– అఖిల భారత సర్వసేవ సంఘ్ ప్రధాన కార్యదర్శి గోరంగా చంద్ర మహాపాత్ర డిమాండ్
అన్యాక్రాంతంమైన వెలది ఎకరాల భూదాన భూముల నిగ్గు తక్షణమే తేల్చి, మిగిలి ఉన్న భూదాన భూములను భూమిలేని నిరుపేదలకు పంపిణి చేయాలనీ అఖిల భారత సర్వసేవ సంఘ్ ప్రధాన కార్యదర్శి గోరంగా చంద్ర మహాపాత్ర తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూదాన్ భూములను భూమిలేని నిరుపేదలకు పంచాలని, భూదాన్ యజ్ఞ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, కబ్జా కోరల్లో ఉన్న భూదాన్ భూములను స్వాధీనం చేసుకొని కబ్జాదారులపై కఠిన చెర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత సర్వసేవ సంఘ్ – తెలంగాణ సర్వోదయ మండలి
సంయుక్తంగా సోమవారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద వేలాదిమంది పేదలతో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కు తెలంగాణ సర్వోదయ మండలి సీనియర్ నాయకులూ శాకావత్ చందు నాయక్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా గోరంగా చంద్ర మహాపాత్ర, గౌరవ అతిథులుగా మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా, అఖిల భారత సర్వసేవ సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ షేక్ హుస్సేన్, తెలంగాణ సర్వోదయ మండలి ఉపాధ్యక్షులు మోటూరి కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గోరంగా చంద్ర మహాపాత్ర మాట్లాడుతూ భూదాన్ ఉద్యమంలో ఆనాడు భూస్వాముల వద్ద నుంచి భూములను దానం కింద తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గాంధేయవాది ఆచార్య వినోభాభావే తెలంగాణలో లక్ష డెబ్భై వేల పైచిలుకు ఎకరాలను సేకరించారని గుర్తు చేసారు. భూదాన్ఉద్యమం భూదాన్ చట్టం అనే చట్టాన్ని రూపొందించి, సేకరించిన భూమిని సర్వసేవ సంఘ్ అధికారిక ఉత్తర్వులమేరకు భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటుచేసి భూమిని పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వానికి ఆచార్య వినోభాభావే అప్పగించారని అయన తెలిపారు.
నాడు పేదలకు పంపిణీ చేయగా ఇంకా అందులో సుమారు 90 ఎకరాలు ఇంకా మిగిలి ఉన్నాయని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఒక్క రంగారెడ్డి జిల్లాలో 20 వేల ఎకరాల పంపిణి చేయకుండా ఉండిపోయాయని, పంపిణీ చేయని భూదాన్ భూమిలో 50 శాతం ఇప్పటికే ఆక్రమణకు గురైంది లేదా అనర్హులకు బదిలీ అయిందని అయన ఆవేదన వ్యక్తం చేసారు. రంగారెడ్డి జిల్లాలో అత్యంత ఖరీదైన భూదాన్ భూముల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న బిల్డర్లు తిష్ట వేసికుర్చున్నారని, ల్యాండ్ మాఫియాతో సహా అనధికార వ్యక్తులు ఈ భూములను ఆక్రమించుకున్నారని అయన ఆరోపించారు.
భూదాన్ భూ పంపిణీ అనేది ప్రభుత్వ భూసంస్కరణల సాధనలో కీలకమైన కార్యకలాపం అని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించాలన్నారు. వెంటనే స్పందించి అక్రమార్కులపై కఠినచెర్యలు తీసుకొని భూదాన భూములని స్వాధీనపరుచుకొని, ఇంకా మిగిలి ఉన్న భద్రాన భూములను కూడా భూమిలేని నిరుపేదలకు పంపిణి చేయాలనీ అప్పుడే ఆచార్య వినోభాభావే ఆశయాలు సాదించినట్లవుతుందని గోరంగా చంద్ర మహాపాత్ర పేర్కొన్నారు.
సయ్యిద్ అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణలో వేల కోట్ల విలువైన భూదాన్ కుంభకోణం ప్రపంచంలోనే అతి పెద్దదైన భూ కుంభకోణమని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రభుత్వం హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఎండోమెంట్స్, వక్ఫ్, భూదాన్ భూముల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఫలితంగా భూఅక్రమార్కులు కబ్జాలకు పాల్పడి సొమ్ముచేసుకుంటున్నారని అయన వాపోయారు. భూదాన భూముల అన్యాక్రాంతం పై సిబిఐ విచారణ జరిపించాలని అయన డిమాండ్ చేశారు.
భూమిలేని నిరుపేదలకు భూదాన భూములు పంపిణి చేసేవరకు ఉద్యమాలు కొనసాగుతాయని, శాంతి భద్రతల పేరుతో తెలంగాణ సర్వోదయ మండలి ఆద్యక్తులు ఆర్. శంకర్ నాయక్ ను అర్థరాత్రి అయన ఇంటిపై పోలీసులు దాడిచేసి అరెస్ట్ చేయడాన్ని అజీజ్ పాషా ఖండించారు, తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. షేక్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉదాసీనతతో పేదలకు దక్కాల్సిన భూదాన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి పోతున్నాయన్నారు.
ఆచార్య వినోభాభావే ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.భూదాన్ భూములు పేద ప్రజలకు పంచే వరకు గాంధేయమార్గంలో శాంతియుత ఉద్యమాలు చేస్తామన్నారు. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వివాదాల్లో ఉన్న భూదాన భూముల పరిస్కారం కోసం ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ రెవిన్యూ కోర్ట్ లను ఏర్పాటు చేయాలనీ విజ్ఞావతి చేసారు. భూదాన్ భూమిని భూదాన్ లబ్ధిదారులకు సకాలంలో పంపిణి చేయకపోవడం వల్లే అన్యాక్రాంతం అవుతున్నాయని అయన తెలిపారు.
ఇప్పటికైనా భూబకాసురులపై ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చెర్యలు తీసుకొని భూదాన భూములను పంపిణీ చేయకపోతే ఆక్రమించి తామే పంపిణీ చేస్తామని కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు. ఈ ధర్నా లో తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర నాయకులూ పిత్చి రాజు, గజం మురళి, హనుమ నాయక్, షేక్ మహమూద్, అమీనా, భాస్కర్, ఫామీద, దస్రు, కమ్లి భాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేతలు ఆర్డీఓ ఈ. వెంకట చారి ను కలసి వినతి పత్రం సమర్పించగా ఆయనే స్వయంగా ధర్నాస్థలికి వచ్చి నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని భూదాన భూములు ఆక్రమణలకు గురైనవి, ఎన్ని మిగిలి ఉన్నవి తేల్చాలని అన్ని మండలాల తహసీల్దార్లకు లేఖలు రాస్తానని, తేల్చక ప్రభుత్వానికి తెలిపి భూమిలేని నిరుపేదలను గుర్తించి పంపిణి చేస్తామని తెలిపారు.