Suryaa.co.in

Andhra Pradesh

ప్రజలపై జగన్ ప్రభుత్వం అడ్డగోలు విద్యుత్ వడ్డనలు

-నూతన మీటర్ల బిగింపు పేరిట ప్రజలకు క్షవరం చేయనున్న ప్రభుత్వం
-2014- 19 మధ్య విద్యుత్ చార్జీలను పెంచలేదని, ఆ మొత్తాన్ని కూడా కలిపి ప్రజల నుండి విద్యుత్ వసూళ్లు
-నూతన మీటర్లకు 6 వేల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేదే లేదని టెండర్లను రద్దు చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం
-కానీ ఆంధ్రప్రదేశ్లో అధిక ధరలకు మీటర్లను కొనుగోలు చేసి… ఎన్నో ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని సమానంగా వసూలు చేస్తారట
-ప్రతి ఏటా 15% చెత్త పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న చెత్త ప్రభుత్వం ఇది
-రానున్న 15 ఏళ్ల ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇంటి పన్ను కట్టలేక ఇళ్లను వదిలి వెళ్లాల్సిన దుస్థితి ప్రజలది
-రాష్ట్ర ప్రభుత్వానికి, సాక్షి మీడియాకు, నీలి చానెళ్లకు వ్యతిరేకంగా చెక్కుచెదరని ధైర్యంతో పోరాడుతున్న డాక్టర్ సునీత
-అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సునీత సవాల్
-సీబీఐ కోర్టులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్ రాకపోవచ్చు… హైకోర్టులో బెయిల్ లభించే అవకాశాలు
-మా పార్టీ ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు… అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారా లోకేష్
-మార్గదర్శి కేసును విచారిస్తున్నది సిఐడి పోలీసులా?, సాక్షి మీడియానా?
-అసైన్డ్ రైతుల వద్ద నుంచి మా పార్టీ పెద్దలు ఎప్పుడో భూములు లాగేశారు… అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల లబ్ధి చేకూరేది ఎవరికో ప్రజలందరికీ తెలుసు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

విద్యుత్ చార్జీలను పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలపై పెను విద్యుత్ భారాన్ని మోపుతోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో 2014-19 సంవత్సరాల మధ్య విద్యుత్ చార్జీలు పెంచలేదని చెప్పి, గతంలో పెంచాల్సిన విద్యుత్ చార్జీల మొత్తాన్ని ఇప్పుడు విద్యుత్ వినియోగదారుల వద్ద నుంచి ఈ ప్రభుత్వం వసూలు చేస్తోంది. అలాగే మే నెలలో అధిక ధరలు చెల్లించి విద్యుత్ ను కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆభారాన్ని కూడా ప్రజలపై మోపుతోంది. ఇక నూతన విద్యుత్ మీటర్ల బిగింపు, నిర్వాహణ పేరిట ఎన్నో సంవత్సరాల పాటు ఆ మొత్తాన్ని సమానంగా వసూలు చేయనున్నారట అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

నూతన విద్యుత్ మీటర్లకు ఆరువేల రూపాయల కంటే అధికంగా ఒక్క రూపాయ కూడా చెల్లించేది లేదని ఉత్తర ప్రదేశ్ లో టెండర్లను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీని ద్వారా, బిజెపికి, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఆశ్రితపక్షపాతం లేదని స్పష్టం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అధిక ధరలకు విద్యుత్ మీటర్లను కాంట్రాక్టర్ వద్ద కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని ప్రజలపై భారం వేయనున్నారన్నారు.

బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… విద్యుత్ వడ్డనలను పరిశీలిస్తే ప్రజలు స్విచ్ వేశారంటే పక్కనే ఉన్న ప్లగ్గులు వేలు పెట్టినట్టే. స్విచ్ వేస్తేనే విద్యుత్ చార్జీల మోత మోగనుండగా, స్విచ్ వేయకపోయినా నూతన విద్యుత్ మీటర్ల భారాన్ని ప్రజలు మోయక తప్పదు. విద్యుత్ చార్జీలను పెంచబోమని మేము ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము చెప్పిన అబద్ధాలను ప్రజలను నమ్మమని చెప్పింది ఎవరు?

