-
గత ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది
-
నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో…గ్రామాభివృద్ధికి సర్పంచి అంతే ముఖ్యం
-
ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పిస్తాం
-
మా ప్రభుత్వం రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మరో రూ.1,100 కోట్లు విడుదల చేయబోతున్నాం
-
ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 21.50 కోట్లకు పెంపు
-
సమాజానికి చేటు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా ఉండాలి
-
ప్రతిపక్ష హోదా అనేది ప్రజలిచ్చేది…గెలిపిస్తే వచ్చేది…బెదిరిస్తే వచ్చేది కాదు
-
ఒకే రోజున 13,326 గ్రామసభలు చారిత్రాత్మకం…ఈ కార్యక్రమానికి పూనుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అభినందనలు
-
కొత్తపేట నియోజకవర్గం, వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు నాయుడు
*కొత్తపేట/వానపల్లి :- * ‘గ్రామాలు అభివృద్ధి చెందితేనే మనదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు పంచాయతీలను నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం. గ్రామాభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ఏం చేస్తామో ఈ గ్రామ సభల ద్వారా మనం చర్చించుకున్నాం. రాష్ట్రంలో ఒకే రోజున 13,226 పంచాయతీల్లో గ్రామసభలు పెట్టుకున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను అభినందిస్తున్నా.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ఏ ద్వారా గ్రామసభలు పెట్టాలి. సర్పంచి పని చేయాలన్నా గ్రామసభ ఆమోదం ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజున గ్రామ సభలు పెట్టడం ఒక చరిత్ర. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా గ్రామ సభ నిర్వహించి మాట్లాడారా? ఒక సీఎం, డిప్యూటీ సీఎం మీతో కలిసి సాదాసీదాగా మీ వద్దకు వచ్చి మాట్లాడారా? నాడు సీఎం వస్తున్నాడంటే చెట్లన్నీ నరికేయాలి, పరదాలు కట్టాలి. అందరిని అరెస్టు చేసి ఇంటి నుండి బయటకు రాకుండా చేశారు. స్కూళ్లన్నీ మూసేసి అన్ని బస్సులు ఆయన సమావేశాలకు మళ్లించారు.
కానీ ఇప్పుడు మహిళలు స్వేచ్ఛగా వచ్చి సభలో కూర్చున్నారు. బలవంతంగా డ్వాక్రా సంఘాల ద్వారా జనాన్ని తీసుకొచ్చి నాడు ఇబ్బంది పెట్టారు…ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పోయాయి. గత ప్రభుత్వంలో సభకు వచ్చిన వాళ్లు వెళ్లిపోతుంటే అడ్డుకోవడానికి గోతులు తవ్వారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంత కాలామా.? అందుకే చెప్తున్నా మాది సింపుల్ గవర్నమెంట్…ఎఫెక్టివ్ గవర్నెస్.’ అని సీఎం నారా చంద్రబాబు అన్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, వానపల్లి గ్రామంలో స్వర్ణగ్రామం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో నరేగా బిల్లులు సొంత జేబుల్లోకి
‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి ఈ సభ ద్వారా రూ.4,500 కోట్లు మంజూరు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులను గ్రామాల్లో చేయడానికి గ్రామసభల ద్వారా ఆమోదిస్తున్నాం. నరేగా కార్యక్రమం ద్వారా అందరికీ పని కల్పించాలి…ఇది ప్రభుత్వ బాధ్యత. 54 లక్షల కుటుంబాలకు నరేగా ద్వారా పని దొరకుతుంది. వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. రాష్ట్రంలో 3.54 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు.
1.50 కోట్ల మంది పట్టణాల్లో ఉంటున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. 2014 నుండి 2019 మధ్య గ్రామాల్లో అన్ని పనులు చేసి స్వర్ణయుగంగా మార్చాం. 2019 తర్వాత ఒక్క పని కూడా గ్రామాల్లో చేయలేదు. నరేగా బిల్లులు దుర్వినియోగం చేశారు…సొంత జేబుల్లోకి మళ్లించుకున్నారు. నాడు మేం తాగునీటికి ప్రాధాన్యమిచ్చాం. పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యమిచ్చాం. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఉంటారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచి కూడా అంతే ముఖ్యం.
గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు కూడా అపహాస్యం చేసింది. ఎన్నికలు జరగనీయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేశారు. అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరికో సైకో తయారై అతలాకుతలం చేశారు. నన్ను కూడా ఐదేళ్లు ఇబ్బందులు పెట్టారు. మన ప్రభుత్వం వచ్చాక మాజీ సీఎం, వైసీపీ నేతలను అడ్డుకున్నామా.? జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు. టీడీపీ చరిత్రలో లేని విధంగా 93 శాతం సీట్లతో గెలిపించి బ్రహ్మరథం పట్టారు. చాలా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశాం. దీనికి కారణం గత పాలనలో పడ్డ ఇబ్బందులే.’ అని సీఎం పేర్కొన్నారు.
నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు అమ్ముడుపోని వాళ్లు పాలించారు
‘రాష్ట్రానికి గత ఐదేళ్లు శని పట్టింది. ఇప్పుడు కూడా ఒక భూతం ఉంది…దాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్లు వస్తారు. భూతం మళ్లీ అంటోంది వస్తానని. దాన్ని ఏం చేద్దాం.? మంచి భవిష్యత్తు కావాలంటే భూతాన్ని పూర్తిగా భూమిలో పాతేయాలి. మళ్లీ లేయకుండా కాంక్రీట్ వేయాలి. నా మిత్రుడు పవన్ కల్యాణ్, నా కంటే కూడా జగన్ గొప్పవాడా.? నెత్తిన రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు అమ్ముడుపోడు. అటువంటి వ్యక్తులు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. 2014 నుండి 19 మధ్య 27,444 కి.మీ సీసీ రోడ్లు వేశాం.
మన ప్రభుత్వాన్ని కొనసాగించి ఉంటే నూటికి నూరు శాతం అన్ని గ్రామాల్లో రోడ్లు వేసేవాళ్లం. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 6643 కి. మీ మాత్రమే సీసీ రోడ్లు వేశారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించాం. చెత్త నుండి సంపద తయారు చేయాలని మీ ఊర్లోనే కంపోస్ట్ తయారు చేయాలని 9,838 షెడ్లు నిర్మించాం. రంగుల పిచ్చోడు వాటికి రంగులేసుకున్నారు తప్ప వినియోగించలేదు. 25.22 లక్షల ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశాం…కానీ ఒక దుర్మార్గుడి నిర్లక్ష్యంతో 40 శాతం పని చేయడం లేదు. పంచాయతీ నిధులు ఇవ్వకుండా దారి మళ్లించారు.
నేను, పవన్ కల్యాణ్ రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మళ్లీ రూ.1100 కోట్లు విడుదల చేయబోతున్నాం. మొత్తంగా పంచాయతీలకు రూ.2,100 కోట్లు రాబోతున్నాయి. నరేగా డబ్బులు కూడా వస్తున్నాయి…వీటి ద్వారా గ్రామాల్లో మళ్లీ అభివృద్ధిని చూపిస్తాం. పంటకుంటలు 8.97 లక్షలు తవ్వాం…గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కటీ తవ్వలేదు. 3.67 లక్షల ఎకరాల్లో హార్టి కల్చర్ పెంచాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఎకరా కూడా హార్టి కల్చర్ పెంచింది లేదు. ఉపాధి హామీ పనికి బోర్డు పెట్టాం..సోషల్ ఆడిట్ చేశాం.
