Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడమంటే ప్రజా తీర్పుకు వ్యతిరేకమే

-మా ప్రభుత్వం ప్రజాతీర్పును వ్యతిరేకిస్తుందని నేను అనుకోవడం లేదు
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు జాలి వేసి, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవ్వవచ్చు కానీ అది ప్రజా తీర్పుకు వ్యతిరేకమవుతుంది
-స్పీకర్ ను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని అడగడం తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి రాసిన ఉత్తరంలోని కంటెంట్ మాత్రం పచ్చి అబద్ధం
-ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు

ఉండి : వైకాపా శాసనసభ పక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా, క్యాబినెట్ ర్యాంకు కట్టబెట్టడం అంటే ప్రజలిచ్చిన తీర్పును వ్యతిరేకించినట్టు అవుతుందని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రజా తీర్పును మా ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని నేను భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు జగన్మోహన్ రెడ్డి పై జాలి కలిగి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవ్వవచ్చు కానీ, అది ప్రజా తీర్పుకు వ్యతిరేకమవుతుందన్నారు.

గురువారం నాడు ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామ కృష్ణంరాజు పలు అంశాలపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి కావాలనే 11 సీట్లు ఇచ్చారేమోనని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరారని భావించి, ఆయన్ని కేవలం ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఉంటారని తెలిపారు. గతంలో నేను రచ్చబండ కార్యక్రమంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని చెప్పాను. 17 అసెంబ్లీ సీట్లు కూడా గెలువ లేవని పేర్కొన్నానని గుర్తు చేశారు.

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మరో ఐదారు మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదని పేర్కొన్న మాట నిజం కాదా? అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు… ఇదే సందర్భంగా నేను రచ్చబండ కార్యక్రమం లో జగన్మోహన్ రెడ్డికి 17 సీట్లు కూడా రావని, ప్రతిపక్ష నేత హోదా దక్కదని మాట్లాడిన వీడియో క్లిప్ ను ఒక వ్యక్తి నాకు పంపించారు. నాలుగేళ్ల పాటు రచ్చబండ కార్యక్రమంలో నేను నిరంతరం మాట్లాడాను. దాదాపు 1500 ఎపిసోడ్స్ ఉంటాయి.

పార్టీ శాసనసభాపక్ష నాయకుడు వేరని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పి. జనార్దన్ రెడ్డికి అసెంబ్లీలో 10% సభ్యుల సంఖ్యాబలం లేని కారణంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఆయన కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. అసెంబ్లీలో 10% సభ్యుల సంఖ్య బలం లేకపోయినా పదిమంది సభ్యులే ఉన్న ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని అడగడంలో తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి రాసిన ఉత్తరంలోని కంటెంట్ పచ్చి అబద్ధం అన్నారు. ఎవరో రాసిచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి సరి చూసుకోరా అంటూ నిలదీశారు. ఎప్పుడూ ఎవ్వరు ఇలా చేయలేదని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం సత్యదూరమని తెలిపారు. గతంలో కేంద్రంలో కూడా సంఖ్యాబలం లేని కారణంగా ప్రధాన పార్టీ నాయకులకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు.

గతంలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారన్న జగన్మోహన్ రెడ్డి వాదన అసంబద్ధంగా ఉందన్నారు. ఉపేంద్ర అప్పుడు లోక్ సభ సభ్యులు కాదని, రాజ్యసభ సభ్యులను పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అర్థం లేని ఆలోచనలతో వ్యర్థమైన లేఖను రాశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వరని నా వ్యక్తిగత అభిప్రాయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును శిరసా వహిస్తారని నేను అనుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి స్థానంలో నేనే ఉండి ఉంటే ఒక్కరోజు కూడా అసెంబ్లీకి గైర్హాజరై ఉండేవానిని కాదని చెప్పారు. రాజకీయాలలో గెలుపు, ఓటమి సహజమని, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వంటి మహానుభావులే ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు.

నిజంగా ప్రజలంటే గౌరవం ఉంటే ప్రతిపక్ష నాయకుడి హోదా ఉన్నా, లేకపోయినా శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఉంటే అదనంగా వచ్చేది ఏముంటుందని టీ ఏ, డి ఎ అలవెన్స్, కారు సౌకర్యం మాత్రమేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెబితే కూడా గౌరవం పెరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలన్నారు.

వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకొని… 175 మంది ఉన్న శాసనసభలో ఒక మూలన మూడు వరుసల కుర్చీలకే పరిమితమైతే బాధ ఇలాగే ఉంటుందేమోనని ఆయన ఎద్దేవా చేశారు . ప్రజా జీవితంలో అపజయం, పరాభవాన్ని, పరాజయాన్ని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే బాగుంటుందన్నారు. ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం సమంజసం కాదన్న రఘురామ కృష్ణంరాజు, ప్రభుత్వ స్కూళ్ల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటానని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

చుట్టూ గోదావరి ఉన్నప్పటికీ తాగడానికి ఉండి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మంచి నీళ్లు లేని పరిస్థితి నెలకొందని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందడంతో దాని దుష్పరిణామమే ఇదన్నారు. ఆక్వా కల్చర్ వల్ల తాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొందన్న ఆయన, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాగునీటి స్కీం స్టార్ట్ అయినప్పటికీ, మధ్యలోనే ఆగిపోయిందన్నారు.

నేను ఎంపీగా ఎన్నికైన తరువాత నాలుగైదు నెలలలో ఈ తాగునీటి పథకం కొంతమేర కంప్లీట్ అయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నాకు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించిన తర్వాత ఈ మంచినీటి పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న తీరుగా తయారైంది. ఇప్పుడు తిరిగి ఆ మంచినీటి పథకాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలను ప్రారంభించామని తెలిపారు. మొదటి దశ ఆగస్టు 15వ తేదీ నాటికి పరిమళ మంచినీటి పథకం ద్వారా ఆకివీడు మండలంలోని అన్ని గ్రామాలకు, మిగిలిన మండలంలోని కొన్ని గ్రామాలకు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఒకవేళ ఆలస్యం జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు మండలాల ప్రజలకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. రెండవ దశలో జనవరి ఒకటవ తేదీ నాటికి మిగిలిన 25 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు చర్యలు చేపడుతామన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి 34 నివాస ప్రాంతాలకు, రెండవ దశలో 25 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు పూర్తి చర్యలను చేపట్టనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

గత ఐదేళ్లలో డ్రైన్లు, ఇరిగేషన్ కాలువలలో పార మట్టి కూడా తీయలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. 2019 తరువాత అసలు పట్టించుకోలేదని ఆయన, ఇప్పుడు మా నూతన ప్రభుత్వ సహకారంతో, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వంటి చక్కటి అధికారులు, ఇతర పరిపాలన సిబ్బంది సహాయం తో ఎక్సలెంట్ టీం వర్క్ ను మొదలు పెట్టామని చెప్పారు.

శాసనసభ్యుడిగా విజయం సాధించిన తర్వాత విజయోత్సవాలను జరుపుకుందామని ఆ ఊరుకు, ఈ ఊరుకు రమ్మని నన్ను పిలిచారు. కానీ నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించిన పనులు ప్రారంభించిన తర్వాతే విజయోత్సవాలను చేసుకుందామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నానని తెలిపారు. అందుకే ఇప్పటివరకు నియోజకవర్గంలో విజయోత్సవాల లో పాల్గొనలేదన్నారు.

ఉండి నియోజకవర్గంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు రైతులు చాలామంది సహాయం చేస్తున్నారని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రజలు స్పందిస్తున్నారన్నారు. డ్రైన్, ఇరిగేషన్ కాలువలలో పూడికతీత పనులను ఏకకాలంలోనే 10 ప్రాంతాలలో ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే 30 రోజుల్లో వర్షాలు పూర్తిస్థాయిలో పడకముందే డ్రైన్, ఇరిగేషన్ కాలువలలో పూడిక తీత పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని డ్రైన్లు, ఇరిగేషన్ కాలువలలో జరుగుతున్న పూడికతీత పనులను నిన్న పరిశీలించిన తర్వాత మెజారిటీ పనులు సకాలంలో పూర్తి చేస్తామన్న విశ్వాసం కలిగిందన్నారు.

నా మిత్రుడు చలసాని అశ్విని దత్ నిర్మించిన కల్కి 2898 చిత్రం సూపర్, డూపర్ హిట్ అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలను తీసిన అశ్విని దత్, మరొక గొప్ప సినిమాను నిర్మించారన్నారు. అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఉదయం నాలుగు గంటల 15 నిమిషాల షో కు చూడడం జరిగిందన్నారు. మన పురాణాలను గౌరవిస్తూ, మహాభారతం లోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకున్నారని తెలిపారు.

ఉండి డ్రైనేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కు నా మిత్రుడు చలసాని అశ్వినిదత్ కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా నేను చేపట్టిన మంచి పనికి తనవంతుగా ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

స్కూళ్లు, కాలేజీలలో బాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణం
స్కూళ్లు, కాలేజీలలో బాలికల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో డ్రైన్లు, ఇరిగేషన్ కాలువలలో పూడికతీత అనంతరం స్కూళ్లు, కాలేజీలలో బాలికల కోసం టాయిలెట్ల నిర్మాణం పై శ్రద్ధ చూపనున్నట్లు వెల్లడించారు. టాయిలెట్ల పరిశుభ్రతను మాస్టర్లకు అప్ప చెప్పడం కరెక్ట్ కాదన్నారు.

చేవెళ్ల నియోజకవర్గం లో ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అపోలో ట్రస్టు సహకారంతో టాయిలెట్ల పరిశుభ్రతకు కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, ఆ కార్యక్రమ స్ఫూర్తితో ఒక ఫౌండేషన్ కు పరిశుభ్రత బాధ్యతలను అప్పగించడం, అవసరమైతే ప్రత్యేకంగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి
పాఠశాల విద్యను గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. సక్రమంగా ఉన్న విద్యా విధానాన్ని తన విచిత్రమైన ఆలోచనలతో, వింత ప్రవర్తనతో సర్వనాశనం చేశారన్నారు. టోఫెల్ పరీక్షలను పెడతానని , అది చేస్తాను… ఇది చేస్తానని చెప్పి విద్యా విధానాన్ని బ్రష్టు పట్టించారన్నారు. ఇంగ్లీష్ భాష అందరికీ అవసరమేనని, అదేదో జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినట్లుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం 600 పాఠశాలలలో కేవలం ఒకే, ఒక విద్యార్థి ఉన్నట్లుగా పత్రికల్లో వార్త చదివానని తెలిపారు. విద్యాలయాలు ఉండాల్సిన చోట ఉండకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ విచ్చిన్నం పై గతంలో నేను ఎన్నోసార్లు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

తమిళనాడులో పుట్టిన తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ గోపీనాథ్
తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన గోపీనాథ్ పార్లమెంటు సభ్యునిగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం అద్భుతమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. గోపీనాథ్ గతంలో ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రస్తుతం ఎంపీగా ఎన్నికయ్యారన్నారు. గోపీనాథ్ తో తనకు ఎంతో పరిచయం ఉందని మేమిద్దరం ఎప్పుడూ కలిసినా తెలుగులోనే మాట్లాడుకునే వారమని చెప్పారు. మన ఎంపీలు అన్య భాషలో ప్రమాణ స్వీకారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన, పుట్టింది తమిళనాడులో అయినా తన మాతృభాష తెలుగును మర్చిపోకుండా గోపీనాథ్ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయం అన్నారు.

ఎంపీగా ఎన్నికైన తర్వాత నేను కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా , అందరూ ఇంగ్లీషులోనే ప్రమాణ స్వీకారం చేయడంతో నేను కూడా ఇంగ్లీషులోనే ప్రమాణ స్వీకారం చేసినందుకు సిగ్గుపడుతూ, గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వపడుతున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

తెలుగు భాషను చంపేసిన జగన్మోహన్ రెడ్డి
తెలుగు భాషను జగన్మోహన్ రెడ్డి చంపేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. తెలుగు కాకుండా రెండవ భాష సంస్కృతాన్ని ఎంచుకున్న వారికి నూటికి 95 మార్కులు వేస్తున్నారని, పలువురు నా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సంస్కృతంలో ఏమి రాయకపోయినా, ఉత్తి తెల్ల పేపరు ఇచ్చినప్పటికీ 95 మార్కులు వేస్తుండడంతో తెలుగును కాదని మార్కుల కోసం విద్యార్థులు సంస్కృతాన్ని, తమ రెండవ భాషగా ఎంచుకుంటున్నట్లు తెలిసిందన్నారు.

తెలుగులో ఎంత రాసిన 60 మార్కులు రావడం కష్టమని, తెలుగులో 60 మార్కులు సాధించలేని వారికి సంస్కృతంలో 90 నుంచి 95 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. తెలుగు పేపర్ కూడా సరళంగా ఇచ్చి, విద్యార్థులు తెలుగు భాషను ఎంచుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఇది నా ఒక్క నియోజకవర్గ సమస్య కాకపోయినప్పటికీ, ఎమ్మెల్యేగా రాష్ట్ర పరిధిలోని ఏ అంశం పైననైనా ప్రభుత్వానికి సలహా ఇవ్వవచ్చునని తెలిపారు.

తన దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లడమే కాకుండా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రజల నుంచి వందలాది ఫోన్ కాల్స్ నాకు వచ్చేవి. గతంలో నేను ప్రో యాక్టివ్ గా ఉండి స్పందించడం వల్ల, ఇప్పుడు కూడా నా దృష్టికి అనేకమంది అనేక సమస్యలను తీసుకు వస్తున్నారన్నారు. ఎవరైనా సలహాలు, సూచనలు నాకు ఇవ్వవచ్చునని తెలిపారు. వాటిని అసెంబ్లీలో ప్రస్తావించడమే కాక, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.

LEAVE A RESPONSE