Suryaa.co.in

Political News

అగ్నిపథ్ పై ముందస్తు అవగాహన ఏదీ…!?

ఏదైనా ఒక కొత్త పథకం, ఆలోచన -ప్రభుత్వ స్థాయిలో అమలు దశకు రావడానికి ముందు – ఆ ప్రతిపాదనను సంబంధిత ఉన్నతాధికారులు, నిపుణులు నెలల పాటు వివిధ దశలలో…. వివిధ స్థాయిలలో చర్చిస్తారు. లాభ నష్టాలను అధ్యయనం చేస్తారు. బాగుంది అనుకుంటే – చివరికి, ప్రభుత్వ సమక్షానికి ఆ ప్రతిపాదన చేరుతుంది. కేంద్రం లో అయినా…. రాష్ట్రాలలో అయినా…. సహజంగా ఇలాగే చేస్తారు. అది ఎంత మంచి ప్రతిపాదన అయినప్పటికీ ; సంబంధిత వర్గాల వారి(స్టేక్ హోల్డర్స్ ) ని విశ్వాసం లోకి తీసుకుని – వారికి అవగాహన కల్పించి,అవసరమైతే వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి, దానిని అమలు చేస్తే – ప్రభుత్వానికి నేతృత్వం వహించే వారు ఆశించిన మైలేజ్, వారు ఆశించిన దానికంటే ఎక్కువ వస్తుంది. సమాజానికి మంచి జరుగుతుంది. అనవసరమైన అపార్ధాలకు అవకాశం లేకుండా ఉంటుంది. ఆ పథకం ప్రయోజనం నెరవేరుతుంది.

ఇప్పుడు రైల్వే, ఇతర ప్రభుత్వ ఆస్తులను అగ్నికి ఆహుతి చేస్తున్న ‘అగ్ని పథ్ ‘ ఆలోచనను ముందుగా దేశ ప్రజలతో కేంద్రం పంచుకుని, దాని లాభ నష్టాలపై సంబంధిత నిరుద్యోగ వర్గాల అనుమానాలను, అపోహలను తొలగించడానికి ఒక గట్టి ప్రయత్నం చేసి ఉన్నట్టయితే ; ఈ రోజున ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు బుగ్గిపాలు కాకుండా ఉండేవి. సికింద్రాబాద్ లో ఓ యువకుడు అసువులు బాయాల్సివచ్చేది కాదు. వేలాదిగా రైల్వే ప్రయాణికులు పిల్లా పాపల్తో అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది కాదు.
మరి ఎందుకని దేశ ప్రజలను ప్రభుత్వం విశ్వాసం లోకి తీసుకోదలుచుకోలేదు? ‘చిత్తం అగ్నిపధ్ పథకం మీద …. భక్తి పొలిటికల్ మైలేజ్ మీద’ ఉండడం వల్ల , దీనికి ప్రజలలో రావలసినంత పాజిటివ్ పెర్సెప్షన్ రాలేదు .

దేశ సైనిక దళాల చరిత్ర లో కీలక మలుపు కు శ్రీకారం చుట్టగల ఇంత పెద్ద సంస్కరణ ను చేపట్ట దలచినప్పుడు, పార్లమెంట్ లో ప్రజలకు ప్రతినిధ్యం వహిస్తున్న బీజేపీయేతర రాజకీయ పక్షాలను ప్రభుత్వం విశ్వాసం లోకి తీసుకుని ఉన్నట్టయితే , ప్రభుత్వ నిర్వాహకుల పట్ల దేశం లో ఎంతటి సద్భావన కలిగి ఉండేది ? ఈ పథకం అమలు లో ఎన్ని విలువైన సూచనలు ప్రభుత్వానికి లభించి ఉండేవి? దేశంలో ఏ కొత్త పధకమైనా సరే… ప్రధాని మోదీ ఖాతాలో పడాలి. ఆ ఆలోచన ఆయనకే వచ్చినట్టు ప్రచారం జరగాలి. ఇందులో ఎవరికీ భాగస్వామ్యం ఉండకూడదు. ఆ విధంగా, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్, ఈ పధకాన్ని ప్రకటించేటప్పుడు, “ఇది ప్రధాని మనసులో మెదిలిన ఆలోచన’ అని ప్రకటించారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వికటించేసరికి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – మొన్న శుక్రవారం ఢిల్లీ లో మీడియా తో మాట్టాడుతూ,” దీనిపై మోదీ అధికారం లోకి రాకముందు నుంచీ చర్చలు జరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఈ పధ్ధతి అమలులో ఉంది. ఇదేమీ కొత్త ఆలోచన కాదు. నిరుద్యోగులు అపార్ధం చేసుకున్నారు.. ” అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ నిరసనలు చోటుచేసుకోకుండా ఉన్నట్టయితే, క్రెడిట్ వెళ్లి మోదీ ఖాతాలో పడిపోయి ఉండేది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కి ఓ మంచి ప్రచారాస్త్రంగా ఉపయోగపడి ఉండేది. నిజానికి అగ్నిపథ్ అనేది ఓ గొప్ప పథకం. సైనిక దళాలలో విప్లవాత్మక ఆధునీకరణకు శ్రీకారం చుట్టే సంస్కరణ. సైన్యం లో సిపాయిలుగా చేరదలుచుకుని , అనంతరం జీవితం లో స్థిరపడ దలుచుకున్న 23 ఏళ్ళ లోపు (వచ్చే ఏడాది నుంచి 17.6-21 ఏళ్ళ మధ్య గల )యువత కు ఓ గొప్ప సదవకాశం కల్పించే ఈ పథకం పై ముందుగా తగిన ప్రచారం,అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ శాఖ చేపట్టి ఉంటే ; ఇప్పటి విధ్వంసకాండ కు అవకాశం ఉండేది కాదు.

