-రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగిందేంటి?
-ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ చరిత్రలో ఉందా?
-అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులు ఏమయ్యాయి?
-తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల ధ్వజం
రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి అత్యంత అమానవీయంగా, దుర్మార్గంగా ఉంది. ఇంటీరియమ్ రిలీఫ్ 27శాతం ఉండగా, అందులో నాలుగు శాతం కోతకోసి 23శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం చరిత్రలో ఇదివరకెన్నడూ లేదు. ఊరికో కోడి, ఇంటికో ఈక ఇచ్చి కొట్టుకుచావండి అన్నట్టు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఉంది. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన సాగిస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. ఉద్యోగుల జీతభత్యాల సవరణ కోసం ఏర్పాటుచేసి అశుతోష్ మిశ్రా కమిషన్ సిఫారసులను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయలేదు? పి.ఆర్.సి కమిటీ రిపోర్టుతో సంబంధం లేకుండా కొత్తగా సి.ఎస్ కమిటీ పేరుతో ఉద్యోగులను నిండా ముంచారు. పాలన ఆర్థిక అంశాలపై ప్రభుత్వానికి ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వం, ఉద్యోగులు పరిపాలనలో రెండు చక్రాల బండి లాంటివారు. రెండూ సమన్వయంతో పని చేసి ప్రజలకు సేవలందించాలి.
సాక్షి, భారతి సిమెంట్ , ప్రభుత్వ సలహాదారుల సంక్షేమంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించింది. ప్రజలకు పన్నుల పోటు, ఉద్యోగులకు జీతం పొటుతో జగన్ పోటుకు బాధితులు కాని వారు లేరు. కొత్త పీఆర్సీలో ఐ.ఆర్ కన్నా 4 శాతం కోత పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు అమలు జరుగుతున్న హెచ్.ఆర్.ఏలో 50 శాతం కోత విధించింది. రాష్ట్రంలో ఎప్పటి నుండో అమలు జరుగుతున్న సిటి కంపెన్షటరీ అలవెన్స్ రద్దు, క్వాంటం పెన్షన్ వయస్సు 70 నుండి 80 సం. పెంపు, పీఆర్సీ ఐదు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాలు అమలు లాంటి అనేక నిర్ణయాలతో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేశారు. జగన్ రివర్స్ పాలనలో ప్రతి ఉద్యోగి జీతం 15 నుండి 20 శాతం తగ్గనుంది. దేశ చరిత్రలో 7 డి.ఏ లను పెండింగ్ ఉంచిన ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డిదే. డి.ఏ చెల్లింపు అప్పుడు ఇప్పడు అంటూ 3 జీవోలను జారీ చేసి ఒక్క దానిని అమలు జరపలేదు. కొత్త పీఆర్సీ తో జీతాలు తగ్గించడడమే కాకుండా చెల్లింపులు జరిపిన వాటిని సైతం రికవరీ చేసే చర్యలు ప్రభుత్వం దివాళ కోరుతనానికి నిదర్శనం.
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం 43శాతం ఫిట్ మెంట్ తో పిఆర్ సి ప్రకటించడమేగాక రాష్ట్ర విభజన నోటిఫై తేదీ జూన్ 2 నుండి అమలు చేసి 4 వేల కోట్ల రూపాయల అరియర్స్ ను సైతం ఉద్యోగులకు అందజేసింది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుండి అమరావతి వచ్చిన ఉద్యోగులకు 30 శాతం హెచ్.ఆర్.ఏ ఇవ్వడం జరిగింది. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు క్వాంటం పెన్షన్ వయస్సు తగ్గించి 70 సంవత్సరాలకు అమలు చేయడం జరిగింది. తెలుగుదేశం 5 సంవత్సరాల కాలంలో 10 డి.ఏలు చెల్లించింది. డి.ఏ 9 శాతం నుండి 30 శాతానికి పెంచాము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 62 జీవోలిచ్చి ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేస్తే నేడు నాలుగు జీవోలతో ఆ సంక్షేమానికి బీటలు వాటిల్లేలా వ్యవహరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత కోయడమేగాక వారినుంచి రివర్స్ లో బకాయిలు రికవరీ చేసేందుకు సిద్ధం కావడం దారుణం.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పాలనా యంత్రాంగంలో కీలక సేవలందించే ఉద్యోగులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలి. ఉద్యోగుల సంక్షేమానికి తూట్లు పోడుస్తున్న నాలుగు జీవోలను రద్దు చేయాలి. అశుతోష్ మిశ్రా కమిషన్ సిఫారసులను బహిర్గతం చేసి పిఆర్సీని అందుకు అనుగుణంగా సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. తమ న్యాయమైన హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.