-పెరిగిన సిమెంట్ ధరలతో సామాన్యులపై పెనుభారం
-జగన్ రెడ్డి పాలనలో ప్రజలపై భారాలు తప్ప.. అభివృద్ధి శూన్యం
– నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
భారతి సిమెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఓ వైపు సాక్షికి ప్రకటనలు, మరోవైపు భారతి సిమెంట్ కు సప్లై కాంట్రాక్టులు ఇవ్వడమే మూడేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ప్రగతి. రాష్ట్రంలో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరల భారంతో సామాన్యులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇసుక మాఫియాతో నిర్మాణరంగం కుదేలైంది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. తాజాగా సిమెంట్ ధర రూ.60 వరకు పెరగడంతో నిర్మాణరంగంపై పెనుభారం పడుతోంది. భారతి సిమెంట్స్ కు దోచిపెట్టేందుకు కంపెనీలను సిండికేట్ గా మార్చారు. ఇష్టానుసారంగా సిమెంట్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వ పనుల కోసం సిమెంట్ కొనుగోలు ఆర్డర్ లలో ఎక్కువ భాగం భారతి సిమెంట్స్ కు కట్టబెట్టడం అధికార దుర్వినియోగం కాదా? క్విడ్ ప్రో కో విధానంలో దోచుకున్న డబ్బులతో భారతి సిమెంట్స్ ను నెలకొల్పిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసార ధరల పెంపుతో ప్రజలను దోచుకుంటున్నారు. చంద్రబాబు గారి పాలనలో సిమెంట్ ధరలు పెరిగితే.. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి సిమెంట్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడం జరిగింది. భారతి, ఇతర సిమెంట్ కంపెనీల ధరలను తగ్గించేందుకు జగన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
టీడీపీ హయాంలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక నేడు రూ.5వేలకు పెంచారు. రాష్ట్రంలో ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ.. పెద్ద ఎత్తున లూటీకి పాల్పడుతున్నారు. ఇసుకలో రూ.10వేల కోట్ల దోపిడీకి తెరలేపారు. ధరలు పెంచి నాసిరకం మద్యం విక్రయిస్తూ.. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసరాలు పెరిగి సామాన్యులు సతమతం అవుతున్నా జగన్ రెడ్డికి పట్టడం లేదు. విద్యుత్ ఛార్జీలను 6 సార్లు పెంచి జనం జేబులు గుల్లచేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రూ.2వేల కోట్ల భారం మోపారు. రిజిస్ట్రేషన్ ధరలు, స్టాంప్ డ్యూటీ, వృత్తి పన్నులు పెంచారు.
తమ లూటీ, దుబారా కోసం అన్నింటి ధరలు పెంచుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజలపై భారాలు తప్ప అభివృద్ధి శూన్యం. రాష్ట్ర ప్రజానీకంపై ఇప్పటికే మోయలేని పన్నుల భారాన్ని మోపారు. తక్షణమే పెరిగిన సిమెంట్ ధరల విషయంలో నియంత్రణ చర్యలు చేపట్టాలి. సామాన్యులకు అందుబాటులో సిమెంట్ ధరలు ఉండేలా చూడాలి.