-స్వరాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం
-ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన
-సీఎం కెసిఆర్ అధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు మహర్దశ
-సంస్కరణలతో సమృద్ధిగా నిధులు, విధులు, అభివృద్ధి
-కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు
-చిన్న గ్రామ పంచాయతీకి కూడా నెలకు కనీసం రూ.5 లక్షల నిధులు
-చారిత్రాత్మకంగా ప్రగతి పథంలో పల్లెలు
-మౌలిక సదుపాయాలతో గ్రామాల్లో సకల సౌకర్యాలు
-ఉమ్మడి పాలనలో అధోగతిలో గ్రామాలు
-గ్రామ పంచాయతీలకు భవనాలకు కూడా దిక్కు లేదు
-సీఎం కేసీఆర్ వచ్చాకే, దేశానికి పట్టుగొమ్మలు గా మన పల్లెలు
– తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, మెటల్ రోడ్లు, మిషన్ భగీరథ నల్లాల కు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్వపరిపాలనలో సుపరిపాలన కొనసాగుతున్నది. స్వరాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం ఆవిర్భవించింది. ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకున్నది. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. పలు సంస్కరణలతో సమృద్ధిగా నిధులు, విధులు వచ్చి అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా ప్రగతి పథంలో పల్లెలు నడుస్తున్నాయి.
మౌలిక సదుపాయాలతో గ్రామాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి. ఉమ్మడి పాలనలో అధోగతిలో గ్రామాలు ఉండేవి. విధులు, నిధులు ఉండేవి కావు. గ్రామ పంచాయతీలకు భవనాలకు కూడా దిక్కు లేదు. అంత దుర్భర పరిస్థితుల నుండి సీఎం కెసిఆర్ వచ్చాకే, దేశానికి పట్టుగొమ్మలు గా మన పల్లెలు మారాయి. అప్పుడు. ఇప్పుడు గ్రామాలు ఎట్లా ఉన్నాయి? అనే విషయాన్ని ప్రజలు విశ్లేషించుకోవాలి అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. రాయపర్తి మండలం మహబూబ్ నగర్ లో, తొర్రూరు మండలం కంఠాయపాలెం, పెద్ద మంగ్యా తండా గ్రామాల్లో, పాలకుర్తి మండలం హరిజన కాలనీ, దేవరుప్పుల మండలం చిప్పరాళ్ళబండ తండా, ధారావత్ తండా తదితర గ్రామాల్లో నూతన గ్రామపంచాయితీ భవనాలను ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో మన ప్రాంతం అభివృద్ధి జరగక వెనుకబడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకి అందాలని సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం మన BRS పార్టీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. నిధులు, విధులు ఇస్తూ, అభివృద్ధికి పాటు పడుతున్నదన్నారు.
ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త పరిపాలనా విభాగాలను కూడా ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్ కు ముందు తెలంగాణలో 10 జిల్లాలున్నాయి. ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి. అప్పుడు ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా వుండటం వల్ల పరిపాలన కష్టతరమయ్యేది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు పోవాలంటె 200 నుంచి 250 కి.మీ.ల దూరం ఉండాలి.
జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టం అయ్యేది. అధికారులకు ప్రజల సమస్యలపై ఫోకస్ చేయడం కష్టంగా వుండేది. ఈ విషయం తెలిసిన మనసున్న మారాజు సీఎం కెసిఆర్ గారు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచారని మంత్రి తెలిపారు.
దీంతో చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన పాలన జరుగుతున్నది. కొత్త జిల్లాలను 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 8 వేల 690 నుంచి 12 వేల 769 వరకు పెంచింది. పోలీస్ కమిషనరేట్లు రాష్ట్రంలో 2 నుండి 9 కి, సబ్ డివిజన్లు – 139 నుండి 163 కి, సర్కిల్స్ 688 నుండి 717 కు, పోలీస్ స్టేషన్లు 712 నుండి 814 కి పెంచారు. ప్రజలకు పాలన మరింత చేరడానికి రాష్ట్రంలో మున్సిపాలిటీలు 68 వుండగా 142కి, మున్సిపల్ కార్పొరేషన్లు 6 నుండి 13 కి పెంచారు. అలాగే మా తండాలో, గూడాల్లో మా రాజ్యం అన్న లంబాడీ, ఆది వాసి ల కోసం 3,146 తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం, ప్రయోజనాలు కలిగాయి. ప్రభుత్వ శాఖలన్నింటి నూతన విభాగాలను ఆ జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పరిచింది. దీంతో ప్రజలు గంట సేపట్లోనే తమ జిల్లాలోని ఏ ప్రదేశానికైనా వెళ్లే అవకాశం కలిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణ అధికారులకు సులువవుతున్నది. స్థానిక పరిస్థితులు, వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి అవగాహన కలుగుతున్నది.
స్థానిక వనరులను గుర్తించి, అభివృద్ధి నమూనాల రూపకల్పన చేయడం సులువవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని కార్యక్రమాలను కూడా జిల్లా యూనిట్ గానే నిర్వహిస్తారు. దీని వల్ల ఎక్కువ జిల్లాలున్న మన రాష్ట్రానికి మేలు కలుగుతుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యాలయాలను జిల్లా కేంద్రాల్లో పెడతారు. ఒక్కో కలెక్టర్ పరిధిలో రెండు, మూడు లక్షల కుటుంబాలు మాత్రమే వుండడం వల్ల పేదరికం లేకుండా చేయడానికి వీలవుతున్నది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏజన్సీ, అటవీ ప్రాంతాలు వున్నాయి. అటవీ రక్షణ, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు సులువవుతుంది. కొన్ని జిల్లాల్లో ఎస్సీ జనాభా ఎక్కువ వుంది. అక్కడ ఎస్సీల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. పట్టణ ప్రాంత అవసరాలకు తగ్గ కార్యక్రమాలు చేస్తున్నాం అని మంత్రి దయాకర్ రావు వివరించారు.
ముస్లిం, మైనారిటీలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలవుతున్నది. అటవీ శాతం తక్కువ వున్న జిల్లాల్లో పర్యావరణ సమతుల్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి.
పోలీసు కమిషనరేట్ల పరిధి, పోలీస్టేషన్ల పరిధి తగ్గడం వల్ల నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైంది. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసుల త్వరగా చేరుకోగలుగుతున్నారు. అన్ని రకాల పరిపాలన భవనాలను నిర్మించి, రాష్ట్రంలో పరిపాలన ను ప్రజల దగ్గరకు తీసుకోవడంలో సీఎం కెసిఆర్ సక్సెస్ అయ్యారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు వివరించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కొత్త గా తొర్రూరు మున్సిపాలిటీ, పెద్ద వంగర మండలం, కొత్త గ్రామ పంచాయతీలను, ఆర్డీఓ, dsp కార్యాలయం, అన్ని శాఖల కార్యాలయాల పునర్విభజన కూడా చేసుకున్నాం. అని మంత్రి తెలిపారు.
ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మహబూబ్ నగర్ లో రూ. 17.13 కోట్లు, కంటాయపలెం రూ. 41.66 కోట్లు, పెద్ద మ0గ్యా తండా రూ.6.56 కోట్లు, హరిజన కాలనీ రూ.11.3 కోట్లు, చిప్ప రాళ్ల బండ తండా రూ.2.90 కోట్లు, దరావత్ తండా రూ.10.66 కోట్ల విలువైన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, మెటల్ రోడ్లు, మిషన్ భగీరథ నల్లాల కు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.