– కొంపలో స్మార్ట్ టీవీ ఉంటే అది సంసారానికి ఎసరు పెట్టే ప్రమాదం
– పిల్లలకు మీరు ఇచ్చే నిజమయిన ఆస్తి మీ సమయం
– పిల్లల్ని “కోడింగ్ కోళ్లు” చెయ్యొద్దు
– ఇంట్లో వండితే వంట.. . బయటనుంచి ఆర్డర్ ఇస్తే అది కడుపు మంట
– కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాయిగా కాలం గడపండి
మీ భవిష్యత్తును మార్చగల అయిదు నిర్ణయాలు !
1 . బంగారం కొనండి . బంగారం ధర 60 వేలు ఉన్నప్పుడు “బంగారం కొనండి “అని చెప్పాను .
ఈ రోజు అది.. లక్షా యాభై నాలుగు . మూడేళ్ళలో రెండున్నర రెట్లు అయ్యింది .
ఈ రోజు తేదీ 2026 మే నాలుగు .
ఈ రోజు మళ్ళీ చెబుతున్నాను .
బంగారం కొనండి .
మరో ఐదేళ్లల్లో బంగారం .. నేటి ధరతో పోలిస్తే రెట్టింపు .. అంతకన్నా ఎక్కువ అవుతుంది .
వెండి తో అంత గా భరోసా ఉండదు .
పేపర్ బంగారాలు .. అంటే బాండ్స్ .. ఇలాంటివి కాదు. ఫీజికల్ గా బంగారం కొనండి .
దీనికి సంభందించి ఉన్న… ఒకే ఒక సమస్య బంగారాన్ని భద్రంగా దాచుకోవడం .
బంగారం దొంగతనాలు ఎక్కువ అవుతాయి .
బాగా సెక్యూరిటీ ఉంటే తప్పించి బయటకు బంగారు నగలు వేసుకొని వెళ్లొద్దు .
బంగారం ఇప్పుడు ఆస్తి …. ఆభరణం కాదు .
2 . పిల్లల్ని కనండి .
రాబోయే రోజుల్లో ఇది అన్నిటికంటే పెద్ద ఆస్తి అవుతుంది . ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయి .
పిలల్ల చదువులకు అయ్యే ఖర్చు భరిస్తాయి .
అమెరికా పని అయిపోయింది .
అక్కడ వీసాపై ఉన్నవారు పెద్ద ఎత్తున ఇండియా కు తిరిగి వచ్చేస్తారు .
లేదా కెనడా జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళిపోతారు .
ఎవరో కొంతమందికి తప్పించి అమెరికాకు ఉన్నత విద్యకోసం ఆపై ఉపాధి కోసం వెళ్లే అవకాశం లేదు .
అమెరికా గతం .
ఇండియా భవిష్యత్తు . .
పోనీ మీకు ఇండియా లో ఉండడం ఇష్టం లేకుంటే .. అనేక దేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశం .
ఇటలీ , స్పెయిన్, ఫిన్లాండ్ పోలాండ్ , ఆస్ట్రియా , గ్రీస్ , బెల్జియం, నార్వే, స్వీడన్ , నెథర్లాండ్స్, స్విట్జర్లాండ్ , జర్మనీ , హంగేరి , పోర్చుగల్ , డెన్మార్క్… లాంటి యురోపియన్ దేశాలు… దక్షిణ కొరియా , టైవాన్ , చిలి, చైనా, జపాన్, సింగపూర్ , హొంగ్ కాంగ్ థాయిలాండ్ .. లాంటి ఆసియా దేశాల్లో… జనాభా క్షీణత భారీగా ఉంది.
2.1 ఉండాలి . పైన చెప్పిన దేశాల్లో ఇది 1.5 .
అంటే రానున్న రోజుల్లో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంది .
ఇది .. ఆర్థిక సామజిక సంక్షోభాలకు దారి తీస్తుంది .
ఈ విషయం చాల మందికి సరిగా అర్థం కాదు. జనాభా తగ్గితే మంచిదే కదా అనుకొంటారు .
ఒక బిల్డింగ్ ఎత్తు పరిమితికి మించి 19 మీటర్లు ఉంది . నిబంధనల ప్రకారం ఇది 15 మీటర్లే ఉండాలి .
ఒకడు గ్రౌండ్ ఫ్లోర్ ను కూల్చేశాడట . మొత్తం బిల్డింగ్ కూలి పోయింది .
అంటు రోగమో .. యుద్ధమో వచ్చి జనాలు పోవడం వేరు .
జననాల రేట్ తగ్గి… పిలల్లు తగ్గిపోతే అది గ్రౌండ్ ఫ్లోర్ కూల్చినట్టే . పైన చెప్పిన దేశాల్లో కొన్ని అయినా ..”మా దేశానికి రండి” అంటూ యువతరాన్ని పిలిచే రోజులు త్వరలో వస్తాయి .
“రోబో లు వస్తాయి కదా .. ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయి” .. రోబో లు ఉండగా మనుషులు.. పనులకోసం ఎందుకు?” అని అనుకోకండి . ఆర్థిక సామాజిక సైనిక వ్యవస్థలు సాగాలంటే మనుషులు ఉండాలి .
3. పిల్లల పెంపకాన్ని మొబైల్ కు అవుట్ సోర్స్ చేయకండి
కొంపలో స్మార్ట్ టీవీ ఉంటే అది సంసారానికి ఎసరు పెట్టే ప్రమాదం . పిల్లలకు మీరు ఇచ్చే నిజమయిన ఆస్తి మీ సమయం .
మీ తల్లి తండ్రి మిమ్మల్ని ఎలా పెంచారో .. అలాగే పెంచండి . సామాజిక తెలివి తేటలు … భావోద్వేగ తెలివి తేటలు నేర్పండి . బ్రాండెడ్ బడా బడులు వద్దు .
అక్కడ చేరిస్తే మీ పిలల్లు పరాన్నభుక్కులు… విలాసాలకు బానిసలు అయిపోతారు .అలాగే పరీక్షా కర్మాగారాల్లో చేర్చకండి . ఐఐటీ లు గొప్ప సంస్థలు . ఐఐటీ జేఈఈ పేరుతొ ఆరో తరగతి నుంచే పిల్లల్ని బ్రాయిలర్ కోళ్లుగా మార్చకండి . పిలల్లు చదవాలి . చదువంటే నేర్చుకోవడం . కేవలం ఒక ఎంట్రన్స్ పరీక్షకు తయారు కావడం కాదు .
కుతూహలం , నిరంతర అధ్యయనం , సంపూర్ణ అవగాహన – విశ్లేషణ – అనువర్తన , కుశాగ్ర బుద్ధి అన్నిటికి మించి సృజన .. ఇవి AI యుగం లో ఉద్యోగాలను తెచ్చిపెట్టే నైపుణ్యాలు .
ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఆరోతరగతి నుంచే రుబ్బుడు ప్రారంభం అయితే … కేవలం గణితం భౌతిక శాస్త్రం పై దృష్టి పెడితే ఈ నైపుణ్యాలు చచ్చి పోతాయి .
రుబ్బుడు తట్టుకొని ఐఐటీ లో సీట్ కొట్టినా.. అటుపై ఉద్యోగాలు రావు .ఐఐటీ సీట్ వస్తే .. బిడ్డ ఫోటో పత్రిక లో వచ్చింది అనే తుత్తి సరే . కానీ అటుపై ఉద్యోగం ?
ఐఐటీ లో క్యాంపస్ ప్లేసెమెంట్ 50 % పడిపోయింది .
ఐఐటీ లు అటు పై అమెరికా లో ఉన్నత విద్య చదివి పదేళ్లు ఉద్యోగం చేసి ఇప్పుడు నిరుద్యోగులుగా ఎంతో మంది .
కృతిమ మేధ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఐఐటీ పూర్వ విద్యార్థులే ముందు వరసలో .
పిల్లల్ని “కోడింగ్ కోళ్లు” చెయ్యొద్దు .
చదువు చెప్పండి .
ప్రైవేట్ మెడికల్ కాలేజీ లో చేర్పిస్తే అటుపై వారిలో చాల మంది ఫుడ్ డెలివరీ లాంటి గిగ్ జాబ్స్ చేసుకోవలసిందే .
AI మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ నేర్వాలి .
రాబొయ్యే రోజుల్లో పాలిటెక్నిక్ లు పారామెడికల్ కోర్సు లు జాబ్ గ్యారెంటీ ఇస్తాయి .
4. రాబొయ్యే రోజులల్లో నిజమయిన ఆస్తి ఆరోగ్యం .
డబ్బాల్లో ప్యాకెట్ లలో సీసాల్లో వచ్చే రసాయన రుచులు ప్రాణాలు నెమ్మదిగా హరిస్తాయి .
మీ ఆస్థి ని ఫార్మసురలకు అప్పగిస్తాయి .
ఇంట్లో వండితే వంట .
బయటనుంచి ఆర్డర్ ఇస్తే అది కడుపు మంట . గట్ హెల్త్ దెబ్బ తింటుంది . అటు పై కాన్సర్ .
సహజ ఆహారం తీసుకోండి . వ్యాయామం చేయండి . బాగా నిద్ర పోండి . కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాయిగా కాలం గడపండి .
5. అద్దెలకు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వద్దు. దేశమంతా.. రోడ్లు రవాణా వ్యవస్థ ఊహలకు అందని రీతిలో డెవెలప్ అవుతోంది .
దూరం ఇప్పుడు సమస్య కాదు .
దూరంగా నైనా కాలుష్యం లేని చోట నివసించండి .
సొంత ఇల్లు అయితే సుఖం .
డబ్బుంటే ఊరికి దూరంగా ఎకరా భూమి .
అందులో పెద్ద కిటికీ లు ఉన్న ఇల్లు . ఇంటి బయట అట స్థలం . పళ్ళ తోట .
మీకు డబ్బుంటే… ఓపిక ఉంటే… వ్యవసాయ భూమి . పంటలు పండించాలి . ఆవులు కోళ్లు పెంచాలి . సొంత పొలం లో పండిన రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు వాడని ఆహారం .. రసాయనాలు కలపని పాలు .. పెరుగు .. వెన్నె జున్ను ..మాంసాహారులకు నాటు కోడి గుడ్లు . నాటు కోడి మాసం .
పైన చెప్పిన ఐదింటిలో కనీసం మూడు చేయగలిగితే .. మీరే రేపటి తరం కోటీశ్వరులు .
అంబానీలు ఆదానీలు మీ ముందు దిగదుడుపు .
– వాసిరెడ్డి అమర్నాథ్