మూడు రాజధానుల ఎజెండాతో ఎన్నికలకు వెళ్ళండి

-బుల్లి బుల్లి, సిల్లీ డ్రామాలు అనవసరం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ముఖ్యమంత్రి గారు… మూడు రాజధానుల ఎజెండా మీద ఎన్నికలకు వెళ్ళండి సార్… ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఏదో ఒక కారణం చెప్పి శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి… ప్రజలు వికేంద్రీకరణ కోరుకుంటున్నారని నిరూపించండి అని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణకు మద్దతుగా తొకడ జేఏసీని ఒకటి ఏర్పాటు చేశారట , దానికి కరణం ధర్మ శ్రీ తన రాజీనామా పత్రాన్ని అందజేశారట అంటూ అపహాస్యం చేశారు.

కరణం ధర్మశ్రీ కి ఎన్నికలలో మరణం తప్పదన్న ఆయన, చిత్తశుద్ధి ఉంటే ఉత్తుత్తి రాజీనామాలు కాకుండా, స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకోవాలని సవాల్ చేశారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం తనకు రాజీనామా చేయాలని ఉందని ప్రకటించడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడుతున్న ఈ డ్రామాలు అద్భుతంగా ఉన్నాయని, ఈ బుల్లి, బుల్లి సిల్లీ డ్రామాలు, ఈ సోదంతా అనవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం వీళ్లు రాజీనామాలు చేసిన, ఉప ఎన్నికలు నిర్వహించడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందన్న ఆయన, పది రోజుల కిందట తమ శాసన సభ్యత్వానికి వీరు రాజీనామా చేసి ఉంటే, మునుగోడు ఉపఎన్నికతో పాటు, రాష్ట్రంలోనూ ఉప ఎన్నికలు జరిగి ఉండేవని పేర్కొన్నారు. అయితే టైమింగ్ చూసుకునే మహానుభావులు రాజీనామా డ్రామాకు తెరలే పారని విమర్శించారు.జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే, రాజీనామా చేసి ఉద్యమంలోకి దూకేయాలని ఉందన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఉద్యమంలోకి జగన్మోహన్ రెడ్డే దూకేయమంటున్నారని ధర్మాన చెప్పకనే చెప్పారని అన్నారు.

ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం సరికాదు
తమ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని, దేవుళ్ళ కు కూడా ప్రాంతాలను ఆపాదిస్తూ… ప్రాంతాల మధ్య, రైతుల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
రాజధాని మార్చే అవకాశం ఉందని మీరు అనుకుంటే మార్చాలన్న ఆయన, మూడు రాజధానులను ఎవరు ఆపలేరు అంటూ తమ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు విస్మయాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని కొత్తగా అభివృద్ధి చేసేది ఏముందన్నా రఘురామకృష్ణం రాజు, లుంగీ బ్యాచ్ వచ్చి తగలబెట్టడం తప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయమని అడగాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంలో కోర్టు కడితే ఏమి వస్తుందన్న ఆయన, హంద్రీనీవా బ్యాలెన్స్ పనులను పూర్తి చేయమని ముఖ్యమంత్రి పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి రెండు మూడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కావన్న రఘురామకృష్ణంరాజు, అభివృద్ధి కోసం ఆ నిధులను ఖర్చు చేయడానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని విమర్శించారు. జ్యోతిష్యుడు చెప్పారని విశాఖకు మకాం మార్చాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మంత్రులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయండి
రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు చేస్తున్న విద్వేష పూరిత ప్రకటనలపై ఎక్కడి వారు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రను రాజకీయంగా చితకగొట్టాలని, మూడు రాజధానులను ఎవరు ఆపుతారు చూస్తామని, మా దేవుళ్ళ వద్దకు వచ్చి మీరు మొరపెట్టుకునేది ఏందనీ విద్వేష పూరిత ప్రకటనలు చేస్తూ ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోస్తున్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ లపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 153 ఏ, కింద కేసులు నమోదు చేయాలంటూ ప్రజలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయాలని రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. పోలీసులు ఎలాగో కేసులు
నమోదు చేయరని, న్యాయస్థానాలను ఆశ్రయించి మంత్రులపై కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకుందామని చెప్పారు. నేటి నుండి ప్రజలు, పార్టీలకతీతంగా మంత్రులపై ఫిర్యాదుల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని కోరారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదన్న సజ్జల
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసిన విషయాన్ని రఘురామ కృష్ణంరాజు ప్రస్తావిస్తూ… ఇప్పుడు ఎన్నికలకు వెళితే కనీసం 10 నుంచి 15 స్థానాలు అయినా వచ్చేవని, ఇంకా ఆరు నెలలు ఆగితే ఫలితాలు మరింత ఘోరంగా ఉంటాయని అన్నారు. వాళ్లు వీళ్లు రాజీనామా చేసే బదులు ఫ్రెష్ గా ఎన్నికలకు వెళ్లి వికేంద్రీకరణకు మద్దతుగా విజయం సాధించాలంటూ రఘురామ సవాల్ చేశారు. అప్పుడు పార్లమెంట్లో ఎంపీలను బ్రతిమాలు కొని విభజన చట్టంలో అమైన్మెంట్ చేయాలని కోరుదామని ఎద్దేవా చేశారు . ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లిన ఏ ఒక్కరు కూడా నెగ్గే పరిస్థితి లేదన్న ఆయన, పులివెందుల ప్రజలు కూడా బస్టాండ్ కట్టలేని జగన్మోహన్ రెడ్డి తమకు ఎందుకని అంటున్నారని పేర్కొన్నారు. రాజీనామాలు చేస్తామని చెబుతున్న శాసనసభ్యులు, తమ రాజీనామాలను ఆమోదించుకోవాలని, ఒకవేళ స్పీకర్ ఆమోదించకపోతే, న్యాయస్థానాలను ఆశ్రయించైనా ఆమోదించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అమరావతి రైతుల పాదయాత్రపై అవాకులా?
అమరావతి రైతుల పాదయాత్ర పై అవాకులు చెవాకులు పేలడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. పాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు రోజుకు 2000 రూపాయలు ఇస్తున్నారని, అందుకే రైతులు పాదయాత్ర చేస్తున్నారని సాక్షి దినపత్రికలో మాల మహానాడు నాయకుడి చేత ఒక ప్రకటన చేయించడం విస్మయాన్ని కలిగించిందన్నారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు నిర్వహిస్తున్న సభలకు 500 రూపాయలు ఇచ్చినా కూడా జనం హాజరు కావడం లేదని, ఒకవేళ వచ్చినా మధ్యలోనే వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. అటువంటప్పుడు కాళ్లకు బొబ్బలెక్కిన పాదయాత్ర చేస్తున్న రైతులను అవమానించే విధంగా రెండు వేల రూపాయలు తీసుకొని పాదయాత్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం అవివేకమని మండిపడ్డారు.

