Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా క్షేత్రంలో బాబును ఎప్పుడో బర్తరఫ్ చేశారు

– పదవీ వ్యామోహం తప్ప బాబుకు ప్రజల పట్ల బాధ్యత లేదు: డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి
– బద్వేలు ఉప ఎన్నికలో వన్ సైడ్ తీర్పు రాబోతుంది
– జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉనికి కోసం తాపత్రయం: మంత్రి ఆదిమూలపు సురేష్
– విభజన హామీలు నెరవేర్చమని అడిగితే.. బీజేపీ ఎదురుదాడి చేస్తోంది
– ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తా: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేయడానికి కూడా మేం సిద్ధం అని చెప్పాను. ఆ త్యాగం కూడా ఎందుకు చేస్తామన్నామంటే.. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏమైతే ఉన్నాయో రాష్ట్రానికి ప్రజల హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌.. ఈ మూడు అంశాలు విభజన చట్టంలో ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని మీరు నెరవేర్చుతామని ప్రకటిస్తే మీకు మద్దతు ఇస్తాం, లేకుంటే మేము చేయలేమని మీరు క్షమాపణ చెప్పాలని అడిగాం. దానికి బీజేపీ నుంచి సమాధానం వస్తుందని ఆశించాం. సమాధానం చెప్పకుండా సోము వీర్రాజు ఎదురుదాడి చేస్తూ, వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చలేకపోయారని మీరు అంగీకరించారని మేము భావిస్తున్నాం.
ఇక వ్యక్తిగతంగా నాపై ఛాలెంజ్‌ అంటూ ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మీరు పెద్దలు, అనుభవజ్ఞులు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నాననిగానీ, అందులో నా ప్రమేయం ఉందని రుజువు చేస్తే.. నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సోము వీర్రాజుగారు విమర్శలు చేసేటప్పుడు, రాజకీయ కోణంలో మాట్లాడాలనుకున్నప్పుడు కాస్త ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది.
రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో రాజీ పడకండి. చెప్పిన అంశాలను రాష్ట్రం కోసంచేయాలే కానీ ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. పోలవరం విషయంలో కేంద్రం సకాలంలో నిధులు మంజూరు చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులు వెచ్చించి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ప్రాజెక్ట్‌ ఎంత ముఖ్యమో, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కూడా అంతే ముఖ్యమని మేము ఎంత చెప్పినా.. అంచనా వ్యయాన్ని తగ్గిస్తున్నారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన దాదాపు రూ.3వేల కోట్లు ఇప్పటికీ కేంద్రం నుంచి రాలేదు. ఇది మీ బాధ్యత కాదా? తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన సోము వీర్రాజు దీనిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
సోము వీర్రాజు వాళ్ల అభ్యర్థితో బద్వేల్ అభివృద్ధి- సమస్యలపై చర్చ జరపాలని అంటున్నారు. మా అభ్యర్థి దివంగత వెంకటసుబ్బయ్య గారి సతీమణే కాదు, విద్యావంతురాలు, వైద్యురాలు కూడా. స్థానిక నివాసి అయిన ఆమెకు ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. అదే మీరు నిలబెట్టిన అభ్యర్థి పక్క ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు అవగాహన ఉంటుందా? విద్యావంతురాలు అయిన సుధాగారికి అవగాహన ఉంటాందా.. అనేది ప్రజలు గమనించాలి. ఈ అంశాలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎదురుదాడి సిద్ధాంతాలు మాని రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై నిలబడాలని కోరుతున్నాం.
డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని వర్గాల అభ్యున్నతే తమ అభిమతంగా పని చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ప్రతి పేదవాడు విద్యావంతుడు అవ్వాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వైయస్సార్‌ సీపీ అభ్యర్థి సుధాని గెలిపించాలని కోరుతున్నాం. మహిళలు అందరూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఇక టీడీపీ గురించి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్రల గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికలు బహిష్కరించామంటూనే మరోవైపు తన పార్టీ నుంచి బీఫారాలు ఇవ్వడం చూశాం. ఇవాళ టీడీపీ బద్వేలులో తమ అభ్యర్థిని పెట్టకపోయినా.. బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరి పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు ఎవరు పెంచుతున్నారో సోము వీర్రాజుగారు సమాధానం చెప్పాలి. ధరల పెంపునకు ముఖ్యమంత్రిగారే కారణం అంటూ బురద చల్లే కార్యక్రమం చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నాం.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళాడు. చంద్రబాబుకు పదవి లేకపోతే బతికి ఉండలేడు. అందుకే పదవీ వ్యామోహంతో కొట్టుకుపోతూ .. ఢిల్లీ వెళ్ళి కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా.. రాష్ట్ర ప్రజలు జగన్‌ మోహన్‌ రెడ్డి వెంటే ఉన్నారు. చంద్రబాబు అవకాశం దొరికినప్పుడల్లా రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బర్తరఫ్‌ చేయడం జరిగింది.
జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల పక్షాన ఉంటే, చంద్రబాబు ధనికుల పక్షాన ఉన్నారు. ప్రతి పేదవాడికి రాజకీయంగా సమానత్వం రావాలనే దృక్పధంతో ముఖ్యమంత్రి ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అన్నివిధాలా న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని కూడా మంత్రులను చేసి సముచిత స్థానం కల్పించారు. చంద్రబాబు ఓట్ల కోసం ఎస్సీలను చీల్చాడు తప్ప.. వాళ్ల అభ్యున్నతికి ఏనాడూ కృషి చేయలేదు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని. త్వరలో జరగబోయే కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో చంద్రబాబు గెలవగలడా. ఇప్పటికైనా టీడీపీ శవ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం.
మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే
బద్వేల్‌ ఉప ఎన్నికల్లో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ ఎన్నిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, రాజ్యాంగ బద్ధంగా నిర్వహించాలని వైయస్సార్‌ సీపీ పరిపూర్ణంగా కోరుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రెండున్నరేళ్లలో అందించిన జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏవిధంగా ప్రజల వద్దకు నేరుగా చేరాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనటువంటి విధంగా ఓటరుతో నేరుగా, ఏ రాజకీయ పార్టీ అనేది చూడకుండా అందరితో సత్‌ సంబంధాలు కలిగి, అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది ఈ ప్రభుత్వం. సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు బద్వేల్‌ ఉప ఎన్నికలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. జగన్‌ గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రధాన ఆయుధంగా చేసుకుని ప్రజల వద్దకు ఓట్లు అడిగేందుకు వెళ్లాం. బద్వేల్‌ ప్రాంత అభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో చేసిందనేదానికి ప్రతి మండలంలోనూ, ఎక్కడికి వెళ్ళి అడిగినా ప్రజల నుంచి టక్కున సమాధానం వస్తోంది. వైయస్సార్‌ సీపీ కార్యకర్తగా ప్రతి గ్రామంలో ప్రచారం చేపట్టి, ప్రభుత్వ పథకాల అమలును, ముఖ్యమంత్రిగారి ఆలోచనా విధానాన్ని ఓటర్ల వద్దకు తీసుకువెళ్లాం.
బీజేపీ వాళ్లు మాపై నీలాపనిందలు వేస్తూ, ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక, తాము దిగుమతి చేసుకున్న అభ్యర్థిని ముందు పెట్టి… మా పార్టీ ప్రజాప్రతినిధులపై, ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. అది మంచి పద్దతి కాదు. పరుష పదజాలం కానీ, దిగజారుడు మాటలు కానీ మేం మాట్లాడటం లేదు. మేము కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం బద్వేల్‌ ఉప ఎన్నికను నిర్వహిస్తామని చెబుతున్నాం.
