ్రమించే విశ్లేషకులు, మిడిమేళపు మీడియాకు.. ‘సొల్లు మాట్లాడకుండా సత్యం తెలుసుకోండ’ని జ్ఞానబోధ చేసినందుకు, యావత్ మీడియా లోకం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పి తీరాలి. ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టులకు ఆయన ఒక మార్గదర్శి.
అసలు క్లౌడ్ బరస్ట్ అన్నది పెద్ద మాట. అది ఎంత పెద్ద కుట్ర అనుకున్నారు? కేసీఆర్ చెప్పినట్లు.. గతంలో లద్దాక్, ఉత్తరాఖండ్‌లో కూడా జరిగింది. కానీ ఆ కుట్రల గురించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియదు. అసలు క్లౌడ్ బరస్ట్ కుట్ర గురించి ఆ రెండు రాష్ట్రాల సీఎంలకు తెలియనే తెలియదు. అంత అజ్ఞానులు కాబట్టే వారి గురించి చరిత్ర ఎప్పుడూ చెప్పుకోదు. వదిలేయండి. కానీ, వరదలొచ్చిన వారంలోపే, దాని వెనుక యవ్వారం కనిపెట్టి, అదంతా డూప్లికేట్ యవ్వారమేనని తన మేధస్సుతో తేల్చేయడం ఎంతమందికి సాధ్యం? అసలు కారణాలను ఛేదించాలనుకునే జిజ్ఞాస, దాని వెనుక ఎవరున్నారని తెలుసుకుని తీరాలన్న అన్వేషి ఎవరుంటారు? పోనీ.. రహస్యం తెలిసినా, దానిని కడుపులో దాచుకోకుండా, లోకానికి చెప్పాలన్న సాహసి, లోకహితైషి ఎవరుంటారు? ఒక్క కేసీఆర్ తప్ప!

వరదలకు క్లౌడ్‌బరస్ట్, విదేశీ కుట్ర అన్న నిజాన్ని చాటి, ప్రజలకు అంతలావు మేలు చేసిన కేసీఆర్‌ను అభినందించాల్సిన ప్రతిపక్షాలు.. మతిలేనిమాటలు మాట్లాడి, ఒక బ్రహ్మాండం బద్దలు చేసినkcr-coluds సాహసికుడిని అనరాని మాటలు అనడం దారుణమే కాదు అజ్ఞానం. కుదిరితే అభినందించండి. లేకపోతే కేసీఆర్‌ను క్షమాపణ కోరండి. అంతే కానీ అసలు నువ్వు చెప్పేవన్నీ కామెడీ అని మాత్రం అనకండన్న.

రేవంత్‌రెడ్డయితే మరీనూ. విదేశీకుట్ర సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వాలట. అసలు కేంద్రానికి ఎందుకివ్వాలంట? లేకపోతే కేంద్రమే కేసీఆర్‌ను అదుపులోకి తీసుకోవాలంట! ఏం.. కేంద్రం దగ్గరున్న సీబీఐ, రా ఏమి చేస్తున్నాయి? కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్ రహస్యం’ విప్పేంతవరకూ తెలుసుకోకుండా, అవి గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాయా? ఎవరిపై కేసులు పెడదామన్న పనిలో బిజీగా ఉన్నాయా? విదేశీ కుట్ర రహస్యాన్ని చెప్పకపోతే కేసీఆర్‌ను కేంద్రం ఎలా, ఎందుకు అదుపులోకి తీసుకుంటుంది?

రోజూ డజన్లసార్లు కేసీఆర్‌పై ఆరోపణలు కురిపిస్తున్న బండిసంజయ్ మాటలనే పట్టించుకోని కేంద్రం, ఆఫ్టరాల్ పీసీసీ ప్రెసిడెంటయిన రేవంత్ చెబితే వింటుందా.. కామెడీ కాకపోతే! రేవంతన్న వెటకారం చేస్తూ చెప్పినట్లు.. రహస్యాలను ఏజెంట్ 006లే కాదు, కేసీఆర్ లాంటి మేధావులూ తెలుసుకోవచ్చు. ఏం.. జనం కోసం కేసీఆర్ ఏజెంట్ 006 కాలేరా? కాకూడదా?

Leave a Reply