Suryaa.co.in

Entertainment National

జయప్రదకు జైలు శిక్ష

-ఆరు నెలల ఖైదు విధించిన ఎగ్మోర్ కోర్టు
-చెన్నైలోని థియేటర్ కార్మికుల కేసులో తీర్పు
-మరో ముగ్గురికీ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. చైన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.

చెన్నైలోని రాయపేటలో మాజీ ఎంపీ జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ ను నడిపించారు. ప్రారంభంలో బాగానే నడిచినా తర్వాతి కాలంలో థియేటర్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో థియేటర్ ను బంద్ చేశారు.

థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీనిపై ఇటు కార్మికులు, అటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని, ఆ మొత్తం వెంటనే చెల్లించేందుకు సిద్ధమని జయప్రద తరఫున లాయర్ కోర్టుకు వెల్లడించారు.

ఇదే విషయాన్ని వివరిస్తూ కోర్టులో మూడు పిటిషన్లను కూడా దాఖలు చేశారు. అయితే, కోర్టు ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని కేసును కొనసాగించింది. సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం తీర్పు వెలువరిస్తూ.. జయప్రదతో పాటు ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానా విధించింది.

LEAVE A RESPONSE