సొంత డబ్బులతో పనులు చేసి ఇబ్బందులు పడుతున్న సర్పంచులు
15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా తొలి విడతగా విడుదలైన 360 నుంచి 70 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం గుటకాయ స్వహా చేసిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. మరో 500 కోట్ల రూపాయలను హాం ఫట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిసిందన్నారు. పార్టీలకతీతంగా సర్పంచులంతా రోడ్డు మీది బికారులు మాదిరిగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సొంత డబ్బులతో పనులు చేసిన సర్పంచులు, ఇప్పుడు అడుక్కుతినాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థను చిన్న భిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి, గ్రామాలలో సచివాలయాలను నిర్మించారట అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం గోల చేస్తున్నారని చెప్పారు. సర్పంచుల ప్రభావం పార్టీ పై మామూలుగా ఉండదన్న ఆయన, పార్టీని కూకటి వేళ్లతో పెకిలి వేస్తుందని హెచ్చరించారు.. వ్యవస్థలతో పాటు పార్టీని చంపి వేస్తున్నది కూడా జగన్మోహన్ రెడ్డి నేనని మండిపడ్డారు.

దుర్గమ్మ దర్శనం టికెట్ ధర పెంచుతారా?
దుర్గమ్మ దర్శనం టికెట్ ధరను 300 రూపాయల నుంచి 500 రూపాయలకు పెంచాలని ఉపముఖ్యమంత్రి కొట్టు, సత్యనారాయణ తీసుకున్న నిర్ణయంపై రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలలో టికెట్ల ధరలను ఇష్టా రీతిలో పెంచుతున్న పాలకులు, దేవాలయాల పట్ల భక్తులలో అనురక్తి పెంచే బదులు, విరక్తి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ధనవంతుడికి మాత్రమే దైవ దర్శనం అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారన్న ఆయన, జెరూసలాం, మక్కాయాత్రలు చేసే క్రిస్టియన్, ముస్లిం మతస్తులకు సబ్సిడీలను ఇస్తూ, సామాన్యుడికి మాత్రం దుర్గమ్మ దర్శనం లేకుండా చేసే ప్రయత్నం సరైంది కాదని విమర్శించారు. సినిమా టికెట్లను తగ్గించాలని అంటున్న జగన్మోహన్ రెడ్డి, పేదవారు అమ్మవారిని దర్శించుకోవాలంటే 500 రూపాయల టికెట్ కొనుగోలు చేయాలా? అంటూ ప్రశ్నించారు. దేవాలయాల వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్న పాలకులను కనీసం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రశ్నించడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. దేవాలయాల దర్శన టికెట్ల రేట్ల పెంపు గురించి మాట్లాడితే, క్రిస్టియన్, ముస్లిం మతస్తుల ఓట్లు పోతాయేమోనని భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నదని, కానీ టికెట్ల రేట్ల పెంపు గురించి మాట్లాడితే క్రిస్టియన్, ముస్లిం మతస్థులు కూడా అభ్యంతరాన్ని చెప్పరని అన్నారు. వారిలో కూడా మానవత్వం ఉన్నదని, మానవత్వం అన్నది లేనిది కేవలం పాలకులలోనేనని విమర్శించారు. దుర్గమ్మ దర్శనం టికెట్ ను 300 నుంచి 200 రూపాయలకు తగ్గించామని ముఖ్యమంత్రి చెబితే సంతోషిస్తామన్న ఆయన, ప్రజలందరి కోరిక దుర్గమ్మ కోరిక అని ముఖ్యమంత్రి గుర్తించాలని కోరారు. పాలకులకు పేర్ల పిచ్చి, రంగుల పిచ్చి ముదిరి పాకాన పడిందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ఆర్టీసీ బస్సులకు, జిల్లా కోర్టుకు సైతం ఇటీవల తమ పార్టీ రంగులను అద్దారని అన్నారు. అలాగే విజయనగరంలో 1905లో పివి రాజుగారు ఏర్పాటు చేసిన ఆసుపత్రి పేరును కూడా మార్చాలన్న ఉద్దేశంతో మహారాజా పదం తొలగించి బ్లాక్ లో పెట్టి ప్రభుత్వ వైద్యశాల అని అన్నారు. తరువాత ఆ ఆసుపత్రికి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు పెట్టుకుంటారో, తాత పేరు పెట్టుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, త్వరలోనే ప్రభుత్వం మారాక తిరిగి పేర్లను పునరుద్ధరించుకుందామని చెప్పారు.

Leave a Reply