Suryaa.co.in

Andhra Pradesh

అమ‌రావ‌తిలో రూ. 11,467 కోట్ల మేర పనుల టెండ‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్!

– సీఆర్డీఏ అథారిటీ ఆమోదం!
– సీఎం చంద్ర‌బాబు అధ్యక్ష‌త‌న జ‌రిగిన 41వ సీఆర్డీఏ అథారిటీ స‌మావేశం
– భ‌వ‌నాలు, రోడ్లు, మౌలిక వ‌స‌తులు చేప‌ట్టేందుకు అనుమ‌తులు
– ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగా మూడేళ్ల‌లో రాజధాని పూర్తి
– అథారిటీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించిన మంత్రి నారాయ‌ణ‌

అమ‌రావ‌తి: రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప‌నులు చేప‌ట్టేందుకు సీఆర్డీఏ అధారిటీ స‌మావేశం ఆమోదం తెలిపింది… మొత్తం 11,467 కోట్ల మేర ప‌నుల‌కు అథారిటీ ఆమోదం తెలిపిన‌ట్టు మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ వెల్లడించారు. ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న బుధవారం సీఆర్డీఏ 41వ అథారిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మంత్రి నారాయ‌ణ‌, సీఎస్ నీర‌బ్ కుమార్ తో పాటు ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు. మొత్తం 23 అంశాల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. అథారిటీ తీసుకున్న నిర్ణ‌యాల‌ను మంత్రి నారాయ‌ణ మీడియాకు వెల్ల‌డించారు.

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట తో అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ‌రావ‌తి విష‌యంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామ‌ని, సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ అథారిటీ స‌మావేశంలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్ణ‌యించామ‌ని తెలిపారు. సీడ్ కేపిట‌ల్ లో నిర్మించే 360 కిమీల ట్రంక్ రోడ్లలో 2498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపింది. వరద నివారణ కు 1585 కోట్లతో పాల వాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి నిర్ణ‌యించాం.

గెజిటెడ్, నాన్ గెజిటెడ్,క్లాస్ -4, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను 3523 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం తెలిపింది. రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 3859 కోట్లకు అనుమతి ఇచ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. వీటితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కు అథారిటీ ఆమోదం తెలిపింద‌ని మంత్రి నారాయ‌ణ‌ చెప్పారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామ‌న్నారు.

ఇక అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్ లోని 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ,హై కోర్టు భవనాలు డిజైన్లకు ఇప్ప‌టికే టెండర్లు పిలిచామ‌ని…. ఈనెల 15 నాటికి డిజైన్ల టెండ‌ర్లు పూర్త‌వుతాయ‌న్నారు. డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు ఆయా భ‌వ‌నాల నిర్మాణాల‌కు కూడా టెండ‌ర్లు పిలుస్తామ‌న్నారు. సీఎం చంద్ర‌బాబు పిలుపుతో కేవ‌లం 58 రోజుల్లో రైతులు 34 వేల ఎక‌రాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని, అలాంటి రైతుల‌ను గ‌త ప్ర‌భుత్వం అనేక ర‌కాలుగా ఇబ్బంది పెట్టింద‌న్నారు. అథారిటీ మొత్తం 23 అంశాలను ఆమోదించినట్టు వెల్లడించారు.

LEAVE A RESPONSE