దేశ సైనిక దళాలను ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించే ఈ పథకం అటు రక్షణ దళాలకు, ఇటు ఔత్సాహిక యువత కూ గొప్ప ప్రయోజనకరం అనడం లో సందేహం లేదు. ఈ పథకం కింద ఎంపికయిన వారు, నాలుగేళ్ల తరువాత బయటకు వచ్చేయాలి అనుకుంటే రావచ్చు. అప్పటికి వారి వయస్సు 25/27సంవత్సరాలే ఉంటుంది. ఈ అనుభవం తో వారు రక్షణ శాఖ ఆధ్వర్యం లోని బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, సీఐఎస్ఎఫ్ వంటి దాదాపు 16 భద్రతా దళాల్లో ఎంపిక కావడానికి అవసరమైన మైండ్ సెట్, క్రమశిక్షణ, శారీరక ధారుడ్యం కలిగి ఉంటారు. వీటిల్లోప్రవేశానికి అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్ కూడా కల్పించారు. ఇవన్నీ , పథకాన్ని ప్రకటించే సమయం లోనే ప్రకటించి ఉంటే – అపార్ధాలకు అవకాశాలు బాగా సన్నగిల్లి ఉండేవి కదా ! ఇప్పుడు రైలు బోగీలు , స్టేషన్ లు తగలబడి పోయాక , కేంద్రం బావి తవ్వుతున్నట్టు ఉంది . రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెన్ పెర్సెంట్ …టెన్ పెర్సెంట్ రిజర్వేషన్లు అంటూ ఒకదాని వెనుక ప్రకటనలు గుప్పిస్తున్నాయి . ఈ పథకాన్ని ప్రకటించే సమయం లో ఈ ఆలోచనలు ఎక్కడికి వెళ్లాయి ? అంటే – ఈ పథకం లాభ నష్టాల పై రాజకీయ స్థాయిలో చర్చ జరగలేదన్న మాట . ఇప్పటికయినా మరిన్ని వివరాలతో త్రివిధ సైనిక దళాల అధిపతులు ప్రజల ముందుకు వచ్చారు. ప్రభుత్వ సర్వీస్ వద్దు అనుకునే అగ్నివీర్ లు – నాలుగేళ్ల సర్వీస్ తరువాత లభించే దాదాపు 12 లక్షల రూపాయల సొమ్ము తో వారు బయటకు వస్తారు కనుక – తగిన వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. బ్యాంకు లు ప్రాధాన్యతా క్రమం లో రుణాలు మంజూరు చేస్తాయి. కావాలి అనుకుంటే, వివాహం చేసుకుని జీవితం లో స్థిరపడవచ్చు. సైన్యం లో పని చేసే సమయం లో ఏదైనా దుస్సంఘటన జరిగితే ; దాదాపు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కు కూడా వారి కుటుంబం అర్హులు అవుతారు. బీమా ప్రీమియం కూడా వారు చెల్లించనవసరం లేదు.

సైన్యం లో సిపాయిలు గా నేరుగా చేరినప్పటికీ ; కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పని చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే – 35 సంవత్సరాలు వచ్చేసరికి బయటకు వచ్చేయాల్సిందే.బయటకు వచ్చి, నిరుద్యోగి అవతారం ఎత్తాల్సిందే. అలాగే, వైద్య సదుపాయాలు గానీ, మిలిటరీ కాంటీన్స్ లో సభ్యత్వం గానీ – రెగ్యులర్ సిపాయిలకు లాగానే, అగ్నిపథ్ సభ్యులకూ ఉంటుంది.ఈ ప్రయోజనాలను సైన్యం లో సిపాయిలుగా చేరాలనే ఔత్సాహికులకు ముందుగా అవగాహన కల్పించి ఉన్నట్టయితే, నిజంగానే ఈ పథకం క్రెడిట్ ప్రధాని మోదీ ఖాతాలో పడి ఉండేది. దేశ ప్రజలను గానీ, రాజకీయ పార్టీలను గానీ, ఔత్సాహిక యువతను గానీ విశ్వాసం లోకి తీసుకోకుండా – ఈ పథకాన్ని హటాత్తుగా ప్రకటించడం తో – సైన్యం లో చేరదలిచిన వారిలో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తాయి. వారి ఆగ్రహా వేశాలకు అవసరమైన పెట్రోలు, అగ్గిపెట్టె వగైరా లను అసాంఘిక శక్తులు అందించాయి. రాజకీయ నాయకులు కూడా తమ వంతు విమర్శల సాయం చేశారు. ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గనుక, కాంగ్రెస్ తో పాటు టీ ఆర్ ఎస్ వారు కూడా తమ వంతు విమర్శలు చేశారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా ప్రతిపక్షాలు విమర్శించడం అనేది మనదేశం లో ఓ రూలు. రివాజు . ఆ నిర్ణయం మంచి చెడ్డలతో పనిలేదు .

వీటన్నిటి ఫలితంగా , కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు కళ్ళ ముందే కాలి బూడిద అయ్యాయి. వేలాది రైల్వే ప్రయాణికులు – ముఖ్యం గా వృద్దులు, మహిళలు, పిల్లలు నరక యాతనలు అనుభవించారు. దీనికి బాధ్యులు ఎవరని అనుకోవాలి? ప్రయాణికులు అనుభవించిన నరక యాతన పట్ల ఏ రాజకీయ పార్టీ గానీ, నాయకుడు గానీ విచారం వ్యక్తం చేయలేదు. ప్రజలలో ఏ చిన్న అంశం మీద అసహనం చెలరేగినా… ఇక,ఇటువంటి పరిస్థితులకు ఆజ్యం పోసే అసాంఘిక శక్తులు- పెట్రోలు, అగ్గిపెట్టెలతో సిద్ధంగా ఉంటాయనే విషయాన్ని చెప్పడానికి -ఇదీ, మొన్న కోనసీమలో జరిగిన దహనాలూ నిదర్శనం. అసలే కోతి… ఆ పైన చీప్ లిక్కర్ తాగింది అన్నట్టుగా…. అసలే అసాంఘిక ప్రేరేపిత విధ్వంస కాండ….;పై పెచ్చు … న్యూస్ ఛానళ్ళు తోడు. ఆ సంఘటనలను గంటల తరబడి లైవ్ లో చూపించడం, ఆ సంఘటనలను చిలవలు, పలవులు గా వర్ణిస్తూ …వర్ణిస్తూ పోటీలు పడుతూ ప్రసారాలు చేయడం తో… ఒక రైల్ బోగీ తగలేస్తే – వంద బోగీలు తగలేస్తున్న ఎఫెక్ట్ వస్తున్నది. దానితో, ఆందోళనలు చేసేవారు మరింతగా రెచ్చిపోతున్నారు.

భారత రక్షణ దళాల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్న ఈ అగ్నిపథ్ పథకం ప్రయోజనాలపై దేశ నిరుద్యోగ లోకం లో విస్తృత అవగాహన, ప్రచారం కల్పించడానికి భారీ అవగాహనా కార్యక్రమం చేపట్టడానికి బీజేపీ ఇప్పుడు సిద్ధమవుతున్నది.ఈ అవగాహనా ప్రచారం అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. బీజేపీ కి ఏమి సంబంధం? అంటే – ఈ అద్భుత పథకం నుంచి వీలైనంత మైలేజ్ ని పిండుకుందామనే దూ(దు)రాలోచన.

నిజానికి, భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన అప్పటి ప్రధాని పీ వీ నరసింహారావు ను దేశం గుర్తు పెట్టుకున్నట్టుగానే, దేశ రక్షణ దళాల వ్యవస్థలో అగ్నిపథ్ ద్వారా;విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సైతం దేశం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. అయితే, చేయవలసిన సంస్కరణలను పధ్ధతిగా చేయాలి. ‘చిత్తం శివుడి మీద… భక్తి చెప్పుల మీద’ అన్నట్టు గా చేస్తేనే… ఇటువంటి తలనొప్పులు.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE