– వచ్చే రబీ నుండి ప్రత్యేక విధానం అమలు
– కౌలు రైతులకు వ్యవసాయాధికారులచే గుర్తింపు కార్డులు జారీ
– రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు : రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వ్యవసాయరంగంలో 80 శాతానికి పైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారని, అయినప్పటికీ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు 16 వేల కోట్ల రుణాలు లక్ష్యంగాను, కౌలు రైతులకు అందులో కేవలం 1 శాతం 240 కోట్ల రూపాయలు లక్ష్యానికిగాను 101 కోట్ల రూపాయలు పంటల రుణాలు అందించడం నిజంగా బాధాకరమైన విషయమన్నారు.
గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో భూ యజమాని అంగీకారం ఉండాలని పెట్టిన నిబంధనతో కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని లక్షలాదిమంది కౌలు రైతులు సాగు సమయంలో అధికవడ్డీకి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుండి రుణాలు తీసుకుని నష్టపోయారన్నారు.
2024-19 తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తే, గత ప్రభుత్వం కేవలం 8 లక్షలమంది కౌలు రైతులకు మాత్రమే గుర్తింపుకార్డులు జారీ చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్ది భూ యజమాని అంగీకారంతో పనిలేకుండా, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో సాగుచేసే కౌలు రైతులను గుర్తించి భూ యాజమాన్య హక్కులకు ఎటువంటి భంగం కలగని రీతిలో గుర్తింపు కార్డులు జారీ చేస్తారని, సదరు కార్డును పరిగణనలోనికి తీసుకుని బ్యాంకర్లు రుణాలు అందిస్తామన్నారు.
వచ్చే రబీ సీజన్ నాటికి కొత్త విధానాన్ని అమలులోనికి తీసుకువచ్చి, అర్హులైన ప్రతీ కౌలు రైతుకీ పంట రుణాలు అందించేలా రాష్ట్రముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. కౌలు రైతులకు కార్డుల జారీ విధానంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి, కౌలు రైతులకు మరింత మేలు కలిగించేలా నూతన విధానాన్ని రూపొందిస్తామన్నారు.
జిల్లాలో ప్రాధాన్యతారంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు చక్కని సహకారంతో రుణాలు అందిస్తున్నాయన్నారు. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు రుణాలు అందించి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరిస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 16 వేల 600 కోట్లరూపాయలు లక్ష్యానికి గాను మొదటి త్రై మాసికంలో 3223 కోట్ల రూపాయలు రుణాలుగా అందించారన్నారు.
జిల్లాలో పొగాకు రైతులకు రుణాలను బ్యారెన్ కు 7 నుండి 8 లక్షల రూపాయల వరకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సెక్యూరిటీ గాను నాలా వంటి నిబంధనలు లేకుండా వ్యవసాయ భూమిని అంగీరించాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ ని కోరుతున్నామన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పధకం ద్వారా చేతివృత్తుల వారికి బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారన్నారు.
సానుకూల దృక్పధంతో అధికారులు కృషిచేసి చేతివృత్తుల వారికి రుణాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులు కూడా సామజిక బాధ్యతతో చిరు వ్యాపారులకు ముద్ర లోన్లు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య , ప్రభృతులు పాల్గొన్నారు.