– డ్వాక్రా సున్నా వడ్డీ రాయితీ రూ. 3 లక్షలకు కుదించిన జగన్ రెడ్డి సంక్షేమం గురించి మాట్లాడమా?
– టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
డ్వాక్రా గ్రూపులకు చంద్రబాబు రూ. 5 లక్షల వరకూ సున్నా వడ్డీ రాయితీ వర్తింపజేయడంతో మహిళలు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. వడ్డీ రాయితీని రూ. 10 లక్షల వరకూ వర్తింపజేస్తానని మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి రాగానే మాట తప్పి మడమ తిప్పాడు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రూ. 5 లక్షలు కూడా ఇవ్వకుండా రూ. 3 లక్షలకు కుదించడం మోసకారి సంక్షేమం కాదా?
జగన్ రెడ్డి చేసిన మోసం వల్ల పొదుపు మహిళలకు లబ్ధి రూ. 30 వేలకు తగ్గిపోయింది. కోటిమందికి పైగా డ్వాక్రా మహిళలకు రుణమాపీ చేస్తానని హామీ ఇచ్చి ఆచరణలో జగన్ రెడ్డి మొండిచేయి చూపాడు. డ్వాక్రాసభ్యులు రాష్ట్రంలో కోటిమందికి పైగా ఉంటే 37 లక్షల మందికి రూపాయి కూడా లబ్ధి చేకూరలేదు.
అలాగే చేయూత పథకంతో జగన్ రెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. పథకం కింద అన్ని కులాలు కలిపి కేవలం 30 లక్షల మందికి మాత్రమే లబ్ధి అంటే మిగిలిన 85 లక్షలమంది సంగతేంటి జగన్ రెడ్డీ? నాలుగేళ్లలో డ్వాక్రా పొదుపు సొమ్మును కాజేసి, అభయహస్తం కింద రూ. 2,110 కోట్లు దారి మళ్లించి, స్త్రీ నిధి పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఇది చాలదా జగన్ రెడ్డి మహిళా సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి?
మహిళా భద్రత గురించి కూడా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్ల పేరుతో హడావుడి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్లలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, అదృశ్యానికి సంబంధించి నమోదైన ఒక లక్షా 22 వేల నేరాలపై ఏం సమాధానం చెప్తారు? సీఎం ఇంటి పక్కన ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేని జగన్ రెడ్డి మహిళా భద్రత, మహిళా సంక్షేమం గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది.
నాశిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్న జగన్ రెడ్డికి మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీ. వచ్చే ఎన్నికల్లో మహిళలు జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం. తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ఖాయం.