గోదావరి నదిపై ఏపీలో నిర్మించిన దవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా ఈ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఓ కీలక ప్రకటన వెలువడింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటిపారుదల రంగాలపై ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ఆధ్వర్యంలో ఆడిలైడ్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.
సదస్సుకు ఏపీ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు హాజరయ్యారు. సదస్సులో భాగంగా గురువారం దవళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచవారసత్వ నీటిపారుదల కట్టడంగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు దవళేశ్వరం ప్రాజెక్టుకు దక్కిన అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అంబటి, కాకాణి అందుకున్నారు.