– ఏపీపై ప్రత్యేక దృష్టి సారించి, సహకారం అందించండి
– లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు
న్యూఢిల్లీ: రైల్వే సవరణ బిల్లు – 2024 పై జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పాల్గొని, ఈ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేసేలా స్వయంప్రతిపత్తిని వికేంద్రీకరించాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రరాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలకు అనుసంధానం చేసే అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు రూ. 2,245 కోట్లతో ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పల్నాడులోని ఆరు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద చేర్చడాన్ని అభినందిస్తూ, వీటి పురోగతిని ముందుకు తీసుకుని వెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు.. నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, రేణిగుంట-గూడూరు, కోటిపల్లి-నర్సాపూర్ లైన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. నరసరావుపేటలో స్టాపేజితో గుంటూరు – బెంగళూరు మధ్య వందే భారత్ కనెక్టివిటీని ప్రవేశపెట్టాలని, కోవిడ్ లాక్ డౌన్లో నిలిపివేయబడిన రైల్వే స్టాప్‌లను పునరుద్ధరించాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కోసం 24 రైల్వే అండర్‌పాస్‌లను ఓవర్‌పాస్‌లుగా మార్చడానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
పండ్లు, కూరగాయలకు 50% రవాణా సబ్సిడీతో పాటు, ఉద్యానవన ఉత్పత్తులకు కీలకమైన సేవ అయిన అనంతపురం నుండి న్యూఢిల్లీకి కిసాన్ రైలును పునరుద్ధరించాలని కోరారు. కోవిడ్ లో నిలిపివేయబడిన సీనియర్ సిటిజన్ ప్రయాణ రాయితీలను పునరుద్ధరించాలని అభ్యర్థించారు.