– 12 గ్రోత్ సెక్టర్లు
– పర్రిశమల ఏర్పాటు, గృహ నిర్మాణం పేరుతో అవసరమైన చోట్ల భూ సమీకరణ
– ప్రాంతీయ భూ సమీకరణ ప్రతిపాదన
– తొమ్మిది జిల్లాల పరిధిలో ఏర్పాటు
– రీజియన్ పరిధిలో కనీసం ఎనిమిది భారీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులు
– విజయవాడ-గుంటూరు పారిశ్రామిక సేవల జంట నగరాలు
– ఏలూరు, బాపట్ల వ్యవసాయ పారిశ్రామిక కేంద్రాలు
– ఒంగోలు మార్కాపురం ఖనిజ ఉత్పత్తి కారిడార్
– ఓడరేవు ఆధారిత పారిశ్రామిక ప్రాంతాలుగా మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ క్లస్టర్
44,962 చదరపు కిలోమీటర్ల (1,12,40, 500 ఎకరాల) పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పర్రిశమల ఏర్పాటు, గృహ నిర్మాణం పేరుతో అవసరమైన చోట్ల భూ సమీకరణ చేయనుంది. తొమ్మిది జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఈ రీజియన్‌లో తొలిదశలో అభివృద్ధికి అవసరమైనవంటూ 10 నుండి 12 అంశాలను గుర్తించనున్నారు.
నీతిఅయోగ్ రూపొందించిన సిటీ ఎకనామిక్ రీజియన్ (సిఇఆర్) ప్లాను నిబంధనలకు అనుగుణం గా విధివిధానాలు తయారు చేయనున్నారు. దీనికి అవసరమైన నివేదికను తయారు చేసేందుకు వీలుగా వ్యూహాత్మక కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లో అనేక కీలక అంశాలు పొందుపరిచారు. రీజియన్ పరిధిలో కనీసం ఎనిమిది భారీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుల కోసం అంతర్జాతీయ బ్యాంకులు, పెట్టుబడిదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో ‘బ్యాంకబుల్ ప్రీ – ఫీజిబిలిటీ నివేదిక’ రూపొందించనున్నారు.
దీనిలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలను అంచనా వేస్తారు. ఇందులో భూమి వినియోగాన్ని కీలకంగా పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కొత్తగా భూములు గుర్తించడం, ఇప్పటికే ఉన్న ల్యాండ్ బ్యాంకుతోపాటు, భూసమీకరణ పద్దతులు అనుసరించనున్నారు. గతంలో పారిశ్రామిక ప్రాంతాల కోసం సేకరించిన భూమిని వినియోగించడానికి వీలుగా ప్లాను రూపొందించనున్నారు.
వీటన్నిటికంటే ముఖ్యంగా ‘రీజినల్ ల్యాండ్ పూలింగ్` విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అందులోనూ పట్టణ ప్రాంత విస్తరణ కీలకంగా ఉండాలనీ, ఆర్థిక అవసరాలు తీర్చేలా భూమి వినియోగ పద్ధతులు రూపొందించాలని సూచించారు.
నూతన రీజియన్ పరిధిలో అమరావతి రాజధాని నగరంగా, విజయవాడ-గుంటూరు పారిశ్రామిక సేవల జంట నగరాలుగా, ఏలూరు, బాపట్ల వ్యవసాయ పారిశ్రామిక కేంద్రాలుగా, ఒంగోలు మార్కాపురం ఖనిజ ఉత్పత్తి కారిడార్‌గా అభివృద్ధి చేయనున్నారు. మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న రీజియన్ ప్లాను కోసం సింగపూర్, గ్రేటర్ టోక్యో, సియోల్ అనుభవాలను పరిశీలించాలని తెలిపారు.
కేంద్రం సిటీ ఎకనామిక్ రీజియన్ల కోసం రూ.5000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో నిధులు రాబట్టుకోవడం రీజియన్ ఏర్పాటులో కీలకమని ఆర్‌ఎఫ్‌పిలో పేర్కొన్నారు. అమరావతి ఆర్థిక రీజియన్‌లో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల మార్కాపురం జిల్లాలున్నాయి.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సుమారు 35.15 శాతం వాటాను ఈ ప్రాంతం కలిగి ఉంది. ఇందులో అమరావతి రాజధాని చుట్టూ భూ సమీకరణ ఆధారిత అభివృద్ధి ప్లానుతోపాటు చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారి, ప్రతిపాదిత అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే, విజయవాడ-హైదరా బాద్ కారిడార్ తోపాటు విస్తృతమైన రైల్ మార్గం ఉందని పేర్కొన్నారు.
వీటికితోడు కృష్ణపట్నం – మచిలీపట్నం – రామాయపట్నం – కాకినాడ క్లస్టర్, ఓడరేవు ఆధారిత పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయని, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఉందని వీటిన్నిటినీ ఉపయోగించుకునేలా నూతన ప్లాను రూపొందించాలని పేర్కొన్నారు. వచ్చే దశాబ్దకాలంలో ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రిక్ వాహన భాగాలు, ఫార్మా, టెక్స్టైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ , గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ప్రాంతీయ వృద్ధికి కీలకం కానున్నాయని తెలిపారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల నుండి ఆదాయం ఎక్కువ వస్తున్నా విస్తరించలేదని, నూతన ప్లానులో పట్టణ ప్రాంతాల విస్తరణకు ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు. ఇందులో పరిశ్రమలతోపాటు గృహ నిర్మాణానికి వీలుగా ప్లాను ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయి ఆర్థిక ప్రత్యేకతలు, వృద్ధి కేంద్రాలు కారిడార్లను గుర్తించనున్నారు. గ్రామీణ పట్టణ శివారు ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని బలపరిచేలా ప్రాంతీయ ఆర్థిక వ్యూహాలను రూపొందించనున్నారు.
పెట్టుబడులకు అనువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల (పారిశ్రామిక /లాజిస్టిక్స్ /పట్టణ/ సామాజిక) జాబితాను స్థల సేకరణ, ఆర్థిక అంశాలను సిద్ధం చేయనున్నారు. పెట్టుబడులకోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక (1-22 ఏళ్లు) నిధుల సమీకరణ ప్లాను రూపొందించ నున్నారు._దీనికోసం తొమ్మిది రంగాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. రాబోయే అరవై సంవత్సరాల్లో భారీ, రంగాలవారీ పరిశ్రమలు, పట్టణ సదుపాయాల కల్పన ఏర్పాటుకు ప్లానులో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
– వల్లభనేని సురేష్
(అమరావతి రాజధాని సమగ్ర విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్)
9010099208