Suryaa.co.in

Devotional

భగవంతుడు అల్పస్థాయి వాడు కాదు

భగవంతుడు సాధారణ సందేహాలకు సమాధానమయ్యేంత అల్పస్థాయి వాడు కాదు. ఏ ప్రశ్నకూ అందనంత ఉన్నతుడు. మాటలకు ఇమడనివాడు. మనసుకు అందనివాడు. ఆత్మానుభూతికి మాత్రమే అవగాహన అయ్యేవాడు. దేవుడు సమాధానాలకు తావుకాడని, ప్రశ్నలకు అంతకంటే బద్ధుడు కాడని తెలుసుకొన్న జీవుడు.. దేవుడికి సమీప గతుడై వ్యామోహరహితుడు అవుతాడు.
సత్‌, చిత్‌ ఆనందాలు మనలోనే ఉన్నాయి. కానీ, మనకు తెలీదు. నిరంతరం వాటికోసం బయట అన్వేషిస్తూ ఉంటాం. అయినా వెతుకుతూనే ఉంటాం. నిరంతర అన్వేషణలో మనమేమిటో, మనం తెలుసుకున్నప్పుడు ఆనందం మనదవుతుంది. మనం సచ్చిదానందులం అయినప్పుడు, మన దిగుళ్లు, భయాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కనుమరుగవుతాయి. అప్పుడు వ్యామోహరహితమైన స్థితప్రజ్ఞులమవుతాం. దైవానికి దగ్గరవుతాం.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలలో మోహం మిగుల ప్రమాదకారి. ఆ మోహం తీవ్రంగా ప్రకోపిస్తే ‘వ్యామోహం’ అవుతుంది. దానికి‘తృష్ణ’ సమానార్ధకం. ముసలితనం వల్ల శరీరం జీర్ణమైనా వ్యామోహం జీర్ణం కాదు. తత్ఫలితంగా అత్యంత భయంకరమైన పాపబంధాలు ఏర్పడి మనశ్శాంతి లేకుండా పోతుంది.
దారా పుత్రులు, ధన, కనక, వస్తు వాహనాదులు, కీర్తి, ఇత్యాదులపై వ్యామోహం ఉంటుంది. ఈ వ్యామోహంలో అంతర్లీనంగా అధర్మం, అసత్యం, అన్యాయం అత్యధిక శాతం ఉండి మానవాళిని పతనావస్థకు చేరుస్తాయి. మనిషి పతనం సమాజానికి మచ్చవంటిది. ఆ మచ్చ బాహ్య సౌందర్యాన్ని చెడగొట్టి అంతఃసౌందర్యాన్ని హరించి వేయడానికి వ్యామోహమే ప్రధాన కారణం.
అనంతమైన మన పూర్వానుభవాన్ని మన పురాణాల్లో పూర్వచిత్తి అంటారు. మన ఏకాగ్రతకు భంగం కలిగించే పూర్వ వాసనలూ, జ్ఞాపకాలే పూర్వచిత్తి. ఇది గతానుగతంగా సంభవించే వ్యామోహజనితమని గ్రహించాలి. పరమాద్భుతమైన సాధనోపకరణమైన ఈ ప్రపంచంలో మమతానురాగాల మాయాతెరలు, జిహ్వ చాపల్యాలు, అందమైన సర్పాల్లా ఆకర్షించే ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటివైపూ మనసును నడిపించేది వ్యామోహమే. దానికి బద్ధులం కాకుండా చూసుకోగలిగితే మోక్షసాధన మార్గంలో అనేక బంధాలు తొలగిపోయినట్టే. అందుకే వ్యామోహాన్ని తొలగించుకుని.. మంచికి యజమానులం అవుదాం. అంతే తప్ప చెడుకు బానిసలం కావద్దు.

LEAVE A RESPONSE