కానీ గత ఐదేళ్లు ఏం చేశారో తెలీదు. ఎన్టీఆర్ జలసిరి కింద 32,693 బోర్లు తవ్వి పంపుసెట్లు పెడితే, గత ప్రభుత్వం 2,550 బోర్లు మాత్రమే వేశారు. ఓడీఫ్ రాష్ట్రంగా మార్చాం…వైసీపీ ప్రభుత్వం స్వచ్ఛభారత్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఖర్చు చేయలేదు. రాబోయే రోజుల్లో 17,500 కిమీ సీసీ రోడ్లు వేస్తాం. రెండుమూడేళ్లలోనే గ్రామాల్లో ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేస్తాం. మట్టిలో నడిచే పని లేకుండా చేస్తాం. ఇంటికి మట్టి అంటకుండా వెళ్లేలా చేస్తాం.
సిమెంట్ డ్రెయిన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. 10 వేల కి.మీ సీసీ డ్రెయిన్లు నిర్మిస్తాం. 2,500 కి.మీ బీటీ రోడ్లు వేస్తాం. 4.5 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్, 5 లక్షల పంటకుంటలు, పశువుల, జీవాల కోసం 1.5 లక్షల షెడ్లు నిర్మిస్తాం. 15 కోట్ల నుండి 21.50 కోట్లకు ఉపాధి హామీ పని దినాలు పెంచబోతున్నాం. పెరిగిన ధరల దృష్ట్యా ఉపాధి హామీ కూలీ రేట్లు కూడా పెంచబోతున్నాం.’ అని సీఎం స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికీ ఇళ్లు…ప్రతి ఇంటికి విద్యుత్, నీళ్లు
‘గ్రామాలకు ఏం కావాలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి ఇళ్లు ఉండాలి. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలి. ఈ వానపల్లి గ్రామంలో ఇళ్లు లేని 610 కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తాం. రాష్ట్రంలో ఎవరూ ఇళ్లు లేదనకుండా ఇళ్లు నిర్మిస్తాం. కరెంట్, కుళాయి ద్వారా నీళ్లు ఇస్తాం. ప్రతి ఇంటిక మరుగుదొడ్డి ఉండాలి. గ్యాస్ కనెక్షన్ ఉండాలి. త్వరలోనే ఇంటింటికీ 3 గ్యాస్ సిలీండర్లు అందిస్తాం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు ఉండాలి. చెత్త కనబడకుండా స్వచ్ఛ గ్రామాలుగా ఉండాలి. రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు చేస్తాం.
గ్రామానికి దగ్గర ఆసుపత్రులు, స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు రోడ్లు చూశారా…ఐదేళ్లలో పైసా కూడా ఖర్చు చేయకుండా గోతులు పెట్టారు. ఈ గోతులు చూస్తుంటే భయంగా ఉంది. రూ.10 లక్షల కోట్ల అప్పులతో పాలన ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ ప్రజలకు మంచి చేయాలనే మనసు ఉంది. ఎన్డీయేకు 21 మంది ఎంపీలను ఇచ్చారు. ఎంపీలంతా కేంద్రంలో కీలకంగా ఉన్నారు. మీరు ఇచ్చిన గుర్తింపు అభివృద్ధికి, సంక్షేమానికి ఉపయోగిస్తున్నాం. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టగానే ఐదు హామీల అమలుపై సంతకాలుపెట్టా.
మొదటి సంతకం నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీపై పెట్టాం. నా ఆలోచనంతా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే. రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. మీ నాన్న, తాత భూములు ఇచ్చారు. ఆ పట్టా పుస్తకాలపై ఎవరి బొమ్మ ఉండాలి…మీది. కానీ వాళ్ల బొమ్మ వేశారు. రాజముద్రతో మళ్లీ పట్టాలు మీకు ఇస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారు…అది వచ్చి ఉండుండే మీ భూములు మీకు దక్కేవి కావు. సాక్షి నుండి గుమస్తాలు తెచ్చి కూర్చోబెట్టేవారు. దుర్మార్గమైన ఆలోచనలు చేశారు. మన జుట్టు పట్టుకుని ఆడించాలని చూస్తే దేవుడు సరైన సమయంలో సరైన చోట కూర్చోబెట్టారు.’ అని సీఎం చురకలు అంటించారు.