జాతీయ పార్టీ అయినా… తోక పార్టీలా జెండా, అజెండా లేకుండా ఉనికి కోసం పాకులాడుతోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను కూడా బీజేపీ నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు. బద్వేల్ లో డిగ్రీ కాలేజి బీజేపీ ఏర్పాటు చేస్తుందట. వారి పరిధిలోని లేని హామీలు ఇస్తున్నారు. బీజేపీ- టీడీపీ సంకీర్ణ పాలనలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నాం చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వారి వివక్ష ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ఎదురు దాడి చేస్తున్న బీజేపీది దివాళాకోరు రాజకీయం.
జగన్‌ నాయకత్వం మీద, నమ్మకంతో చైతన్యవంతులైన బద్వేల్‌ ఓటర్లు స్పష్టమైన, వన్‌సైడ్‌ తీర్పును అందించబోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ గురించి మాట్లాడటం కూడా అవసరం లేదు. మరి ఈరెండు పార్టీలు ఎందుకు తాపత్రాయపడుతున్నాయో అర్థం కావడం లేదు. బద్వేల్‌ ప్రజలు మాత్రం ఏకపక్షంగా వైయస్సార్‌ సీపీకి విజయం అందించబోతున్నారు.
ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏమన్నారంటే
బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీ అభ్యర్థిని డా. సుధగారిని గెలిపించాలి. అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌ రామ్ ల స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కి, బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా నిలబడాలని కోరుకుంటున్నాం. దళిత, బహుజన వర్గాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రిగారిని మీ తీర్పుద్వారా ముందుకు నడిపించాలని కోరుతున్నాం. అంబేడ్కర్‌ ఆకాంక్షించిన విధంగా.. పేదల స్థితిగతులు మెరుగుపరిచేలా రెండున్నరేళ్లలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన సాగుతోంది.
సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు నేరుగా పేదల తలుపు తడుతున్నాయి, వారికి భరోసా ఇస్తున్నాం. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా ముఖ్యమంత్రిగారి పాలన సాగుతోందని గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నాం. ప్రధాన ప్రతిపక్షం పోటీ నుంచి పారిపోతే రాష్ట్రంలో అథఃపాతాళానికి పడిపోయిన రెండు జాతీయ పార్టీలు మాతో పోటీ పడుతున్నాయి. ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదు.
కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ రాజకీయ జీవితం చూస్తే.. ఆమె కమిషన్ సభ్యురాలిగా ఉండి, ఎస్సీలపైనే కేసులు పెట్టించిన పరిస్థితి చూశాం. అందుకే చెబుతున్నాం, బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే.. మన గొయ్యి మనం తీసుకున్నట్టే.
రాష్ట్రంలో కనీసం సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోకుండా, పక్క రాష్ట్రం నుంచి వచ్చి పోతున్న బాబు.. ఇక్కడ కొంతమంది తన తాబేదార్లను ప్రోత్సహిస్తూ బూతు రాజకీయం చేస్తున్నాడు. ప్రజా క్షేత్రంలో గెలవలేని అసమర్థుడు చంద్రబాబు.
ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏమన్నారంటే
బద్వేల్‌ ఉప ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీకి మాత్రమే ఓట్లు అడిగే అర్హత ఉంది. రాష్ట్ర విభజనకు కారణం అయిన కాంగ్రెస్‌, విభజన హామీలు అమలు చేయడంలో విఫలం అయిన బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని చెబుతున్నాం. వైయస్సార్‌ సీపీ అభ్యర్థి సుధమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం.
చంద్రబాబు నాయుడు అధికారం కోసం తపన పడుతూ ఢిల్లీ వెళ్లి అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. చేసిన తప్పు ఒప్పుకుంటే మంచిది బాబూ అని చెబుతున్నాం. 2024 ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా టీడీపీకి ఉండదని చెబుతున్నాం.
అధికార దాహంతో ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న చంద్రబాబు మాటలు చూస్తే.. ఆయన కూడా డ్రగ్స్ కు వాడుతూ, మైండ్ చెడిపోయి మాట్లాడుతున్నాడనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఆయనకు డ్రగ్ టెస్టు, నార్కో అనాలసిస్ టెస్టులు చేయించాలి. తనను ఓడించారని కక్ష కట్టినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది.

LEAVE A RESPONSE