నమ్మి ఇప్పుడు మోసపోయారు. ఒక్క విద్యుత్ చార్జీ వ్యధలే కాకుండా, ప్రతి ఏటా 15% ఆస్తిపన్ను భారాన్ని ప్రజలపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోపింది. ఈ ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే, ప్రస్తుతం 10,000 ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు, 15 ఏళ్ల తర్వాత లక్ష రూపాయలకు పైచిలుకు ఆస్తి పన్నును చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలుఆస్తి పన్ను చెల్లించలేక, ఇండ్లను విడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఖాళీ స్థలాల పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. నవరత్నాల పేరిట నవ అబద్ధాలను చక్కగా మా పార్టీ నాయకత్వం చెబితే ప్రజలు నమ్మి మోసపోయారన్నారు.

ప్రజలు భయముతో ఉన్నారు… ప్రశ్నించే వారిపై ప్రభుత్వ దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి
రాష్ట్రంలో ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వ ధమనకాండను ప్రశ్నించిన వారిపై దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొండపి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ అనుచరుడి భార్యను మా పార్టీ నాయకులు ట్రాక్టర్ పండ్లతో దారుణంగా హత్య చేశారు. దళిత మహిళా హత్యపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం దారుణం. జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఎర్నలిస్టులు తనపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ, లబ్ది పొందుతున్నారు. కనీసం తాము జర్నలిస్టులమనే సృహ ఉంటే, దళిత మహిళ దారుణ హత్యకాండ గురించి మాట్లాడాలి. ఒక కాకి చనిపోతే 100 కాకుల సమూహం మద్దతుగా నిలబడుతోంది. కానీ రాష్ట్రంలో దళిత మహిళను దారుణంగా హత్య చేసినప్పటికీ, స్పందించే వారే లేకపోవడం శోచనీయమని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టులో సునీత గెలిచినా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తుందనే నమ్మకం లేదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ వైఎస్ సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డి సహకారంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వైఎస్ సునీత విజయం సాధించినా, వైయస్ అవినాష్ రెడ్డి ని సిబిఐ అరెస్టు చేస్తుందనే గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేని అరెస్టుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయించడం అవసరమా?

అనే నిస్సృహ సునీత దంపతులకు రావచ్చు. ఒకవేళ వారు అలా అనుకున్నా తప్పులేదు. అయితే అన్యాయంపై తుది వరకు పోరాడాలి. నేను అయినా, డాక్టర్ సునీత అయిన తుది వరకు, న్యాయం జరిగే వరకు పోరాటం చేయాల్సిందే. డాక్టర్ వైఎస్ సునీత పోరాటం వల్లే వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వచ్చాయి. విస్తృత కుట్ర కోణం తెరపైకి వచ్చింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతున్న డాక్టర్ సునీత, తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి ఛానల్, దినపత్రిక తో పాటు, నీలి మీడియా ఛానళ్లకు చెక్కుచెదరని ధైర్యంతో ఎదుర్కొంటున్నారు.

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించిన వెంటనే ఆయన తండ్రి, ఈ కేసులో సహ నిందితుడైన వైయస్ భాస్కర్ రెడ్డి సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన వెంటనే ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే తరహాలో ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసును స్వీకరించారు.

అవినాష్ రెడ్డి ఉదాంతం కూడా ఆయన దృష్టికి వెళ్తే సుమోటోగా కేసును స్వీకరించే అవకాశాలు లేకపోలేదు. అవినాష్ రెడ్డి సహా నిందితుడైన వైయస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ కోర్టులో బెయిల్ లభించకపోవచ్చు. కానీ ఆయన సిబిఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తే, నా అంచనా ప్రకారం బెయిలు లభిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని మరొక నిందితుడైన గజ్జల ఉదయ భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. సుప్రీం కోర్టులో వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్ లో సిబిఐ ఇంప్లిడ్ అవుతుందా?, లేదా?? అన్నది కాలమే సమాధానం చెబుతుందన్నారు.

రెడ్డి భవనాన్ని నిర్మించలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
పదిమందికి వెన్ను దన్నుగా నిలిచే రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందని ఆ సామాజిక వర్గ నేతలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఇతరుల కష్టాలను తీర్చే రెడ్డి సామాజిక వర్గానికి, మా ప్రభుత్వం వల్ల కష్టం వచ్చిందని చెబితే, వారికి అండగా ఉంటామని ధైర్యాన్ని భరోసాను ఇచ్చిన నారా లోకేష్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

శభాష్… నారా లోకేష్, ఇది మామూలు విషయం కాదు. కడప జిల్లా బాగోగులు చూసే రెడ్డి సామాజిక వర్గాన్ని , మా ప్రభుత్వం వల్ల కష్టపడుతుంటే అండగా ఉంటామని హామీ ఇచ్చిన లోకేష్ తెగువను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్న, చేతలు గడప దాటడం లేదు. జిల్లాలో రెడ్డి భవనం నిర్మిస్తామని చెప్పి హడావిడి చేశారే తప్పితే, నిర్మించింది లేదని జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గ నేతలు విమర్శలు గుప్పించారని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.

విచారణ సహకరించారని సిఐడి అధికారి చెబుతుంటే… సహకరించలేదని సాక్షిలో తప్పుడు కథనాలా?
మార్గదర్శి పై విచారణ చేస్తున్నది సిఐడి పోలీసులా?, సాక్షి మీడియానా?? అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, విచారణకు పూర్తిగా మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ సహకరించారని సిఐడి అధికారి చెబితే, విచారణకు సహకరించలేదని సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మార్గదర్శి సంస్థను ఒక మహిళ పారిశ్రామికవేత్తగా శైలజా కిరణ్ నిర్వహిస్తున్నారు. అటువంటి శైలజాకిరణ్ అవమానించే విధంగా వ్యవహరిస్తున్న తీరుపట్ల యావత్ మహిళా సమాజం తిరుగుబాటు చేయాలి. శైలజా కిరణ్ విదేశీ పర్యటనకు వెళ్లారని తెలుసుకొని సిఐడి పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు.

లుకౌట్ నోటీసుల ఆధారంగా విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేయాలన్న సిఐడి పోలీసుల పథకము బెడిసి కొట్టింది. శైలజా కిరణ్ ను ఏక వచనంతో సాక్షి మీడియా సంబోధించడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను భారతమ్మ, విజయమ్మ అని సంబోధిస్తూ… శైలజ కిరణ్ ను మాత్రం ఏక వచనంతో సంబోధించడం వారి కుసంస్కారానికి నిదర్శనం. సిఐడి విచారణలో భాగంగా తనకు కళ్ళు తిరుగు ఉన్నాయని, జ్వరం వచ్చిందని శైలజా కిరణ్ కుంటి సాకులు చెప్పారని సాక్షి దినపత్రికలో రాశారు.

సిఐడి పోలీసులు ఏమైనా మీకు చెప్పారా.. రా మూర్ఖులారా?, ఇలా ఎలా రాస్తారని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక పై పరువు నష్టం దావా కేసులు శైలజాకిరణ్ వేయాలి. ఇది ముమ్మాటికి జర్నలిజం నైతిక విలువలకు వ్యతిరేకం. మార్గదర్శికి వ్యతిరేకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేదు. భవిష్యత్తులో ఏదో ఉపద్రవం ముంచుకు వస్తుందనే సాకుతో మార్గదర్శి డబ్బులను ఫ్రీజ్ చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదం. ఖాతాదారులకు చెల్లింపులను ఆలస్యం చేయని సంస్థ మా వారి కంట్లో పడి వేధింపులకు గురి అవుతోంది .

