హైదరాబాద్: 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025 మంగళవారం హైదరాబాద్ లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జైళ్ళు మరియు శిక్షణా సేవల విభాగం, కేంద్ర హోంశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మొదటిసారిగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్పో మరియు జైలు ఉత్పత్తుల స్టాళ్లను, డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సవరణాత్మక సంస్కరణలు ప్రశంసనీయమైనవి.
2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ప్రవర్తన కనబరిచిన 231 మంది ఖైదీలను ముందుగానే విడుదల చేయడం జరిగింది. వీరిలో జీవిత ఖైదీలు, ఇతర ఖైదీలు ఉన్నారు. ఇది కేవలం శిక్ష మన్నించడమే కాక, వారికి కొత్త జీవితం ఇచ్చే ఆశాకిరణం.
విడుదలైన ఖైదీల పునరావాసం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంధన స్టేషన్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళలకు కుట్టుమిషన్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు వారిని తిరిగి సమాజంలో స్థిరపడేలా సాయం చేశాయి. క్షమాభిక్షతో పాటు పునరావాసాన్ని కలిపిన ఈ విధానం నిజమైన సంస్కరణకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం 21 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1222 మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొనడం విశేషం. మొత్తం 36 విభాగాలలో ప్రొఫెషనల్, క్రీడా మరియు సాంస్కృతిక పోటీలు జరుగుతున్నాయి.
టెక్నాలజీ ఎక్స్‌పోలో ఆధునిక జైలు సాంకేతిక పరిజ్ఞానాలు ప్రదర్శించబడుతున్నాయి. అలాగే ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ రావు, , స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హోం) రవి గుప్తా, , తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్, , ఇంటెలిజెన్స్ డీజీ బి. శివధర్ రెడ్డిస్, బిపిఆర్అండ్డీ అదనపు డీజీపీ రవి జోసెఫ్ లోక్కు, , ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్, ఐపీఎస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ మీట్ సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుంది. ప్రొఫెషనల్ పోటీలు, బహిరంగ క్రీడలు, ఫైన్ ఆర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో జైలు శాఖ సిబ్బంది మధ్య క్రమశిక్షణ, ఐక్యత, స్నేహభావానికి ఇది వేదిక కానుందని తెలంగాణ రాష్ట్ర ప్రిజన్స్ అండ్ సి.ఎస్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు.