Suryaa.co.in

Andhra Pradesh

విద్యా వ్యవస్థను విధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది

రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ, ఉఫాధ్యాయులపై పగబట్టినట్లుంది. ప్రభుత్వానికి విలీనం పట్ల పిచ్చి పట్టినట్లుంది. ఎయిడెడ్ వ్యవస్థను ప్రభుత్వ విద్యలో విలీనం చేయాలని ప్రయత్నించి చేతులు కాల్చుకుంది. 3,4, 5 తరగతులను హైస్కూల్స్ లో విలీనం చేయాలని ప్రయత్నించి విధ్వంసానికి పాల్పడింది. మున్సిపల్ స్కూల్స్ ని పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రయత్నించి రాజ్యాంగం 74, 75 ఆర్టికల్ స్ఫూర్తికి తూట్లు పొడిచింది. విద్యా వ్యవస్థను విధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లుంది.

జీవో నెం. 117తో విద్యా ప్రమాణాలు పతనమౌతున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజ్ చేస్తూ జగన్ రెడ్డి జీవో నెంబర్ 117 ను జారీ చేయడం అన్యాయం. ఈ జీవో విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ఉపాధ్యాయులపై మోయలేని పని భారాన్ని మోపే విధంగా ఉంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3 నుండి 8వ వరకు 6 తరగతులకు ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా లేదు. ఉపాధ్యాయుడు ఖాళీ లేకుండా పని చేయవలసి వస్తుంది. అందువలన విద్యా ప్రమాణాలు ఘోరంగా దెబ్బతింటాయి. 98 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ల స్థానంలో ఎస్జీటీలను నియమిస్తామని ఈ జీవోలో పేర్కొన్నారు. పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ అసిస్టెంట్ లో సబ్జెక్ట్ టీచర్ల చేత బోధన చేయిస్తామని చెప్పిన జగన్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ తీసుకుని 6, 7, 8 తరగతుల కూడా ఎస్.జి.టి.ల చే బోధన చేయించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తిగా తిరోగమన చర్య. ఉన్నత పాఠశాలలలో సింగిల్ మీడియం వల్ల పోస్టులు సర్ ప్లస్ అవుతాయి. వేలాది పోస్టులు పోతాయి. 137 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలో (3-10 తరగతులు) ప్రధానోపాధ్యాయులు, పి.ఈ.టి పోస్టులు తొలగిస్తారు. 92 కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో (6-10 తరగతులు), ప్రధానోపాధ్యాయులు పియిటి పోస్ట్ లు ఉండవు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలి ప్రైవేటు పాఠశాలల వైపు పరుగెత్తడానికి అనుకూలంగా ఈ జీవోను తీసుకువచ్చారు.

ఈ జీవోను రద్దు చేసి శాస్త్రీయమైన, విద్యావిధానాన్ని అభివృద్ధి చేసే పద్ధతి ఇది కాదు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. బైజూస్ విధానం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. హేతుబద్ధమైన ఉత్తర్వులను ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జారీ చేయాలని ఉన్నత పాఠశాలలో రెండు మీడియాలు కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తెలిపారు.

LEAVE A RESPONSE