– జగన్ హయాంలో గ్రీన్‌కోకి ఇచ్చింది ‘షోకాజ్ నోటీసులు’ మాత్రమే
– ఇప్పుడు వస్తున్నది ‘షోకేస్ ఇన్వెస్ట్మెంట్లు’
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘సిగ్గు’ అనే పదానికి సిలబస్ మార్చేయాల్సిందే! కాకినాడ తీరంలో గ్రీన్కో (AM Green) సంస్థ 83 వేల కోట్ల రూపాయల మెగా ప్రాజెక్టుకు భూమిపూజ చేసినప్పుడు .. తాడేపల్లి ప్యాలెస్ గోడల మధ్య నుంచి ఒక వింత రోదన వినిపించింది. “ఇది మా జగనన్న విజయం.. మా హయాంలోనే సంతకాలు జరిగాయి” అంటూ నీలి మీడియా చేస్తున్న హడావిడి చూస్తుంటే, ‘హంతకుడే వచ్చి బాధితుడికి తలకొరివి పెడతా’ అన్నట్టుగా ఉంది.
జగన్ గారు అధికారంలోకి రాగానే చేసిన మొదటి ‘రాజకీయ విధ్వంసం’ పీపీఏల (PPAs) రద్దు. అప్పట్లో గ్రీన్కో అంటే జగన్ గారికి ఒక భూతంలా కనిపించింది. “చంద్రబాబుకు అనుకూలమైన సంస్థ.. దోచేస్తున్నారు.. ధర తగ్గించాల్సిందే” అంటూ ఆ సంస్థ మెడపై కత్తి పెట్టింది జగన్ ప్రభుత్వం కాదా? ప్రాజెక్టులు పూర్తయి, కరెంటు ఉత్పత్తి అవుతున్నా.. నయా పైసా విదల్చకుండా గ్రీన్కో గొంతు నొక్కిన రోజులు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? తమ పెట్టుబడులను కాపాడుకోవడానికి ఆ సంస్థ, మూడేళ్ల పాటు హైకోర్టు మెట్లు ఎక్కి, జగన్ సర్కార్‌తో ‘న్యాయ పోరాటం’ చేయాల్సి వచ్చింది.
చివరకు హైకోర్టు మొట్టికాయలు వేసి, “బకాయిలు చెల్లించాల్సిందే” అని ముక్కు పిండి వసూలు చేయించే వరకు జగన్ గారి కన్ను చల్లబడలేదు.
గ్రీన్కో సంస్థను కోర్టుకీడ్చి, ఆ సంస్థ క్రెడిట్ రేటింగ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పాతాళానికి తొక్కేసిన ఘనత ముమ్మాటికీ జగన్ బ్యాచ్‌దే. నాడు పీపీఏలు రద్దు చేసి, పరిశ్రమలను తరిమేస్తుంటే.. గ్రీన్కో ప్రతినిధులు భయం భయంగా కోర్టులను ఆశ్రయించిన సంగతి అందరికీ తెలుసు.
ఇప్పుడు అదే సంస్థ వేల కోట్లు పెట్టుబడి పెడుతుంటే.. “అంతా మా వల్లే” అని చెప్పుకోవడం, ‘రివర్స్ టెండరింగ్’ కంటే పెద్ద జోక్. అసలు గ్రీన్కో సంస్థ ఏపీలో నిలబడిందంటే అది జగన్ గారి చలవ వల్ల కాదు.. న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం వల్ల, ప్రస్తుత ప్రభుత్వం కల్పిస్తున్న భరోసా వల్ల మాత్రమే!
పరిశ్రమలను తరిమేయడంలో ‘విజన్’ చూపించిన వారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చూసి తమవే అని మురిసిపోవడం చూస్తుంటే – ఒక ఊరిని తగలబెట్టిన వాడు, అక్కడ కొత్త ఇల్లు కడుతుంటే.. ఆ మంటలు నేనే పుట్టించాను కాబట్టే కొత్త ఇల్లు వచ్చింది అని చెప్పుకున్నట్టు ఉంది. జగన్ గారి హయాంలో గ్రీన్‌కోకి ఇచ్చింది కేవలం ‘షోకాజ్ నోటీసులు’ మాత్రమే! ఇప్పుడు వస్తున్నది ‘షోకేస్ ఇన్వెస్ట్మెంట్లు’.
చివరి మాట: జగన్ గారూ.. క్రెడిట్ కొట్టేయడంలో ఉన్న శ్రద్ధ, ఆనాడు ‘సాంక్టిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్’ (ఒప్పందాల పవిత్రత) కాపాడటంలో చూపించి ఉంటే.. పదకొండు వచ్చేది కాదు. గ్రీన్కో మీపై కోర్టులో గెలిచింది తప్ప.. మీ విధానాలను చూసి మురిసిపోలేదు. మీరు విత్తిన ‘విద్వేషం’ నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.. మధ్యలో మీ క్రెడిట్ గోల దేనికి?
