చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి).. ఓపీఎస్( ఒ.పన్నీర్ సెల్వం) మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆ పార్టీ అగ్రనేత పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఈపీఎస్ వర్గం నేత్వత్వంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతులిచ్చింది. దీంతో మాజీ సీఎం పళనిస్వామి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించాక పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. నాటి నుంచి పన్నీర్‌సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. అయితే, ద్వంద్వ నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారిందని.. పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించి చర్చిచారు. దానిలో పళనిస్వామి మద్దతుదారులు ఏక నాయకత్వ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. దీనికి పన్నీర్‌సెల్వం వర్గీయులు ససేమిరా అన్నారు.
ఈ క్రమంలోనే కోర్టు కేసులు తదితర నాటకీయ పరిణామాల అనంతరం గత నెల 23న సర్వసభ్య సమావేశం నిర్వహించగా.. ఏక నాయకత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తదుపరి సమావేశాన్ని జులై 11వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ఈ సమావేశం జరగకుండా నిషేధించాలని పన్నీర్ సెల్వం వర్గం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేడు ఓపీఎస్ వర్గం పిటిషన్‌ను తిరస్కరిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. పళని నేతృత్వంలో సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అనుమతినిచ్చింది..
తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని..
కోర్టు తీర్పు చెప్పిన కొద్దిసేపటికే ఈపీఎస్ నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకునేందుకు చేసిన తీర్మానానికి కూడా ఆమోదముద్ర వేశారు. కో ఆర్డినేటర్, జాయింట్ కో-ఆర్డినేటర్ పదవులను తొలగిస్తూ తీర్మారాన్ని ఆమోదించారు.
పళని వర్గం తీసుకొచ్చిన మొత్తం 16 తీర్మానాలను ఆమోదించారు. త్వరలోనే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.ఓపీఎస్ మద్దతుదారుల ఆందోళన..సర్వసభ్య సమావేశాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఓపీఎస్ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు సర్వసభ్య సమావేశం జరిగే ప్రాంగణం వద్ద ఈపీఎస్, ఓపీఎస్ మద్దతుదారుల మధ్య వాగ్వావాదం జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొందరు గాయపడ్డారు. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు.