Suryaa.co.in

National

జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

– మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం
– వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
– 8 మంది సభ్యులతో కమిటీ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది.

కేంద్ర సర్కార్ వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదన కోసం రామ్‌నాథ్‌ కోవింద్‌‌ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్‌నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది.

సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. అందుకు తగినట్లే కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధ్యయనానికి కమిటీ వేసి.. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.

కోవిద్ సిఫార్సులు ఇవీ..
191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత…రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను అందించిన కోవింద్ కమిటీ.
జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఐదు అధికరణల సవరణ ఆవశ్యకం.
ఆర్టికల్ 324A, 325 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి.
జమిలి ఎన్నిక లకు రెండంచల విధానం సిఫారసు.
మొదట లోక్‌సభ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు.
మొదటి దశ పూర్తైన వంద రోజుల్లోపు… రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు.
ఏదేని కారణం చేత పార్లమెంట్ లేక అసెంబ్లీ నిర్ధారిత కాలపరిమితికన్నా ముందే రద్దు అయితే… మిగిలిన పదవీ కాలానికి మాత్రమే ఎన్నికలు జరగాలని సిఫారసు.

LEAVE A RESPONSE