Suryaa.co.in

Features

గిరి గీసి గిరిజనం..!

ఆదివాసి దినోత్సవం..

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులౌతారు.. తర తరాలకు తరగని వెలుగవుతారు.. ఇలవేలుపులౌతారు..!?

ఏనాటి మాట.. వాల్మీకి.. ఏకలవ్యుడు.. శబరి.. మరి, ఇప్పటి గిరిజనులు.. ఎప్పటి వోలె అదే జీవనం.. నాగరికతకు దూరంగా.. బ్రతుకు భారంగా..!

హరిజనులు.. గిరిజనులు.. అందరు నేడు పుర జనులే.. నిజమా.. కనిపించని దృశ్యమా.. అప హాస్యమా..!

స్వర్ణోత్సవ స్వరాజ్య భారతం.. ఏమున్నది గర్వ కారణం.. సర్వ హరణం.. గిరిజనుల పేర ఖర్చయ్యే కోట్ల రూపాయలు పెద్దోడి కంఠాభరణం..!

కొండ కోనల్లో కనిపించని వెలుగు.. నువ్వూ నేనూ చూసి మురిసే ప్రకృతి అందాల నడుమ నికృష్ట జీవనాలు.. వికృత కథనాలు..

చుట్టూ పూల తావి.. చదువు అందని మావి..

వనరులన్నీ బడా బాబుల నైవేద్యం.. ప్రాణాలు పోయే వేళ అందుబాటులో ఉండని వైద్యం.. మంచి నీరు.. రహదారులు కోట్లు వ్యయమవుతున్నా చక్కబడని బ్రతుకు దారులు..

పచ్చని ఎడారులు..!

అదిగో.. పురిటి నొప్పులు పడుతున్న గిరి పుత్రిక.. లెన్సు పెట్టి చూసినా కనిపించని ఆంబులెన్సు.. బిడ్డ అడ్డం తిరిగితే.. నాటు వైద్యం చేయి దాటి పట్నం పోదమంటే డోలీ దిక్కు.. అది చేరే పాటికి పేనం నిలిచేనా.. బిడ్డ దక్కేనా..!

కష్టమెంత పడినా ఇప్పటికీ తప్పని పస్తు.. అదే అదే గిరిసీమల వాస్తు.. పేరుకే శ్రీరస్తు.. శుభమస్తు.. బతుకులింతే అన్నదేమో తథాస్తు.. పాలకులు అస్తు అస్తు..!

గిరిజనుల థింసా.. అడుగు కలిపే నేతలు హైలేసా.. చేతికి అందని పైసా.. మంది సొమ్ముతో నాయకుల జల్సా..!

మొత్తంగా ఆదివాసి.. సమస్యల సహవాసి.. నిత్య వనవాసి..!

-వెంకటాచారి

LEAVE A RESPONSE