– డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలంటే రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
– ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, ప్రజలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించాలి
– ఎమ్మెల్సీ డా.శ్రవణ్ దాసోజు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 09-12-2025 తేదీ గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం–1996కు, అలాగే 74వ రాజ్యాంగ సవరణ యొక్క ఆత్మకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, సంబంధిత వర్గాలతో తగిన స్థాయిలో సంప్రదింపులు జరపకుండా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా లేదని తెలిపారు.
డా. శ్రవణ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే 74వ రాజ్యాంగ సవరణ ఉద్దేశ్యమని, అయితే ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలు ఆ ఉద్దేశ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని సూచించారు.
డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనల ఆధారంగా జరిగినట్టు చెప్పడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక అడ్వైజరీ సంస్థ మాత్రమే, రాజ్యాంగబద్ధ సంస్థ కాదని, ఇంత కీలకమైన రాజ్యాంగ ప్రక్రియలో ఆ సంస్థకు నిర్ణయాధికారం అప్పగించడంపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంటున్న సందర్భంలో, 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44,667 ఉండాలని తెలిపారు. చట్టం ప్రకారం జనాభా వ్యత్యాసం ±10 శాతం మించకూడదని స్పష్టం చేస్తూ, కొన్ని వార్డుల్లో ఈ పరిమితిని మించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది రూల్ నెంబర్–5కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, డీలిమిటేషన్‌కు ఏ సెన్సస్ డేటాను ఆధారంగా తీసుకున్నారో, భౌగోళిక పరిమాణాన్ని ఎలా పరిగణనలోకి తీసుకున్నారో ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదని తెలిపారు. ప్రజలకు సంబంధించిన డేటా విషయంలో పారదర్శకత అవసరమని సూచించారు.
హైదరాబాద్ నగరం సామాజిక సమతుల్యత, బహుళ సంస్కృతుల సహజీవనానికి ప్రతీకగా ఉన్న నేపథ్యంలో, ప్రాంతాల విభజనలో సామాజిక సమతుల్యతకు భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డా. శ్రవణ్ గారు పేర్కొన్నారు.
డీలిమిటేషన్‌కు ముందు తీసుకువచ్చిన ఆర్డినెన్స్, అనంతరం తక్కువ వ్యవధిలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై కూడా స్పష్టత అవసరమని, ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలతో, ప్రజా ప్రతినిధులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలి. డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలంటే రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, ప్రజలతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.