-సామాజిక న్యాయం అనే అర్హత వైసీపీకి ఉందా.?
-చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్ చేస్తే.. జగన్ రెడ్డి ఆరాచకానికి హబ్‌గా మార్చారు
-ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా విద్యాభివృద్ధి అనడం సిగ్గుచేటు
-టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష
సారా డాన్ బొత్స సత్యన్నారాయణకు విద్యాశాఖ ఇవ్వడమే ఆంధ్రప్రదేశ దౌర్భాగ్యం. అలాంటి లిక్కర్ డాన్ విద్యార్ధుల గురించి చదువుల గురించి మాట్లాడడం చూసి ఆ సరస్వతీ దేవి కూడా కన్నీరు పెడుతోంది. పేదలకు ఇంగ్లీష్ చెప్పొద్దా అంటూ బీరాలు పోయి, విద్యార్ధుల్ని ఉద్దరించినట్లు ప్రచారం చేసుకుంటూ విద్యా ప్రమాణాలను గాలికొదిలేసింది. పదో తరగతిలో రెండున్నర లక్షల మంది విద్యార్ధుల్ని ఫెయిల్ చేసి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంది. ఇప్పుడు బైజూస్ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపింది. బైజూస్ వల్లనో, ఇంగ్లీష్ మీడియం వల్లనో పాఠశాలలకు రంగులు వేయడం వల్లనో విద్యా ప్రమాణాలు పెరగవని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. విద్యా ప్రమాణాలు పెరగాలంటే డీఎస్సీ నిర్వహించాలి. ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల్ని విద్యా అవసరాలకు మాత్రమే వాడాలి. టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు ఎత్తేసి విద్యా వ్యవస్థను అధ్వాన్నంగా తయారు చేసిన జగన్ రెడ్డి, బొత్స విద్య గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏటా 94శాతానికి పైగా ఫలితాలు సాధించాం. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తొలిసారి నిర్వహించిన పరీక్షల్లోనే అధ్వాన్నంగా 67శాతం మంది మాత్రమే పాసై సుమారు రెండున్నర లక్షల మంది ఎందుకు ఫెయిలయ్యారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. స్కూళ్లకు, బెంచీలకు రంగులేస్తేనో, పిల్లలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటో పెడితోనో చదువులు రావని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్ రెడ్డికి, మంత్రి బొత్సకు ఏమాత్రం విజ్ఞత ఉన్నా.. పదవులకు రాజీనామా చేయాలి.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఈ రాష్ట్రానికి రాజులాగా రాష్ట్రాన్ని విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే సామంతులకు దారా దత్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులిచ్చామని చెప్పడం తప్ప వారికి ఏ అధికారాలిచ్చారో జగన్ రెడ్డి చెప్పాలి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. వైవీ సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి.. 16,800 రాజ్యాంగ పదవుల్ని బీసీలకు దూరం చేశారు. ఆదరణ రద్దు చేశారు. వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సామాజిక వర్గాల వారిని దారుణంగా చంపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన సబ్ ప్లాన్ల నుండి సుమారు రూ.30వేల కోట్ల నిధులు దారి మళ్లించడం సామాజిక న్యాయమా.? 11వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని లాక్కోవడం సామాజిక న్యాయ విద్రోహం కాదా.? అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పంటల బీమా ఎగ్గొట్టడం సామాజిక న్యాయానికి ద్రోహం కాదా.? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందాల్సిన పారిశ్రామిక రాయితీల్ని రద్దు చేయడం సామాజిక విద్రోహం కాదా.? ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ జరపకపోవడం రిజర్వేషన్ల వర్గాలకు అన్యాయం చేయడమే.
గురుకుల పాఠశాలల్ని కుదించడం, విదేశీ విద్యకు విడుదల చేయకపోవడం ఏ విధమైన సామాజిక న్యాయం.? మూడేళ్ల వైసీపీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి బొత్స సత్యన్నారాయణ ఏం సమాధానం చెబుతారు.? జగన్ రెడ్డికి గులాములుగా కొద్ది మందికి మంత్రి పదవులివ్వడమే సామాజిక న్యాయమా.? సామాజిక న్యాయం అనే మాట పలికే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదని గుర్తుంచుకోవాలి.