Suryaa.co.in

Andhra Pradesh Telangana

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

-ఉస్మాన్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీ వరద
-ప్రకాశం బ్యారేజ్ 45 గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదిలోకి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద అంతకంతకూ నీటిమట్టం పెరుగుతున్నది. ఉదయం 9 గంటల సమయంలో 49 అడుగులు దాటిన వరద ఉధృతి ఇప్పుడు 50.4 అడుగులకు చేరింది. మరికొన్ని గంటల్లోనే 53 అడుగులు దాటే అవకాశం ఉంది. దీంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఉదయం 7 గంటలకు 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 12,79,307 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నదిలో వరద ప్రవాహం భారీగా పెరగడంతో స్నానఘట్టాలు మునిగిపోయాయి. నది దిగువన ఉన్న ముంపు మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ప్రకాశం బ్యారేజ్ 45 గేట్లు ఎత్తివేత

ప్రకాశం బ్యారేజ్‌‌ కు వరద ఉధృతి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వైరా కటల్లేరుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నుంచి కీసర వద్ద కృష్ణ నది లోకి 38 వేల 800 వందల క్యూసెక్యుల వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టం నిల్వ చేస్తూ అదనపు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ 45 గేట్లు అడుగు మేర ఎత్తి 34,000 క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. త్రాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా, ఈస్ట్రన్‌ అండ్‌ వెస్ట్రన్‌ కాలువలకు 4,800 క్యూసెక్యుల నీటి విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE