• రాజశేఖర్ రెడ్డి విగ్రహాల ఏర్పాటుకి లేని ట్రాఫిక్ సమస్యలు ఇతర మహానుభావుల విగ్రహాలకే ఎందుకొస్తాయి?
• ఈప్రభుత్వం ఇష్టానుసారంగా ఏర్పాటుచేస్తున్న విగ్రహాలన్నింటినీ, టీడీపీ అధికారంలోకి రాగానే తొలగిస్తాం.
• టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ
సంగీతాభిమానులు, కళాకారుల హృదయాల్ని గాయపరిచేలా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కళాకారులు, కవులు, రచయితలు, మహానుభావులంటే ఈప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎందుకింత చులకనభావమని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు.
“గుంటూరు మథర్ థెరిస్సా సెంటర్ లోని గానగంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అనుమతి లేదంటూ ఈప్రభుత్వం విచక్షణారహితంగా తొలగించింది. బాలు విగ్రహాన్ని తొలగించి, మరుగుదొడ్డివద్ద పెట్టడం ఆ మహానీయుడిని ఘోరంగా అవమానించడం కాదా? బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తి తెలుగుచిత్రపరిశ్రమకు చేసిన సేవలకు సంతసించి, ఆయన్ని అమితంగా గౌరవించాల్సిందిపోయి, విగ్రహాలు తొలగించి, ఇలాఅవమానిస్తారా? వాస్తవానికి బాలు విగ్రహ ఏర్పాటుసమయంలో సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గొప్పవ్యక్తికి సముచిత గౌరవం లభించిందని అందరూ భావించారు. కానీ ఈప్రభుత్వం ఎస్పీ బాలు విగ్రహం తొలగింపుతో మహానీయుడిని ఘోరంగా అవమానించి, సంగీతాభిమానులు, కళాకారుల హృదయాల్ని కలచివేసింది.
అదేవిధంగా బడుగు వర్గాలకోసం పాటుపడిన బీ.పీ.మండల్ విగ్రహాన్నికూడా గతంలో ఈప్రభుత్వం అలానే తొలగించింది. బీసీ రిజర్వేషన్లసాధకుడైన బీ.పీ.మండల్ చేసిన సేవలు గుర్తించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? జగన్ ప్రభుత్వానికి మహానీయులు, వారిత్యాగాలు, సేవలంటే ఎందుకంత చులకన? ఈ ప్రభుత్వానికి కూల్చడం, విధ్వంసంచేయడంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి నిర్మించడం, కట్టడం, ఏర్పాటుచేయడంలాంటి అంశాలపై లేదు. తొలగించడం, కూల్చడం, విధ్వంసంచేయడం జగన్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యలు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసం బాలసుబ్రహ్మణ్యం, బీ.పీ.మండల్ విగ్రహాల తొలగింపు వరకు కొనసాగింది. అనేకపథకాలను రద్దుచేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, విజయవాడ ఆరోగ్యవిశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్ పేరు రద్దుచేసేవరకు నిదరపోలేదు.
రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు లేని అనుమతులు ఇతర మహానీయుల విగ్రహాలకే ఎందుకు ?
రాష్ట్రవ్యాప్తంగా వేలకొలదీ ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు అన్నీ అనుమతులున్నాయా?
బీ.పీ.మండల్, బాలసుబ్రహ్మణ్యం వంటివారి విగ్రహాల ఏర్పాటుకు అనుమతిలేని విషయం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి తెలిసిందా? టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విగ్రహాలను, అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగిస్తుంది. పోలీసులు విగ్రహాల తొలగింపుకు ట్రాఫిక్ కారణాలు చెప్పడం సిగ్గుచేటు. ట్రాఫిక్ సమస్యలు ఇతర నేతల విగ్రహాలఏర్పాటుతో రావడంలేదా? గాయకుడిగానే కాకుండా, నటుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బాలసుబ్రహ్మణ్యం వంటి వ్యక్తిని అవమానించడం తగదని ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహతొలగింపు వివాదంపై ప్రభుత్వపెద్దలనుంచి సానుకూల ప్రకటన రాకపోవడం తీవ్రవిచారకరం. దేవుడి విగ్రహాల విషయంలో కూడా ఈప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోంది. గుంటూరులో వినాయకుడి విగ్రహాలను కూడా అనుమతుల లేవంటూ చెత్తకుప్పల్లో పడేసిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే. రామతీర్థంలో రాములవారి విగ్రహం తలనరికిన వారిపై ఏంచర్యలు తీసుకున్నారో చెప్పగలరా?
జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగం దారుణాలకు పరాకాష్టగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జకీర్ అనే మైనారిటీ యువకుడు చనిపోతే, అతని మృతదేహాన్ని కాలితో తొక్కుతూ డీఎస్పీ చైతన్య కర్కశంగా వ్యవహరించడం రాక్షసత్వంకాదా? ఈచర్యతో జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలపై ఉన్న గౌరవం ఏపాటిదోరుజువైంది. జగన్మోహన్ రెడ్డి తన పాలనావైఫల్యాలను కప్పిపుచ్చు కోవడానికే ఇలాంటి చిల్లరపనులు చేస్తున్నాడేమో అనిపిస్తోంది. రాష్ట్రాన్నిఅభివృద్ధిచేయడం, ఉపాధి, ఉద్యోగాలకల్పన, రైతులు, మహిళలకు అవసరమైన సంక్షేమం అమలుచేయడం చేతగాకనే ప్రభుత్వపెద్దలు విగ్రహాలతో రాజకీయంచేస్తున్నారా అన్న సందేహం ప్రజలకు కలుగుతోంది.”