విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్‌ను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.
ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం ఇక్కడ జరిగేలా ఎంతో కృషి చేసిన అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్‌కు ప్రత్యేంగా నా ధన్యవాదాలు. ఆయనతో పాటు, యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమెరికాలోని ఆ ఉన్నతమైన పదవిలో ఒక తెలుగు వ్యక్తి.. ముఖ్యంగా నా సొంత జిల్లాకు చెందిన మహిళ ఉండడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. మీ సహాయ, సహకారాలతో ఇవాళ మొదలైన ఈ వ్యవస్థ ఎంతో ముందుకు సాగి ఇంకా మరెన్నో సేవలందించాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నంలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు కావాలన్నదే మా అంతిమ లక్ష్యం. దేవుడి దయతో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతున్నాను.
విశాఖలో ఇవాళ ఏర్పాటవుతున్న అమెరికన్ కార్నర్ దేశంలో మూడవది. దేశంలో ఇప్పటివరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లో అమెరికన్ కార్నర్లు పని చేస్తుండగా, ఇవాళ కొత్తగా విశాఖపట్నంలో మరో కార్నర్ ఏర్పాటవుతోంది. ఇది ఎంతో సంతోషకరం. ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటవుతున్న అమెరికన్ కార్నర్ ఇక్కడ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకే కాకుండా, ఇంకా మరెన్నో విధాలుగా సేవలందించడంలో అమెరికన్ కార్నర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
రాష్ట్రంలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందుకు మేము ఎప్పటికీ ఆయనకు కృతజ్ఞులమై ఉంటాము. ఈ అమెరికన్ కార్నర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాము. ఇక్కడి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ అమెరికన్ కార్నర్ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని మనసారా ఆశిస్తూ.. ఇప్పుడు అమెరికన్ కార్నర్‌ను ప్రారంభిస్తున్నాను.
ఆంధ్ర–అమెరికా మధ్య మరింత బంధం: జోయల్ రీఫ్‌మన్. యూఎస్ కాన్సుల్ జనరల్:
– విశాఖపట్నంకు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా ఇక్కడి అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించాను. ఎందరినో చూశాను. ఈ పర్యటన నాకెన్నో అనుభూతులను మిగిల్చింది. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఇది నా తొలి పర్యటన. యూనివర్సిటీ చరిత్రలో ఒక అద్భుత ఘట్టంలా నిల్చే అమెరికన్ కార్నర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.
ఇక్కడ అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావడంలో ఎంతో చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో ఎంతో కృషి చేసిన సీఎం వైయస్ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్య, ఉద్యోగ రంగాలలో యువతకు.. ముఖ్యంగా మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించడం కోసం రెండు ప్రభుత్వాలు (రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం) కట్టుబడి ఉన్నాయి. ఆ అవకాశాలు అంది వచ్చేలా చేయడంలో ఈ అమెరికన్ కార్నర్ ముఖ్య భూమిక పోషించనుంది.
ఆంగ్లంలో నైపుణ్యం పెంచడం.. నిజానికి ఈ దిశలో సీఎం వైయస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే, స్టెమ్ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు–ఎస్‌టీఈఎం–స్టెమ్) విద్య, మహిళా సాధికారత, అమెరికన్ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించడం తదితర అంశాలలో ఈ అమెరికన్ కార్నర్ ఎంతో సహాయకారిగా నిలుస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆకాంక్షలను నెరవేర్చడంలో, కలను సాకారం చేయడంలో ఒక వేదికగా ఈ కార్నర్ నిలుస్తుంది. అమెరికన్ కార్నర్ అన్ని సేవలను ఉచితంగా అందజేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్ర విద్యార్థులు, యువతకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని ఆశిస్తూ, ఇందు కోసం ఎంతో చొరవ చూపి, కృషి చేసిన సీఎం వైయస్ జగన్‌కు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.