-
ఒకే రోజున 13,326 పంచాయతీల్లో నిర్వహణ
-
గ్రామాల్లో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులపై గ్రామ సభల్లో చర్చించి ఆమోదం
-
గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది
-
కలసికట్టుగా పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలం
-
గ్రామ సభల్లో ప్రజలందరూ పాల్గొనేలా చూడాలి
-
గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అధికారుల సహాయ, సహకారాలు అవసరం
-
గ్రామ సభల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్
‘గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే… మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపించడం సాధ్యమవుతుంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని, పథకాన్ని సమర్థంగా అమలు చేసి, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు వరకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు అవసరమన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే పథకం అమల్లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామ సభలకు సంబంధించి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఉపాధి హామీ పథకం ద్వారా రూ.వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి రూపాయినీ బాధ్యతతో ఖర్చు చేయాలి. ఏ ఉద్దేశంతో పథకం ప్రారంభమైందో ఆ లక్ష్యాన్ని అందుకోవాలి. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలి.
ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏ పనులు చేపట్టి అభివృద్ధి చేసుకోవాలో తీర్మానించుకోవడానికి సరైన వేదిక గ్రామ సభ. మీ ఊరికి ఏ పనులు అవసరమో మాట్లాడుకొని తీర్మానించుకొనే అవకాశం దీని ద్వారా ఉంది. ఆ పనులకు ఎన్ని నిధులు వచ్చాయో, ఎలా ఖర్చు చేస్తారో కూడా గ్రామ సభల్లో తెలుస్తుంది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించాలని చాలా మంది చెప్పారు. అందుకే ఈ నెల 23వ తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించాం.
2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై గ్రామ సభలో చర్చించి ఆమోదం తీసుకుంటాం. పంచాయతీ అధికారులు గ్రామ సభల నిర్వహణపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. రెండు రోజుల ముందే గ్రామ సభపై సమాచారాన్ని తెలియజేయాలి. సభను అర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో ఈ సభలు నిర్వహించడం అవసరం. తద్వారా ప్రజలకు వారి గ్రామాల అభివృద్ధిలో భాగమవుతారు.
నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోము
ఉపాధి హామీ పనులు కూలీలు, రైతులకు ఉపయోగపడేలా, ఉత్పాదకత పెంపొందించేలా ఉండాలి. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం పనులు నిబద్ధతతో పూర్తి చేయాలి. ప్రజలకు మేలు చేయాలనే బలమైన సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. అవినీతి పాల్పడితే ఏ స్థాయి అధికారినైనా వదలం. ప్రతి ఒక్కరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. బాధ్యతయుతంగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తాము” అన్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.