మనిషై జన్మించాక ఉదర పోషణార్థం అహరహం శ్రమించాలి మానవుడు. ఏదీ తనంత తాను చెంతకు రాదు. శోధించి సాధించాలి. కష్టపడి సంపాదించుకోవాలి. దేహదారుఢ్యం, తెలివి, విజ్ఞత, విచక్షణ పెంచుకుని నియమబద్ధంగా పనిచేస్తూ, ధర్మబద్ధంగా బతకాలి. పదిమందినీ బతికించాలి. పరుగెత్తే కాలంతోపాటు పరుగెడుతూ అలసత్వానికి దూరంగా విధ్యుక్త ధర్మాలను నెరవేర్చాలి. అలా చెయ్యకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరికించి చూస్తే- ప్రకృతిలో పశుపక్ష్యాదులు, జంతుజాలాలు, వివిధ ప్రాణులు ఆహార సముపార్జన కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. పిపీలికాలు, తేనెటీగలు సైతం మనకెన్నో అంశాలు బోధిస్తాయి. శ్రమించి తేనె పెర(దొంతర)లను ఉత్పత్తి చేసే ఈగలను పొగపెట్టి తరిమి పారదోలినా, అవి ఇంకోచోట తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తాయి. ఆహారాన్వేషణలో తమ మార్గానికెవరైనా అవరోధం కలిగించినా, పట్టించుకోక క్షణకాలం ఆగి మళ్ళీ నడక సాగిస్తాయి పిపీలికాలు. వాతావరణాన్ని అనుకూలం చేసుకొని చెట్లు చిగురిస్తాయి, పుష్పాలు వికసిస్తాయి, ఫలాలు పక్వమవుతాయి. మానవ శరీరం ధరించాక కండల్ని కరిగించి కొందరు శ్రమిస్తే- బుద్ధి, విద్య, తెలివి పెట్టుబడిగా ఇంకొందరు శ్రమిస్తారు. ప్రకృతి శక్తులు అననుకూలంగా ఉన్నా, వాటిని సానుకూలం చేసుకొని కర్షక కార్మికులు రాత్రింబవళ్లు కష్ట పడతారు. ఫలితాన్ని తామొక్కరే అనుభవించక పదిమందికీ పంచు తారు. పనిలోనే పరమాత్మను దర్శిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా నిలిచి అంతులేని ఆనందాన్ని పొందు తారు. వారి నిస్వార్థ, నియమబద్ధ జీవితం మనకాదర్శం.
కొందరు శరీరాన్ని కష్టపెట్టక కబుర్లతో కాలయాపన చేస్తూ బతికేస్తుంటారు. ఇంకొందరు కాలవిలంబన చేస్తూ నేటి పనిని రేపటికి వాయిదా వేస్తారు. నిత్యశంకితులుగా కొందరు తాము చేసే పనులు ఇతరులను మెప్పిస్తాయో లేదోనన్న ధర్మసంకటంలో పడి అసలు ప్రయత్నమే చెయ్యరు. అటువంటి వాళ్లంతా అభివృద్ధి నిరోధకులే. భవిష్యత్తు తరాలను నడిపించే యువత తమ ఉక్కు కండరాలకు, నరాలకు పని కల్పించక, విజ్ఞతకు పదును పెట్టకపోతే లోకం ఏ దిశగా నడుస్తుంది? నిర్ణయాలు త్రుటికాలం ఆలస్యమైనా మానవ జీవితాలకు పెనుముప్పు తప్పదు.
జనాన్ని రక్షించే లోకబాంధవుడైన సూర్యుడు ఎవరి ప్రమేయం లేకుండానే ఉదయిస్తాడు. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని మనకందిస్తూ తన పనిని చేసుకుపోతూ వేళ మించగానే నిష్క్రమిస్తాడు. ప్రచండ తేజంతో వేసవిలో సాగే వేళ, ఆ ఉష్ణ తాపాన్ని తాళలేక మనం నిందిస్తాం. శీతగాలులు ఎముకలు కొరికే వేళ త్వరితంగా వచ్చి నులివేడిమినందిస్తే స్తుతిస్తాం. వీటిని పట్టించుకోడు ప్రభాకరుడు. తన పనిలో తాను సాగిపోతాడు. కార్యసిద్ధికి కర్తవ్యోన్ముఖుడిగా మారిన హనుమ, తన గమనంలో విపత్కర స్థితులను సమర్థంగా ఎదుర్కొని అంతులేని విజయాలను సాధించాడు. గేలిచేసినా లెక్కచెయ్యక వీధి దీపాల కింద చదివి విద్యావంతులైన వారెందరో. కష్టాల సంద్రాలను ఈది ఎవ్వరినీ లెక్కించక విశ్వ విజేతలైన మానవ శ్రేష్ఠులు ఎందరెందరో. చేసే పనిపట్ల అవగాహన, నిబద్ధత, నిజాయతీ, క్రమశిక్షణ కనబరిస్తే విజయం తథ్యం. పని ఎలాంటిదైనా, ఎంతటిదైనా దీక్ష, పట్టుదల ముఖ్యం. ఆటంకం కలిగించే పరిస్థితులను, వ్యక్తులను లెక్కించక, వారి వ్యాఖ్యలకు తల వంచక ధైర్యంగా, స్థైర్యంతో ముందుకు సాగడమే మనిషి కర్తవ్యం.
-మాడుగుల రామకృష్ణ