– చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కూడా వసూళ్లు ఆపాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడంలో అంతర్యం ఏమిటి?
– చిల్లకల్లు టోల్ డబ్బులను కూడా తెలంగాణ ఖజానా నుండే చెల్లిస్తారా?
– రాయలసీమ రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద మినహాయింపు ఎందుకు ప్రకటించలేదు?
– తెలంగాణ బిడ్డల పండుగలు మీకు పండుగలు కావా?
– నిలదీసిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
– రాబోయే దసరా, బతుకమ్మ పండుగలకు కూడా ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం టోల్ మినహాయింపు నిర్ణయం తీసుకోవడంపై శాసనమండలి విప్ దేశపతి శ్రీనివాస్ స్పందించారు.
పండుగకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యాల కల్పించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ నిర్ణయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరి మరియు వివక్షను ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద కూడా వసూళ్లు ఆపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాయడంలో అంతర్యం ఏమిటన్నారు?
పంతంగి, కొర్లపాహాడ్ వద్ద మినహాయింపు ఇస్తూ ఆ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తున్నప్పుడు, పక్క రాష్ట్రంలోని చిల్లకల్లు టోల్ డబ్బులను కూడా తెలంగాణ ఖజానా నుండే చెల్లిస్తారా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలి. మన రాష్ట్ర ప్రజల సొమ్మును పక్క రాష్ట్ర టోల్ గేట్ల కోసం ఖర్చు చేయడం ఏ రకమైన పరిపాలన?
తెలంగాణ నుండి కేవలం విజయవాడ వైపు వెళ్లే వారే కాదు, వేల సంఖ్యలో ప్రజలు రాయలసీమ (కర్నూలు, అనంతపురం) మార్గంలో ప్రయాణిస్తారు. ఆ రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద మినహాయింపు ఎందుకు ప్రకటించలేదు? ఆంధ్ర ప్రాంత ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వం, కేవలం ఒకే మార్గానికి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటి?
మన రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీకలైన బతుకమ్మ మరియు దసరా పండుగలకు హైదరాబాద్ నుండి లక్షలాది మంది సొంత ఊళ్లకు వెళ్తారు. అప్పుడు కూడా టోల్ గేట్ల వద్ద గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనం నరకం చూస్తారు. మరి అప్పుడు లేని ఈ టోల్ మినహాయింపు ఆలోచన ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది? తెలంగాణ బిడ్డల పండుగలు మీకు పండుగలు కావా? అప్పుడు ట్రాఫిక్ కష్టాలు మీకు కనిపించలేదా?
ఆంధ్ర ప్రయాణికులకు సదుపాయం కల్పించడం తప్పు కాదు, కానీ అదే సమయంలో తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదు. పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని గౌరవిస్తూనే, మన గడ్డ మీద పండుగలు చేసుకునే తెలంగాణ బిడ్డల అవసరాలను కూడా ప్రభుత్వం గుర్తించాలి.
రాబోయే దసరా, బతుకమ్మ పండుగలకు కూడా ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించాలి. పండుగ పూట కూడా ఓట్ల రాజకీయాలు చేయకుండా, అందరినీ సమానంగా చూడాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.