– మోదీ, నద్దాకు ఎంపిక బాధ్యత అప్పగించిన కూటమి
– అబ్దుల్ కలామ్ నియామకంతో పెరిగిన కూటమి ప్రతిష్ఠ
– మైనారిటీలలో బీజేపీపై తగ్గిన వ్యతిరేకత
– ఆ తర్వాత త్రిబుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో సానుకూలత
– నాడు మోదీ ఫొటోలతో ముస్లిం విద్యార్ధినుల మద్దతు ప్రదర్శనలు
– ఇప్పుడు గవర్నర్ నజీర్‌కు ఉప రాష్ట్రపతితో మరోసారి మైనారిటీల మనసుగెలిచే యత్నం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఉప రాష్ట్రపతి పదవికి న్యాయకోవిదుడు, ఏపీ గవ ర్నర్ అబ్దుల్ నజీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వివాద రహితుడు, ఉన్నత విద్యావంతుడైన నజీర్‌ను ఉప రాష్ర్టపతి పదవికి ఎంపిక చేయడం ద్వారా, మరోసారి మైనారిటీల మనసు గెలవాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా.. ఎన్డీఏ కూటమి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేసే బాధ్యతను ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాకు అప్పగిస్తూ ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ, కూటమి తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నయినా బలపరుస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వివరాలను మీడియాకు వెల్లడించారు. “రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే బాధ్యతను ప్రధాని మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. వారు తీసుకునే నిర్ణయానికి ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలన్నీ కట్టుబడి ఉంటాయి,” అని ఆయన స్పష్టం చేశారు. దీనితో ఇక అభ్యర్ధి పేరు ప్రకటించడమే తరువాయి.
గతంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, మైనారిటీకి చెందిన శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతిగా ఎంపిక చేసింది. చంద్రబాబు ఆయన పేరు పట్టుపట్టి సూచించడమే కాకుండా, అబ్దుల్ కలామ్తో మాట్లాడి ఒప్పించారు. దానితో దేశంలోని మైనారిటీలు కూటమి వైపు, పూర్తి స్థాయి సానుకూలత ప్రదర్శించారు. ప్రధానంగా మైనారిటీల్లోని విద్యావంతులు, తటస్థులు బీజేపీవైపు మొగ్గుచూపారు.
నిజానికి అప్పటివరకూ బీజేపీని ముస్లింలు మతపరంగా తీవ్రంగా వ్యతిరేకించేవారు. అబ్దుల్ కలామ్ నియమాకంతో ఆ వ్యతిరేకత స్థానంలో సానుకూలత ఏర్పడింది. అది ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన విషయం తెలిసిందే.
మళ్లీ చాలాకాలం తర్వాత ముస్లిం మహిళల జీవితాలను అంధకారమయం చేసిన త్రిబుల్ తలాక్‌ను రద్దు చేయడంతో, ముస్లిం మహిళల్లో బీజేపీపై పూర్తి సానుకూలత ఏర్పడింది. అది గత ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపింది.హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ముస్లిం మహిళలు తాము బీజేపీకి ఓటు వేశామని బహిరంగంగానే చెప్పడం తెలిసిందే. ఆ సందర్భంలో ముస్లిం మహిళలు, ప్రధానంగా ముస్లిం విద్యార్ధినులు మోదీ ఫొటోలు ప్రదర్శించి మరీ తమ కృతజ్ఞత ప్రకటించడం విశేషం. అప్పటినుంచీ త్రిబుల్ తలాక్ రద్దుతో, తమ జీలితాల్లో వెలుగు నింపిన బీజేపీ పట్ల.. ముస్లిం మహిళలు ఇప్పటికీ పూర్తి స్థాయి విశ్వాసం, కృత జ్ఞత కనిపిస్తోంది.
ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యూహమే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను, ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో మైనారిటీలు మరోసారి బీజేపీ వైపు మొగ్గు చూపుతారన్న అంచనా వ్యక్తమవుతోంది.