– ఎఫ్పిఓ లను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేసే ప్రక్రియను పరిశీలించాలి
– తెలంగాణ వ్యవసాయరంగ ఉజ్వల భవిష్యత్తు ప్రతిభింబించేలా ఏవీ రూప కల్పన చేయాలి
– సమ్మిట్ లో ఏవీ ల ద్వారా ప్రదర్శంచాల్సిన అంశాలపై అధికారుకు దిశానిర్ధేశం చేసిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 ప్రధాన లక్ష్యం రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం అని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుమారు 200 బిలియన్ డాలర్ల వద్ద ఉందని, వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 15 రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే మహాదృక్పథానికి ఈ గ్లోబల్ సమిట్ ప్రధాన వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల సమ్మిట్ లో ప్రదర్శించాల్సిన ఏవీ ల కంటెంట్ పై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ వ్యవసాయరంగం యొక్క అభివృద్ధి సామార్థ్యాలు, విదేశీ పెట్టుబడి అవకాశాలు, భవిష్యత్ విజన్ స్పష్టంగా ప్రతిబింబించేలా ఏవీ లను రూపొందించాలని అన్నారు. వ్యవసాయ రంగమే రాష్ట్ర ఆర్థిక లక్ష్య సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ జనాభాలో 66 శాతం మందికి ఉపాధి అందించే వ్యవసాయం రాష్ట్ర జీఎస్వీఏ లో 17 శాతం వరకు వాటా కలిగి ఉందని, అందువల్ల తెలంగాణ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయ అభివృద్ధి కేంద్రబిందువుగా ఉంటుందని పేర్కొన్నారు.
రైతు ఆదాయం పెరగడం, ఉత్పాదకత పెరుగుదల, విలువ ఆధారిత వ్యవసాయం విస్తరణ, ఎగుమతుల పెంపు ఇవన్నీ 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి అత్యంత కీలక అంశాలు అని మంత్రి తుమ్మల అధికారులకు వివరించారు. IoT ఆధారిత సూక్ష్మ నీటిపారుదల, నేల ఆరోగ్య నిర్వహణ, అగ్రిటెక్ పరిశోధన, TARCC, గ్లోబల్ సీడ్ లీడర్షిప్, హార్టికల్చర్ మెగా క్లస్టర్లు, ఆయిల్ పామ్ విస్తరణ, ఫాం టూరిజం , ఎఫ్పిఓ లను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానం చేయడం, పాల, మాంసం, మత్స్య రంగాల పెంపు, అధునాతన అగ్రి లాజిస్టిక్స్ వంటి కార్యక్రమాలు తెలంగాణ వ్యవసాయాన్ని గ్లోబల్ ప్రమాణాలకు తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచడమే కాకుండా, వేల కోట్ల రూపాయల విలువైన అగ్రి–ఎగుమతులకు మార్గం సుగమం చేయనున్నాయని తెలిపారు. విజన్ 2047 డాక్యుమెంట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి ఒక దిశ నిర్ధేశిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని మంత్రి పునరుద్ఘాటించారు. రైతు భరోసా, రుణమాఫీ, పంట నష్టపరిహారం, రైతు బీమా వంటి పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తు వృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. ఇకపై సాంకేతికత–ఆధారిత, డేటా–ఆధారిత, మార్కెట్–ఆధారిత వ్యవసాయ మోడల్ద్వారా రైతులను మరింత సాధికారులను చేయడం ప్రభుత్వం యొక్క సంకల్పమని స్పష్టం చేశారు. “వ్యవసాయ రంగం బలపడితేనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
రైతు శ్రమే రాష్ట్ర అభివృద్ధికి మూలం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మహా లక్ష్యంలో, వ్యవసాయం అత్యంత ముఖ్యమైన ప్రేరణాశక్తి అవుతుంది” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ గ్లోబల్ సమిట్ ద్వారా తెలంగాణ, వ్యవసాయం–సాంకేతికత–పెట్టుబడుల నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి జానయ్య, హార్టికల్చర్ యూనివర్సిటీ విసి రాజిరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఏసీఏ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.