ఒక మహిళా పారిశ్రామికవేత్తను మా ప్రభుత్వం వేధిస్తున్నట్లుగానే, రేపు ప్రభుత్వం మారిన తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబంలోని పారిశ్రామికవేతను ఒకవేళ వేధిస్తే ఎలా ఉంటుంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటు. మార్గదర్శిపై ఏదైనా ఫిర్యాదు కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు తప్పుడు పేర్లతో చీటీ వేసి, మార్గదర్శి సంస్థ వారు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా, డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయడం మినహా మరొక మార్గం లేదు.

చీటీ నిర్వహణలో మార్గదర్శి సంస్థకు ఐదు శాతం కమిషన్ లభిస్తుంది. ఆ కమిషన్ మొత్తాన్ని కొంత పెట్టుబడులు పెట్టినప్పటికీ, మరికొంత మొత్తాన్ని మార్గదర్శిలో నిల్వ గా ఉంచారు. ఆ సొమ్మునే ఫ్రీజ్ చేసి, ప్రజల సొమ్మును కాపాడామని చెప్పడం విడ్డూరం . మార్గదర్శి సంస్థ పై సిఐడి ద్వారా దాడులు చేయించినప్పటికీ, ఖాతాదారుల చెక్కుచెదరని విశ్వాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం కదిలించలేకపోయింది. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు మంచిదే కానీ, రామోజీరావుకు న్యాయం చేస్తే మాత్రం మంచిది కాదన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం తగదు.

తెలంగాణ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తుందా?, అవమానిస్తుందా అని ప్రశ్నించారు. ఒక వైవు దళిత మహిళను హత్య చేసి, మరొక మహిళా పారిశ్రామికవేత్తను అవమానించి, మహిళల ఓట్లే తమకు అవసరం లేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన పాత కక్షలను తీర్చుకోవడానికి పార్టీ పరువు బజారుకీడిస్తున్నారు. పార్టీలో ఉన్న ఎంతోమంది నాలాంటి నాయకులు గురించి కూడా ఆలోచించాలి. పార్టీ ప్రతిష్టను దిగజార్చడం కరెక్టు కాదు. అసైన్డ్ రైతులకు శుభవార్త అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రైతుల కంటే ఎక్కువగా ఆ భూములను బలవంతంగా లాక్కున్న మా పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకే అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ను తెరపైకి తీసుకువచ్చారు .

విశాఖపట్నంలో అసైన్డ్ భూములను మా పార్టీ నాయకులే రైతుల వద్ద నుంచి లాగేశారు. రెండు మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా భూములను కేవలం 20 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చి బలవంతంగా గుంజుకున్నారు. ఇప్పుడు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ వల్ల మా పార్టీ నాయకులకి లబ్ధి చేకూరుతుంది. నూటికి 90 శాతం భూములను మా పార్టీ నాయకులు లాగేసుకుంటే, విలువ లేని చోట కేవలం 10 శాతం భూములు మాత్రమే నిజమైన రైతుల చేతిలో ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికి నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నట్లుగా అభినయించారు. కానీ 2025 జూన్ నాటికి మాత్రమే పోలవరం పనులు పూర్తి అవుతాయని అధికారులు తేల్చి చెప్పినట్లుగా వారితో కూడా డ్రామా ఆడించారు. బండ్ కొద్దిగా పగుళ్లు వస్తే, ఏదో ప్రళయం వచ్చినట్లుగా వార్తలు రాస్తారా? అని ఈ సందర్భంగా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, పోలవరం కొండపై సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణానికి కృష్ణారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు క్యూ లు కడుతున్నారని మంత్రి రోజా చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలు సేద తీరడానికి మెగా కృష్ణారెడ్డికి వీలైన చోటల్లా ప్రభుత్వ స్థలాలు ఇస్తే ఆయన సెవెన్ స్టార్ హోటళ్లను నిర్మిస్తారని రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE