Suryaa.co.in

Political News

నేను రాను బాబోయ్..సర్కారు దవాఖానకి!!

రుయా..అక్కడ ఎవరికీ ఉండదా దయా..
సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశుని క్షేత్రమైన తిరుపతిలోనే రోగికి రక్షణ..శవానికి మర్యాద(ఇలా రాయడం తప్పు కాదు కదా)
ఆస్పత్రుల సిబ్బంది మాయ రోగానికి నియంత్రణ కొరవడిన దుర్భర స్థితి నెలకొంది.విజయవాడలో..
తిరుపతిలో వరసగా జరిగిన రెండు అమానవీయ సంఘటనల పచ్చి ఇంకా బాధ పెడుతుండగానే విశాఖ కేజిహెచ్ లో లంచాల దుమారం..ఎక్కడికి పోతున్నాం మనం,.ఇదెంత ఘనం..!

అయ్యా..ఇన్ని ఉచితాలు దేనికి..విద్య..వైద్యం ఉచితంగా..సముచితంగా సమకూర్చండి చాలు బాబూ అంటున్నందుకు ఉన్నంతలో ఉచితంగా వైద్యం దొరికే చోట రాక్షసుల సయ్యాట..ఆస్పత్రిని వైద్యాలయం అన్నారు పెద్దలు..ఆలాంటి ఆలయంలోనే మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఆడకూతురిపై అత్యాచారం.. అదెంతటి ఘోరమైన కృత్యం..!?

చేతికి అందివచ్చిన కొడుకు ఆస్పత్రిలో కళ్లెదుటే కన్ను మూస్తే శవానికి కన్నతల్లి ఒడిలోనే అంత్యక్రియలు జరిపేందుకు ఒక తండ్రి పడిన తపనకు చూస్తుండగానే చితి పేర్చేసారు ఆంబులెన్స్ సిబ్బంది..చివరకు ఆ అయ్య కుయ్యో మొయ్యో అంటూ కొడుకు శవాన్ని మోటార్ సైకిల్ పై తీసుకువెళ్ళే దుస్థితి ఏర్పడిందంటే డెబ్బై అయిదు సంవత్సరాల ఘనమైన స్వాతంత్ర భారత దేశంలో ఇది.. ప్రగతా..సిగ్గుతో చచ్చిపోవాల్సినంతటి అధోగతా..! ఇవేమి ప్రభుత్వాలు..!?

ప్రతి ఏటా వైద్యం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..అయితే సర్కారీ దవాఖానల్లో ఇప్పటికీ దుర్భర పరిస్థితులే..
ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయం..గుంటూరు..విజయవాడ.. తిరుపతి.. కాకినాడ..పరాకాష్టగా విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి.. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు..వారి బంధువుల బాధలు వర్ణనాతీతం,.సిబ్బంది నోరిప్పితే బూతులు.. మనుషులను కుక్కల కంటే హీనంగా చూసే సంస్కృతి ఆ ఆస్పత్రులలో సంవత్సరాలుగా పాతుకు పోయి ఉంది..ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా సౌకర్యాల మాట అటుంచితే వెళ్లినాక వైద్యం ..ఒక్కోసారి ప్రాథమిక వైద్యమైనా సక్రమంగా దొరుకుతుందనే నమ్మకం ఇప్పటివరకూ ప్రజల్లో కలగలేదు..కేజీహెచ్ లో ఎన్నో విభాగాలు..ఎంతో మంది నిపుణులైన వైద్యులు..వారి సహాయకులు.. ఎవరున్నా.. ఎందరున్నా … వారి జీతాల రూపేణా కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నా ఇప్పటికీ..మొహమాటం లేకుండా చెప్పాలంటే ఆ ఆస్పత్రి నరక కూపమే..రోజూ కిటకిట కనిపించే ప్రాంగణంలో ఎవరు ఎందుకు వస్తున్నారో..ఎలా వెళ్తున్నారో..అసలు వారికి వైద్యం సక్రమంగా అందుతుందో లేదో ఆ పర్యవేక్షణ..పరిశీలన మృగ్యం..అంతెందుకు..
అంత పెద్ద ఆస్పత్రి ఉన్నా నగరం నిండా ప్రైవేట్ ఆస్పత్రులు..ఆ మాటకొస్తే ఆస్పత్రి చుట్టూతా బోలెడన్ని ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల్లో ‘బిజినెస్’చేసుకుంటున్నాయి.వాటిలో చాలా వరకు ఆ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులవే కావడం మరో విశేషం..!

ఇక విజయవాడ ఆస్పత్రి సంఘటన విషయానికి వస్తే అంత పెద్ద ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం జరిగిందంటే ఎంత సిగ్గు చేటు.. సస్పెన్షన్లు..గత ప్రభుత్వం హయాంలో ఇంతకంటే ఘోరాలు జరిగాయనే దులుపుడు ప్రకటనలతో సమస్యలను పక్కదారి పట్టించడం సర్కార్లకు పరిపాటైపోయింది.
రుయా ఆస్పత్రి సంఘటన మరీ దారుణం..కొడుకు పోయాడన్న బాధలో కృంగిపోతున్న తండ్రి దయనీయ పరిస్థితితో ఆడుకుని ఆయనను మానసికంగా చంపేసి మొత్తంగా మానవత్వాన్ని సమాధి చేసేశారు సిబ్బంది..

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలు..పనికిరాని కన్నీటి బొట్లు..అనవసర రాజకీయాలు కాదు కావలసింది.. శాశ్వత నివారణ చర్యలు..అవి ఉండవు… ఆశించడం కూడా
అనవసరం..

కేజీహెచ్ లంచాల ఉదంతంపై తాజా వీడియో చూస్తుంటే అక్కడి సిబ్బంది శైలిపై జుగుప్స కలగక తప్పదు..శవాన్ని తరలించడానికి..పుట్టిన బిడ్డకు..తల్లికి సేవ చెయ్యడానికి..అందులోనూ మగబిడ్డ ఆడబిడ్డ మద్య రేట్ల వ్యత్యాసాలు ..ఒపి రాయడానికి..దేనికి లేదు లంచం.. ధూ..!
అయ్యా..ప్రభుత్వంలోని పెద్దలూ..జరుగుతున్న ఉదంతాలు చాలవా..కళ్ళు తెరవడానికి..మీలోని ,కుకుళ్లు కడుక్కోడానికి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్

LEAVE A RESPONSE