అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని సొంత పార్టీ డీఎంకే నేతలకు తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరికలు చేశారు. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన నమక్కల్ లో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో అవినీతి రహిత పాలన అందించాలంటూ వారికి కర్తవ్య బోధ చేశారు. తప్పుడు పనులకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని స్టాలిన్ స్పష్టం చేశారు.
క్రమశిక్షణ గీత దాటినా, పార్టీ సిద్ధాంతాలను అతిక్రమించినా, అవినీతికి పాల్పడినా పార్టీపరమైన చర్యలే కాకుండా, వారిని కోర్టుకీడ్చుతామని ఘాటుగా హెచ్చరించారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని, కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైతే తాను నియంతగా కూడా మారగలనని స్పష్టం చేశారు.
“పంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి కార్పొరేషన్ మేయర్ వరకు నేను చెప్పేది ఒక్కటే… మీపై ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు లేకుండా చూసుకోండి. రాష్ట్రాన్ని నడిపిస్తామన్న ఉద్దేశంతో ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు. డీఎంకేతోనే తమిళనాడు భవిష్యత్తు సాధ్యం. పార్టీకి మచ్చ తీసుకురావొద్దు” అని పేర్కొన్నారు.
అంతేకాదు, స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులకు కూడా ఉద్బోధ చేశారు. “ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యతలను దయచేసి మీ భర్తలకు అప్పగించకండి” అని హితవు పలికారు.