హోదా ప్రజలిస్తే వస్తుంది…బెదిరిస్తేనో, దబాయిస్తే రాదు
‘మీరు జగన్ కు హోదా ఇవ్వలేదు..కానీ ప్రతిపక్ష హోదా కావాలంట. ప్రజలు ఇస్తే వచ్చేది హోదా…ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి. కానీ దబాయిస్తేనో, నేరం చేస్తేనో, బెదిరిస్తేనో పదవులు రావు. ప్రతి నెలా అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల దర్శనం చేసుకోవాలని పేదల సేవలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రూ.3 వేల పింఛను రూ.4 వేలకు ఎన్డీయే ప్రభుత్వం పెంచింది. పింఛను ఇవ్వాలంటే వాలంటీర్లు మాత్రమే ఇవ్వాలని రాజకీయం చేసి 35 మంది వృద్ధులను చంపారు. కానీ నేడు మనం వాలంటీర్లు లేకుండా ఒకే రోజున 98 శాతం పింఛన్ ప్రభుత్వ యంత్రాంగంతో ఇచ్చాం.
అసాధ్యం అని మాయమాటలు చెప్పారు..దాన్ని మనం సుసాధ్యం చేశాం. వికలాంగులకు పింఛను రూ.3 వేల నుండి రూ.6 వేలకు పెంచాం. లేచి తిరగలేని వారికి రూ.15 వేలు పింఛను ఇస్తున్నాం. నేను పడే కష్టం ప్రజల కోసమే. సంపద సృష్టించి ప్రజలకే ఖర్చు చేస్తాం. మా ఉద్యోగులకు కూడా 1వ తేదీనే జీతాలు ఇస్తున్నాం. ఒకేసారి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. వచ్చే నెల చివరి నాటికి 203 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి తెస్తాం. దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు…వారిని అభినందిస్తున్నా’ అని సీఎం తెలిపారు.
వచ్చే నెల 11 నుండి నూతన ఇసుక పాలసీ
‘నైపుణ్య గణన చేపట్టబోతున్నాం. చదువుకున్న యువత ఉద్యోగాలకు నైపుణ్యం అవసరం. నైపుణ్యం ఉంటే రెట్టింపు ఆదాయం వస్తుంది. నైపుణ్య గణన చేసి నైపుణ్యం పెంచుతాం. ప్రకృతి సేద్యానికి ముందుకు వెళ్లాం. ప్రస్తుతం 12 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతుంది…దాన్ని 50 లక్షల ఎకరాలకు తీసుకెళ్తాం. రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గిస్తాం. మీకు ఇసుక కావాలని బుక్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికే వస్తుంది. సీనరేజ్, తవ్వకం, రవాణా ఖర్చులు మీరు పెట్టుకుంటే చాలు…ఇసుకకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. చిన్నపాటి సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తాం.
సెప్టెంబర్ 11 నుండి నూతన ఇసుక పాలసీ అమల్లోకి తెస్తాం. సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటే నేరుగా మీ ఇంటికి వస్తుంది. మీరే నేరుగా లారీనో, ట్రాక్టరో తీసుకెళ్తే టోకెన్ ఇస్తారు…ఆ టోకెన్ ఇచ్చి ఇసుక తెచ్చుకోవచ్చు. ఈ యేడాది వర్షాలు బాగా పడ్డాయి. వరుణ దేవుడు కూడా కరుణించాడు. రాబోయే రోజుల్లో కరవు లేకుండా శ్రీకారం చుడుతున్నాం. పోలవరం రాష్ట్రానికి వరం. కానీ ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. డయాఫ్రంవాల్, గైడ్ బండ్, కాఫర్ డ్యాం దెబ్బతిన్నాయి. 2021 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు మొత్తం పడకేసింది.
డయాఫ్రం వాల్ కొత్తది కట్టాల్సి వస్తోంది. లేదంటే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు అదనంగా భారం పడుతోంది…ప్రజల ప్రాణాల కంటే మాకు ఏదీ ముఖ్యంకాదు. రైతులకు గత ప్రభుత్వం పెట్టిన రూ.1674 కోట్లు ధాన్యం బకాయిలు చెల్లించాం. ధాన్యం అమ్మిన రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తాం. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా వ్యవహరిస్తాం. కేంద్రం వివిధ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బులను గత పాలకులు దుర్వినియోగం చేశారు. దీంతో నిధులు కేంద్రం నిలిపేసింది. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన వాటికి వివరాలు లేవు.’ అని సీఎం పేర్కొన్నారు.
వానపల్లి గ్రామంలో ఈ యేడాది చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు
‘వానపల్లి గ్రామంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. రూ.10.20 కోట్లతో 16 పనులకు మనం నేడు ఆమోదం తెలుపుకుంటున్నాం. సీసీ రోడ్లు 9.3 కిమీలకు రూ.5.60 కోట్లు, మురుగు కాల్వలు 4.5 కి.మీలకు రూ.2.2 కోట్లు, 3.5 కి.మీ గ్రావెల్ రోడ్లకు రూ.35 లక్షలు, పశువుల కొట్టాలకు రూ.25 లక్షలు, ఉద్యాన పంటలకు రూ.10.50 లక్షలు, ఇలా పలు రకాల పనులను ఈ యేడాది చేయబోతున్నాం. పేదరికం లేకుండా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి.
టెక్నాలజీ యుగంలో ఉన్నాం సంపద సృష్టిస్తున్నాం. ఆ సంపద కొందరి చేతుల్లోకే వెళ్తోంది. కనీస అవసరాలు ఇచ్చి, కనీస ఆదాయ మార్గాలు చూపించేందుకు ఆలోచిస్తున్నాం. సంపద ఉన్నవారిలో 20 శాతం మంది పేదరికంలో ఉన్న 20 శాతం మందిని ఆదుకుంటే ఆర్థికంగా పైకి వస్తారు. జనవరి నుండి జన్మభూమి 2.0 కార్యక్రమం తీసుకొస్తాం. ప్రపచంలో ఎక్కడున్నా గ్రామాల నుండి వెళ్లిన వారు గ్రామాభివృద్ధికి పాటుపడాలి.’ అని సీఎం పిలుపునిచ్చారు.
తలసరి ఆదాయంలో తెలుగువారు చిరునామాగా ఉండాలి
‘ప్రతి ఒక్కరూ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రజలను ఆస్తిగా చూడాలి. కొన్ని దేశాల్లో పిల్లల్ని కనడం మానేశారు. యువత తగ్గిపోతే గ్రామాల్లో వృద్ధులు పెరిగిపోతారు. పుట్టేవాళ్ల సంఖ్య తగ్గి…చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో నేనే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పా…ఇప్పుడు జనాభా పెంచండని చెప్తున్నా. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధన రద్దు చేశాం. సోలార్ ద్వారా కరెంట్ ఇంట్లోనే తయారు చేసుకునే రోజు వచ్చింది.
ఇంట్లో కరెంట్ ఉత్పత్తి చేసుకుని మిగిలిన కరెంట్ గ్రిడ్ కు అమ్మొచ్చు. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ కూడా వినియోగంలోకి వస్తోంది. 2047 నాటికి దేశం నెంబర్ 1, లేదా 2గా ఉంటుంది. 2029 నాటికి ప్రపంచంలో 3వ స్థానానికి వస్తుంది. మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 గా ఉండాలి. ప్రపంచంలో తెలుగువాడు అగ్రస్థానంలో ఉండాలి. తలసరి ఆదాయంలో తెలుగువారు చిరునామాగా ఉండాలి. ఐదేళ్లలో మీరు ఊహించని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేస్తుంది.
రాష్ట్రానికి మంచి జరగాలి, మమ్మల్ని నమ్మిన తెలుగుజాతిని నెంబర్ వన్ గా మా ప్రభుత్వం ఉంచుతుంది. రాష్ట్రంలో ప్రజలు చెప్పింది కూడా విని ప్రతి ప్రజాప్రతినిధి, అధికారులు పని చేయాలి..మనం ప్రజల కోసమే ఉన్నాం…ప్రజల కోసమే పని చేయాలి.’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు