-ముఖ్యమంత్రి ఆదేశాలతో సొంతంగా మిల్లుల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు
-దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్, ఉపఉత్పత్తులతో రైతుకు మద్దతుగా ప్రభుత్వం చర్యలు
-ప్రపంచ అత్యాధునిక టెక్నాలజీ ఒడిసిపట్టి వేగంగా మిల్లింగ్ ప్రక్రియ
-పెట్టుబడిదారులకు తెలంగాణ మిల్లింగ్ ఇండస్ట్రీలో విసృత అవకాశాలు
-స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా టేలర్ మేడ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలు
-పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న సటాకే కార్పోరేషన్
-సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి చర్చలు
-పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని, సీఎం కేసీఆర్ దార్శనిక రైతు అనుకూల విధానాలతో సాధించిన పదిరెట్ల ధాన్యం దిగుబడికి అనుగుణంగా సీఎం ఆదేశాలతో మిల్లింగ్ ఇండస్ట్రీని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్పీఈజడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పోరేషన్ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.
2014 లో 1815 రైస్ మిల్లులు ఉండగా నేటికి వాటి సంఖ్య 2574కి మాత్రమే పెరిగిందని, ఈ నేపథ్యంలో ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి తెలంగాణలో విసృత అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయడానికి ఆదేశించారని, ఈ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ప్రపంచవ్యాప్తంగా వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని ఒడిసిపట్టడంలో తెలంగాణ ముందుంటుందని, అదేరీతిన మిల్లింగ్ ఇండస్ట్రీలో సైతం అత్యాదునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఎప్పటికప్పుడు వారి పంటలకు మరింత మద్దతు అందించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ధాన్యం మిల్లింగ్ తో పాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక, తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ అందిస్తున్న సటాకే, సైలో తదితర కంపెనీల ప్రతినిదులతో చర్చిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా సటాకె కార్పోరేషన్, ఇతర కంపెనీల ప్రతినిదులు తమ కంపెనీల సాంకేతిక పరిజ్ణానాన్ని మంత్రికి వివరించారు, గంటకు 20 నుండి 1200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని పేర్కొన్న ప్రతినిదులు, బాయిల్డ్, రా రైస్ దేనికైనా అనుగుణంగా అత్యంత అధునాతన పద్దతుల ద్వారా వ్యర్థం, వ్యయం తగ్గేలా టెక్నాలజీ అందిస్తున్నామన్నారు. అమెరికా, చైనా, థాయిలాండ్, వియాత్నాం తదితర దేశాలతో పాటు ఇండియాలోని తమ కార్యకలాపాలను వివరించారు.
తెలంగాణలో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఉన్న విసృత అవకాశాలతో ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉండడంతో సటాకే కార్పోరేషన్ తరుపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసారు. కంపెనీ ప్రతినిధులతో అన్ని అంశాలు కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల, త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు.
ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా 100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి టేలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అందిస్తుందన్నారు. ఈ జోన్లలో సాధారణ పెట్టుబడిదారులకు సైతం ఐదుసంవత్సరాల పాటు 2 రూపాయలకే యూనిట్ నాణ్యమైన కరెంట్, 75 శాతం వరకూ వడ్డీ మాపీ, మార్కెట్ ఫీజుల్లో 100 శాతం రాయితీలను అందిస్తుందన్నారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు ప్రత్యేక రాయితీలను అందిస్తూ ప్రోత్సహిస్తుందని, వీటిని ఆయా వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, టిఎస్ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్ కుమార్ గవార్, ప్రతినిధి సుష్మ, జపాన్ సటాకే కార్పోరేషన్ ప్రతినిధులు ఆర్కే బజాజ్, హెచ్. సతిష్ కుమార్, కె.విఠల్, కె.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పౌరసరఫరాల శాఖలో టెక్నాలజీ అప్ గ్రేడేషన్
సీఎం కేసీఆర్ కృషితో ప్రతీ ఒక్కరికి ఆహార భద్రత కల్పిస్తూ దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. పౌరసరఫరాల శాఖలో ప్రజలకు సేవల్ని మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా అందించేందుకు టెక్నాలజీ సంబందిత అంశాలపై నేడు సచివాలయంలో సమీక్షించారు.
రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు మొదలు వాటిని అన్నార్థులకు అందించే డిస్ట్రిబ్యూషన్ వరకూ వివిద దశలలో ఎలాంటి వ్రుదా లేకుండా మరింత సామర్థ్యం పెరిగేలా టెక్నాలజీ అప్ గ్రేడేషన్ పై నెట్వర్కింగ్, శాటిలైట్ టెక్నాలజీలో పనిచేస్తున్న మలోల ఇన్నోవేషన్స్, సీఎస్ఎం, ఐబిఐ, ప్లానెట్ ఎం తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు పౌరసరఫరాల సంస్థ జిఎం రాజారెడ్డి, శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్, టెక్నికల్ సందీప్, మలోల ఇన్నోవేషన్స్ ఎండి ఎస్ రాజీవ్ రెడ్డి, ప్రతినిధి వాసాల రమేష్, సీఎస్ఎం ప్రతినిధి ప్రియదర్శ్, సౌరబ్ బాటియా, ప్లానెట్ ఎం ప్రతినిధి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి, బక్రీద్ పండగల శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రం సర్వమత సమ్మేళనంతో, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తూ, పండగలు వైభవోపేతంగా చేసుకుంటున్నారు అన్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. హిందువులకు మొదటి పండగ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు, ముస్లింలకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.